మనసుతో కథలు రాస్తూ ... మైండ్‌ పెట్టి సినిమాలు తీస్తూ

మనసుతో కథలు రాస్తూ ... మైండ్‌ పెట్టి సినిమాలు తీస్తూ

తన పనేదో తాను చూసుకునే ఓ కుర్రాడు చదువుకోనలేని నిస్సహాయత స్నేహితుడి ప్రాణాలు తీయడం చూసి తట్టుకోలేకపోతాడు. తమలాంటి పేదవాళ్లందరికీ విద్యను అందించేందుకు దొంగగా మారతాడు. తన బాధ్యతను నిర్వర్తించి ‘జెంటిల్‌మేన్‌’ అనిపించుకున్నాడు. ఒక అమాయకమైన అబ్బాయి. కళ్లముందే తన చెల్లెలి మరణాన్ని చూస్తాడు. దానికి కారణం వ్యవస్థలోని లోపాలేనని తెలుసుకుంటాడు. వాటిని సరిదిద్దేందుకు నడుం బిగిస్తాడు. ‘అపరిచితుడు’గా మారి అందరినీ పరుగులెట్టిస్తాడు. ‘భారతీయుడు’ లంచగొండితనాన్ని తరిమికొడితే... ‘ఒకే ఒక్కడు’ రాజకీయ వ్యవస్థనే ప్రక్షాళన చేశాడు. ‘శివాజీ’ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఊహించని స్థాయికి తీసుకెళ్తే.. ‘రోబో’ కూడా మనిషిగా మారి మానవత్వాన్ని పంచుతాడు. ఈ అద్భుతాలన్నీ శంకర్‌‌ సినిమాల్లో జరుగుతాయి. ఆయన సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే ఆయన మనసుతో కథలు రాస్తారు. మైండ్‌ పెట్టి వాటిని తెరకెక్కిస్తారు. క్రియేటివిటీకి ఇంటెలిజెన్స్ మిక్స్ చేసి మేకింగ్‌తో మనసులు దోచుకుంటాడు. అందుకే ఇండియన్ సినిమా రంగంలో శంకర్‌‌ది ఓ స్పెషల్ ప్లేస్. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా కొన్ని ఇంటరెస్టింగ్ ఫ్యాక్స్ట్ తెలుసుకుందాం.

యాక్టర్ అవ్వాలనుకుని..

మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన శంకర్.. మొదట నటుడవ్వాలనుకున్నారు. వసంత రాగం, సీత తదితర సినిమాలతో యాక్టర్‌‌గా కెరీర్‌‌ స్టార్ట్ చేశారు. ఆయన అలాగే కంటిన్యూ అయి ఉంటే దేశం ఓ గొప్ప దర్శకుడిని మిస్ అయిపోయేది. కానీ అలా జరగకపోవడానికి కారణం హీరో విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్. శంకర్ నాటకాలు రాసి ఫ్రెండ్స్ తో కలిసి ప్లే చేసేవాడు. వాటిని చూసిన చంద్రశేఖర్ కు శంకర్ రైటింగ్ స్టైల్ నచ్చి తనకి అసిస్టెంట్‌గా చేయమని అడిగారు. అందుకు ఓకే చెప్పిన ఆయన.. అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. రాజేష్ ఖన్నాతో తీసిన ‘జై శివ్ శంకర్‌‌’ మూవీతో మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పవిత్రన్ దగ్గర కూడా సహాయ దర్శకుడిగా పని చేసిన శంకర్.. చివరికి తానే డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు.

మెమొరబుల్ జర్నీ..

