23 Review: వ్యవస్థను ప్రశ్నించే కథతో మల్లేశం డైరెక్టర్.. 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదంపై మూవీ

23 Review: వ్యవస్థను ప్రశ్నించే కథతో మల్లేశం డైరెక్టర్.. 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదంపై మూవీ

మల్లేశం, 8 ఎ.ఎమ్ మెట్రో చిత్రాల తర్వాత దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటికి చెందిన స్టూడియో 99 సంస్థ నిర్మించింది. స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేసింది. నేడు శుక్రవారం (మే16న) సినిమా థియేటర్లలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

1991 చుండూరు ఊచకోత, 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదం, 1997 జూబ్లీహిల్స్ కారు బాంబు దాడి ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కేవలం ఘటనలనే చూపించడం కాకుండా, వాటి వెనుక ఉన్న ఆందోళన, జరిగిన దారుణ హింస కళ్ళకు కట్టినట్లుగా మూవీను దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కించాడు. 

ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్తో వచ్చిన ఈ సినిమా ఎలాంటి నిజాలు వెల్లడించింది? రాజ్ చెప్పిన కథలో న్యాయం ఎవ‌రి వైపు నిలిచింది? అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

1991 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చుండూరులో కథ మొదలవుతుంది. ఓ థియేటర్లో సినిమా చూస్తున్న ఒక దళితుడు అనుకోకుండా ఒక పెద్దింటి అమ్మాయి కాలు తొక్కుతాడు. దాంతో ఆ దళితుడు తప్పయింది.. క్షమించమని అడుగుతాడు. అక్కడితో ఆగకుండా అగ్ర కులం వాళ్లు ఆ దళితున్ని విచక్షరహితంగా కొట్టి, పోలీసు స్టేషనులో కేసు పెడతారు. అలా ఈ గొడవ పెద్దదైపోయి ఆ ఊర్లో ఉన్న మరో 8 మంది దళితుల్ని వెంటాడి చంపేలా మారణకాండ సృష్టిస్తారు.

Also Read :  క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది

ఈ క్రమంలోనే.. 1993లో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ (తేజ), సుశీల (తన్మయ) ప్రేమించుకొంటారు. సాగర్కు దాస్ అనే ఒక స్నేహితుడు ఉంటాడు. సుశీలను పెళ్లి చేసుకుని బ్రతకడం కోసం ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలని చూస్తాడు.

కానీ, అడుగడున డబ్బుల సమస్య ఎదురువుతోంది. ఈ క్రమంలో అతని స్నేహితుడితో కలిసి బస్సు దోపిడీ చేయాలనీ నిర్ణయించుకుంటాడు. బస్సులో ఉన్న ప్రయాణికులను బెదిరించి, భయపెట్టడానికి వారి వెంట పెట్రోల్ తీసుకుని వెళ్లగా.. 
బస్సులో పెట్రోల్ పోసి.. కంగారులో అంటించేస్తాడు సాగర్.

అందులో ఉన్న 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఇంతటి మరణహోమానికి కారణమైన వీరికి కోర్ట్ ఉరి శిక్ష వేస్తుంది. అయితే ఇది జరిగిన నాలుగేళ్లకు అంటే 1997లో జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టులో 28 మంది అమాయకులు చనిపోతారు. ఈ మూడు ఘటనల నేపథ్యంలో జరిగిన ఉదాంతం ఏదైతే ఉందో.. అది ఉహించడానికి కూడా కష్టతరమైంది. బాధితుల వేదన తీరనిది. 

ఇలా 1991 చుండూరు మారణకాండ, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టు కేసుల్లో న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇచ్చింది? అగ్ర వ‌ర్ణాలు, అణ‌గ‌దొక్క‌బ‌డుతున్న వ‌ర్గాల ప్రజల పక్షాన న్యాయం నిలబడిందా?  మూడు ఘ‌ట‌న‌ల్లోనూ ఉన్న నేరస్థులకు భారత న్యాయస్థానాలు ఎటువంటి శిక్షలు విధించాయి? అనేది మిగతా స్టోరీ. 

విశ్లేషణ:

అగ్ర వ‌ర్ణాలు, అణ‌గ‌దొక్క‌బ‌డుతున్న వ‌ర్గాల మ‌ధ్య అంతరమే ఈ సినిమా. ఒక ఘటన తర్వాత మరొకటి చూపిస్తూ ఒకరికి తక్కువ శిక్ష.. మరొకరికి ఎక్కువ శిక్ష ఎందుకు పడింది అనేది చర్చించడమే మూవీ మెయిన్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌. ఈ ఘటనలు జరిగి చాలా కాలమైనా పరిస్థితులు ఏమీ మారలేదు. ఒక తప్పు జరిగితే ఒక వ్యక్తికి 24 గంటల్లో బెయిల్ వస్తోంది. అదే తప్పు చేసిన మరొకరికి రెండేళ్ళకి కూడా బెయిల్‌‌‌‌‌‌‌‌ రాదు. అందుకే ఈ సమస్య ఇప్పటికీ రిలెవంట్‌‌‌‌‌‌‌‌గానే ఉంది.

నిజానికి ఇది చాలా కష్టమైన, సున్నితమైన అంశం. ఇలాంటివి తీయడం వెరీ చాలెంజింగ్. ఎక్కువ లొకేషన్స్, టైం ఫ్రేమ్స్ లో రాయడం.. దాన్ని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించడం చాలా కష్టం. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. కానీ అలా ఎందుకు జరగడం లేదని వ్యవస్థను ప్రశ్నించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. 

సాగర్ తన స్వార్ధం కోసం 23 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నది క్షమించరాని తప్పే. కానీ, ఇలాంటి తప్పులు జరిగిన ఘటనల్లో ఎంతమందికి సాగర్ లాంటి శిక్షలు పడ్డాయి. ఇక్కడ ఎవరు మంచోళ్ళు కాదు. కానీ, చెడ్డవాళ్ళైనా అందరికీ ఒకేరకమైన శిక్షలు ఎందుకు పడవు? అని ప్రశ్నంచిన విధానం బాగుంది. 32 ఏళ్లుగా ఇప్పటికీ వాళ్ళు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారట. అది వారు చేసిన క్షమించరాని నేరానికి పడిన శిక్ష. ఇందులో న్యాయం ఉంది.

కానీ, 1991,1997 అక్క‌డా ప్రాణాలు పోయాయి. ఇక్క‌డా ప్రాణాలు పోయాయి. న్యాయం జ‌రిగితే వాళ్ల‌కూ శిక్ష ప‌డాలి. వీళ్లకూ ప‌డాలి. కానీ 1991 చుండూరు మారణకాండ,1997 జూబ్లీ హిల్స్ బాంబు కేసుల్లో నేరస్థులైన వారికి శిక్షలు ఎందుకు సమర్ధవంతగా పడలేదు.? ఎందుకంటే, చిలకలూరిపేట బస్సు దహనంలో ఉన్న నేరస్థుడు దళితుడు. కానీ, మిగతా ఇన్సిడెంట్ లో నేరస్థులు అగ్రకులాల వారు. ఈ వివ‌క్ష‌త ఎందుకు చూపించాల్సివ‌చ్చింది? అనే కోణంలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అందర్నీ ఆలోచింపజేస్తుంది.