బేబీ.. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ

బేబీ..  ట్రై  యాంగిల్ లవ్ స్టోరీ

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై ఎస్.కె.ఎన్ నిర్మించిన చిత్రం జులై 14న విడుదల కానుంది. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి లాంచ్ చేశారు. ‘మొదటి ప్రేమకి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అనే కొటేషన్‌తో మొదలైన ట్రైలర్ ఇంటెన్స్ లవ్‌ స్టోరీగా ఇంప్రెస్ చేస్తుంది. ఆటో డ్రైవర్ పాత్రలో ఆనంద్, డాక్టర్‌‌గా విరాజ్, స్టూడెంట్‌ పాత్రలో వైష్ణవి కనిపిస్తున్నారు. వీరి ముగ్గురి మధ్య సాగిన ట్రై  యాంగిల్ లవ్ స్టోరీనే ‘బేబీ’ కథ. 

ట్రైలర్ లాంచ్ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ‘విజయ్ ఉన్నాడు కాబట్టి ఆనంద్ హీరో అవ్వలేదు. యూఎస్‌లో మంచి జాబ్ చేసే ఆనంద్..  సినిమాలపై ప్యాషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చాడు. తను ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ‘బేబీ’ మరో ఎత్తు. యాక్టర్‌‌గా మరో లెవెల్‌కి వెళ్లాడు. విరాజ్, వైష్ణవి, సాయి రాజేష్‌లకు ఆల్‌ ద బెస్ట్’ అని చెప్పాడు. ‘సినిమా చూసిన తర్వాత ఒక వారం పాటు గుర్తుండిపోయే డైలాగ్స్, ఎమోషన్‌, మ్యూజిక్ ఇందులో ఉన్నాయి’ అన్నాడు ఆనంద్.  సినిమాలోని ప్రతి పాత్రకు అందరూ కనెక్ట్‌ అవుతారని చెప్పాడు విరాజ్.  డెప్త్ ఉన్న పాత్రల్లో నటించడం అదృష్టం అంది వైష్ణవి. కచ్చితంగా మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పాడు సాయి  రాజేష్. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నాడు ఎస్‌.కె.ఎన్. నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు మారుతి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.