1993లో ‘జెంటిల్‌మేన్’ సినిమా కోసం మొదటిసారి మెగాఫోన్ పట్టారు శంకర్. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్. విద్యావ్యవస్థలోని లోపాలపై ఆయన సంధించిన బాణం సూటిగా తాకడంతో అందరి ప్రశంసలు దక్కాయి. ఆ వెంటనే ఒక లవ్‌ స్టోరీని తీసుకున్నారు శంకర్. అయితే ‘ప్రేమికుడు’ రొటీన్‌ లవ్‌ ఎంటర్‌‌టైనర్‌‌లా అనిపించలేదు. అంతవరకు డ్యాన్సులతో అదరగొట్టిన ప్రభుదేవాలో ఎంత సీరియస్ నటుడున్నాడో, ఎమోషన్స్ ను ఎంత అద్భుతంగా పండించగలడో చూపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. టెర్రరిజం టచ్ కూడా ఇవ్వడంతో కొత్త ఫ్లేవర్ వచ్చింది. ఇక కమల్ హాసన్‌తో తీసిన ‘భారతీయుడు’ ఓ సెన్సేషన్. లంచగొండితనంతో దేశం ఎలా నాశనమవుతోందో చూపారు. ఇక ‘రోబో’ చూశాక అందరికీ మతులు పోయాయి. ఇలాంటి ప్రయోగాలు హాలీవుడ్‌లో మాత్రమే జరుగుతాయనుకున్న ఇండియన్ ఆడియెన్స్ కు శంకర్ మనమేం తక్కువ కాదని నిరూపించారు. నిజాయతీపరుడు ఒక రోజు పాలించినా ఎంత మార్పు వస్తుందో ‘ఒకే ఒక్కడు’లో చూపించిన తీరుకి జనం ఫిదా అయ్యారు. అలక్ష్యం ఎంత ప్రమాదకరమో ‘అపరిచితుడు’ ద్వారా చెప్తే వారేవ్వా అన్నారు. ‘జీన్స్’ ద్వారా ప్రేమను సరికొత్తగా చూపించిన తీరు ప్రేక్షకులకు తెగ నచ్చింది. కొందరు ‘బాయ్స్’ సింపుల్‌ జీవితాల్నిఎంతో స్పెషల్‌గా మార్చేసిన విధానం మెప్పించింది. విదేశాల నుంచి స్వదేశాన్ని బాగు చేయాలని ‘శివాజీ’ పడిన తపనని తెరకెక్కించిన శైలి గొప్పగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే  ప్రతి సినిమాలోనూ శంకర్ ముద్ర కచ్చితంగా ఉంటుంది. ఇది శంకర్ సినిమా అని బల్లగుద్ది చెప్పినట్టుంటుంది. అందుకే ఆయన మేకింగ్‌ స్టైల్‌ అందరికీ ఫేవరేట్. 

అదే ఆయన మ్యాజిక్..

బడ్జెట్‌ ఎక్కువ పెట్టేస్తాడు, నిర్మాతలకి సినిమాను భారంగా మారుస్తాడని చాలా మంది శంకర్‌‌ని విమర్శిస్తుంటారు. అయితే అతను ఖర్చు పెట్టించే ప్రతి పైసా తెరపై కనిపిస్తుంది. శంకర్‌‌ సినిమా విజువల్‌, కంటెంట్‌, పర్‌‌ఫార్మెన్సెస్ పరంగా  చాలా రిచ్ గా ఉంటుంది. సౌత్ సినిమాని హైటెక్ సినిమాగా మార్చింది శంకరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్‌‌కి కాంప్రమైజ్ అవ్వడం తెలీదు. అందుకే ప్రతి సినిమాలోనూ పాటలు అద్భుతంగా ఉంటాయి. అంతటా మారుమోగుతుంటాయి. ఎంచుకునే నటీనటులు శంకర్ సినిమాలకి మరో ప్లస్. కమల్, రజినీ, విక్రమ్, అర్జున్ లాంటి గ్రేట్ యాక్టర్స్ ను సెలెక్ట్ చేసుకోవడమే ఆయన మొదటి సక్సెస్. ఆయన థాట్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరెంటు తీగ వర్షపు నీటిలో పడితే, ఆ నీటిలో అడుగుపెట్టి ఓ చిన్నారి చనిపోతుంది. ‘అపరిచితుడు’లో ఆ సీన్‌ చూసి చెమ్మగిల్లని కన్నులేదు. చేసేది తప్పు అని తెలిసినా జెంటిల్‌మేన్ సినిమాలో అర్జున్‌కి శిక్షపడకూడదని కోరుకోనివారు లేరు. లంచగొండి అయిన కొడుకుని సైతం భారతీయుడు చంపేస్తుంటే కదిలిపోని హృదయం లేదు. సెంటిమెంటుతో చుట్టేయడం.. ఎమోషన్స్ తో కట్టేయడం.. ప్రేక్షకుడిని కథలోకి బలంగా లాగి అందులోనే ఉంచేయడం శంకర్‌‌కి బాగా తెలిసిన మ్యాజిక్. అది వర్కవుటవడం వల్లే ఆయన లెజెండరీ డైరెక్టర్ అయ్యారు. భారతీయ ప్రేక్షకులంతా ఆయన అభిమానులయ్యారు.

