ARI Movie Review: ‘అరి’ మూవీ రివ్యూ.. డైరెక్టర్ జయ శంకర్ వినూత్న ప్రయత్నం ఫలించిందా?

ARI Movie Review: ‘అరి’ మూవీ రివ్యూ.. డైరెక్టర్ జయ శంకర్ వినూత్న ప్రయత్నం ఫలించిందా?

వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘అరి’(ARI). మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్‌‌ లైన్. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇవాళ (2025 అక్టోబర్10న) థియేటర్లలో విడుదలైంది. ఏషియన్ సురేష్​ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీపై ముందునుంచే భారీ అంచనాలున్నాయి.

మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు సినిమా కథనంపై ప్రశంసించారు. ఇటీవల అరి ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి తమ బెస్ట్ విషెస్ సైతం అందించారు. ఈ క్రమంలో వినూత్న కాన్సెప్ట్తో థియేటర్కి వచ్చిన అరి మూవీ ఎలా ఉంది? డైరెక్టర్ జయశంకర్‌ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు? ముందస్తు అంచనాలను ‘అరి’ అందుకుందా? లేదా? అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

‘కోరికలు తీర్చబడును’ అనే యాడ్కు ఆకర్షితులై.. ఆరుగురు వ్యక్తులు (సాయికుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యగార్, సురభి ప్రభావతి, సూర్య) ఓ పబ్లిక్ లైబ్రరీలో ఒక వ్యక్తి (వినోద్ వర్మ)ని కలుస్తారు. వాళ్లలో ఒకొక్కరిది ఒక్కో కోరిక. కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలకు వారి కోరికలు ప్రతీకలు. ఆ కోరికలు నెరవేరాలంటే తను ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేయాలని అతను కండిషన్ పెడతాడు. వాళ్ల కోర్కెలు నెరవేరాయా.. ఇంతకు అతను ఎవరు.. ఎందుకు వీళ్లను టార్గెట్ చేసాడు.. టాస్క్లు పూర్తి చేసే క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటి అనేది మిగతా కథ.

►ALSO READ | Bigg Boss Season 9: బిగ్ బాస్‌ హౌస్‌లో నాగార్జున డైరెక్టర్.. మరింత రసవత్తరంగా మారిన షో!

ఎలా ఉందంటే..

‘అరి’ అంటే సంస్కృతంలో శత్రువు అని అర్థం. మనిషిలో ఉండే అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కాన్సెప్ట్‌ను ఈ సినిమాకు ప్రధాన కథాంశంగా ఎంచుకున్నారు దర్శకుడు జయశంకర్. అరిషడ్వార్గాలను జయించడం ఆషామాషీ వ్యవహారం కాదు.  చరిత్ర, పురాణాల్లోని గొప్ప వ్యక్తులు కూడా ఈ ఆరు బలహీనతల ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రస్తుత ఆధునిక సమాజంలోని మనుషులు ఆ బలహీనతలకు తలొగ్గి ఎంతటి ఘోరం చేయడానికి వెనుకాడటం లేదు. అలాంటి ఓ ఆరుగురు వ్యక్తుల జీవితంలో ఎదురైన సంఘటనలే ఈ ‘అరి’. 

కామం: హోటల్‌లో టీ మాస్టర్‌గా పని చేసే అమూల్ కుమార్ (వైవా హర్ష)కి సన్నీ లియోన్‌తో ఒక్క రాత్రి అయినా గడపాలని కోరిక. 
క్రోధం/మాత్సర్యం: నిధి కోసం వేటాడుతున్న ఇన్‌స్పెక్టర్ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) మరియు తన సహోద్యోగి కంటే అందంగా కనిపించాలని కోరుకునే ఆత్రేయి (అనసూయ).
మోహం: చనిపోయిన భర్తను తిరిగి కోరుకునే లక్ష్మీది ఆశ (సురభి ప్రభావతి).
మదం: డబ్బు, హోదాతో శాశ్వతంగా బతకాలని ఆశించే విప్లవ్ నారాయణ్ (సాయి కుమార్).
లోభం: ఉమ్మడి కుటుంబ ఆస్తిని దక్కించుకోవాలని చూసే గుంజన్ (శుభలేఖ సుధాకర్). 

మనిషి మనసులో పది తలలున్న రావణుడు కాదు, కేవలం ఆరు తలలున్న అరిషడ్వర్గాలు ఎంతటి విధ్వంసం సృష్టిస్తాయో ఈ సినిమాలో డైరెక్టర్ జయశంకర్ లోతుగా చూపించారు.నిజానికి ఈ ఆరు ఏమిటనేది చాలామందికి తెలుసు.. కానీ అవి తమలో ఉన్నాయని, వాటి ప్రభావానికి లోనవుతున్నామనే విషయమే తెలియదు.  మనసు పెట్టి ఆలోచించాలి.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను అవలోకనం చేసుకోవాలే కానీ అవే మనకు అరిషడ్వర్గాలను అధిగమించే పరిష్కార మార్గాలకు దారి చూపిస్తాయి అనేది దర్శకుడు ఫైనల్‌గా ఇచ్చిన కంక్లూజన్‌.

ఎవరెలా నటించారంటే:

సాయి కుమార్,  అనసూయ, శుభలేఖ సుధాకర్,  శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అమూల్ కుమార్‌‌గా హర్ష క్యారెక్టర్‌‌లోని ఫన్ ప్లస్ అయింది. కీలకపాత్ర పోషించిన వినోద్ వర్మ నటనలో ఇంకాస్త పరిణితి చూపించాల్సి ఉంది.  సురభి ప్రభావతి, సూర్య పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నీకల్ అంశాలు:

వైవిధ్యమైన కథను ఎంచుకున్న దర్శకుడు ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం కొంత తడబడ్డాడు.  తర్వాత ఏం జరగబోతోంది అనే ఉత్సుకత, ఆసక్తిని కలిగించి ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. అనూప్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది తప్ప ప్లస్‌ అవలేదు. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్‌ సహా ఇతర శాఖలన్నీ బడ్జెట్‌ పరిమితులకు లోబడి ఉన్నాయి. 

ఫైనల్‌గా...

ప్రమోషన్స్‌లో చెప్పినట్టు ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో అంతగా టచ్ చేయని కాన్సెప్ట్‌నే దర్శకుడు జయశంకర్ ఎంచుకున్నాడు.  ప్రథమార్థంలో ఆరు పాత్రల  పరిచయం, వారి బలహీనతలను పరిచయం చేసిన ఆసక్తి కలిగించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో వాళ్లలో వచ్చిన పరివర్తనతో కథను ముగించాడు. ఇలాంటి సంక్లిష్టమైన కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆరు పాత్రలను ఎంచుకున్న విధానం, వారికి ఇచ్చిన టాస్క్‌లు, చివర్లో ఒక పాత్రను మరో క్యారెక్టర్‌‌తో కనెక్ట్ చేయడం లాంటివి ఆకట్టుకున్నాయి.

అయితే సీరియస్‌గా జరుగుతున్న కథలో వచ్చిన బీచ్ సాంగ్,  శ్రీనివాసరెడ్డి,  చమ్మక్ చంద్రలపై తీసిన కామెడీ కథనానికి అడ్డు తగిలాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌ ఆకట్టుకున్నాయి. కథతో పాటు కథనంలో కూడా ఇంకాస్త దృష్టి సారించి ఉంటే  ఫలితం మరో స్థాయిలో ఉండేది.