చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన శైలిలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన, “ఇది మోగా ఉత్సవం.. విక్టరీ విన్యాసం.. రికార్డుల విధ్వంసం.. డిస్ట్రిబ్యూటర్ల మహదానందం.. ధనాధన్” అంటూ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను తనదైన స్టైల్‌లో మార్చి చెప్పారు.
అలాగే చిరంజీవిపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, “మన శంకర వరప్రసాద్ గారు ఒక ఏటీపీ (ఆల్ టైమ్ ప్రభంజనం). గత రెండు వారాలుగా ఈ ఏటీపీనే మోత మోగిస్తోంది. ఇలాంటి సినిమాలు చిరంజీవి మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. నా ఈ చిరు జర్నీని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను” అని అనిల్ రావిపూడి ఎమోషనల్ అయ్యారు.
సినిమా షూటింగ్ సమయంలో సినీ మేకర్స్, టెక్నీషియన్స్ మొత్తం ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తే, ఆ ప్రభావం కచ్చితంగా తెరపై కనిపిస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇది తాను బలంగా నమ్మే విషయమని స్పష్టం చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ, “నాకు అన్ని సినిమాలూ ఉత్సాహాన్నిస్తాయి. కానీ ఇలాంటి సినిమాలు మాత్రం మరింత జోష్ ఇస్తాయి. సినిమా ఫలితాల విషయంలో తప్పు ఉంటే అది నాదే అని అనుకుంటాను. ఎవరిమీదా నెట్టను. ప్రతి సినిమాకీ ఒకేలా కష్టపడతాం, ఇష్టంగానే పూర్తి చేస్తాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం జీవితాంతం మర్చిపోలేని ఉత్సాహాన్ని ఇస్తాయి” అని అన్నారు. చిరంజీవి స్పీచ్ సైతం తమ ఫ్యాన్స్ తో పాటుగా సినీ వర్గాల్లోనూ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మూవీటీమ్‌తోపాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు సక్సెస్ షీల్డ్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాఘవేంద్రరావు, వీవీ వినాయక్, నిర్మాత దిల్ రాజు పాల్గొని టీమ్‌కు షీల్ద్‌లను అందించారు. చిరంజీవి, వెంకటేష్‌తోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