నిర్మాతగానూ..

ఓవైపు దర్శకుడిగా సత్తా చాటుతూనే నిర్మాతగానూ అడుగు ముందుకేశారు శంకర్. ముఖ్యంగా డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రొడ్యూసర్‌‌గా అవతారమెత్తారు. ఆయన నిర్మించిన ‘ప్రేమిస్తే’ చాలా పెద్ద హిట్టైంది. వడివేలు హీరోగా చేసిన ‘హింసించే రాజు 23వ పులికేశి’ కూడా సక్సెస్‌ అయింది. వెయిల్, కల్లూరి, అరయిన్ 305 కడవుల్, ఈరమ్, రెట్టై సుళి, ఆనంద పురత్తు వీడు లాంటి చిత్రాలతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు శంకర్.

తడబడినా తప్పేం లేదు..

లైఫ్‌లో గెలుపోటములు సహజం. ఎంతటివారైనా ఏదో ఒక సమయంలో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. శంకర్‌‌కీ వచ్చింది. ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసిన ‘ఐ’ సినిమా ఆయనను పెద్ద దెబ్బే కొట్టింది. ఎంతో అందంగా ఉండే విక్రమ్‌ని అంత వికారమైన రూపంలో చూడలేక ఆడియెన్స్ ముఖం తిప్పుకున్నారు. కంటెంట్ పరంగా కూడా శంకర్‌‌ స్థాయికి కాస్త తక్కువగా ఉంటుంది. దీంతో  ‘ఐ’. మూవీ ఫెయిలైంది. బాలీవుడ్ మూవీ ‘త్రీ ఇడియట్స్’ని స్నేహితులుగా రీమేక్ చేసినా సక్సెస్ కాలేదు. ఎవరో తీసిన సినిమాని రీమేక్ చేయాల్సిన అవసరం శంకర్‌‌లాంటి ఇంటలెక్చ్యువల్‌కి లేదని చాలామంది ఫీలయ్యారు. ఇక ‘2.ఒ’ టెక్నికల్‌గా సంచలనం సృష్టించినా.. కథ, కథనాల పరంగా డిజప్పాయింట్ చేసింది. శంకర్ సినిమాల్లో ఉండే ఎమోషన్స్ తగ్గడమే అందుకు కారణం.


అయితేనేం.. తడబడినంత మాత్రాన తప్పేం లేదు. శంకర్‌‌ సత్తువ ఇంకా అయిపోలేదు. కచ్చితంగా మరో అద్భుతమైన కాన్సెప్ట్ తో వస్తాడు. ఈ నమ్మకమే రామ్‌ చరణ్‌తో తీస్తున్న సినిమాపై అంచనాలను పెంచేసింది. మరోవైపు ‘ఇండియన్ 2’ కూడా పెండింగ్‌లో ఉంది. అటు రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ హిందీలోకి రీమేక్ అవుతోంది. వీటన్నింటిలో శంకర్ మ్యాజిక్‌ని మళ్లీ చూడొచ్చనేది ప్రేక్షకుల ఆశ, విశ్వాసం. వాటిని శంకర్ నిలబెట్టుకుంటారని ఆశిస్తూ.. మరిన్ని గొప్ప సినిమాలతో ఇండియన్ సినిమాని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్తారని నమ్ముతూ.. శంకర్‌‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.