జులై నెల పింఛన్ ఇవ్వాలంటూ దివ్యాంగుల ఆందోళన

జులై నెల పింఛన్ ఇవ్వాలంటూ దివ్యాంగుల ఆందోళన
  • రోడ్డెక్కిన దివ్యాంగులుజులై నెల పింఛన్ ఇవ్వాలంటూ ఆందోళన
  • సూర్యాపేటలో నేషనల్ హైవేపై బైఠాయింపు
  • 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
  • దివ్యాంగులను అరెస్ట్ చేసిన పోలీసులు

సూర్యాపేట, వెలుగు: పింఛన్ల కోసం దివ్యాంగులు రోడ్డెక్కారు. జులై నెల ఆసరా పింఛన్ సెప్టెంబర్ వచ్చినా పంపిణీ చేయకపోవడంతో హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై బైఠాయించారు. తమకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేతిలో డబ్బులు లేక మందులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. దివ్యాంగుల ఆందోళనతో నేషనల్ హైవేపై దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు.

కార్డుల పంపిణీ పేరుతో జాప్యం

సూర్యాపేట జిల్లాలో 38,313 వృద్ధాప్య పింఛన్లు, 18,552 దివ్యాంగ, 51,672 వితంతు, 862 చేనేత, 6,542 కల్లు గీత, 6,545 ఒంటరి మహిళా పింఛన్లు ఉన్నాయి. మొత్తం 1,22,486 మందికి నెలకు రూ.30.12 కోట్లను ప్రభుత్వం అందిస్తున్నది. జులై నెలకు సంబంధించిన పింఛన్లు ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు విడుదల చేసినప్పటికీ చివరి నిమిషంలో ఆసరా కార్డులను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. కొత్త పింఛన్లతో పాటు పాత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటన చేసింది. కొత్తగా మరో 12,778 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్ల కోసం పాత లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కొత్త, పాత పింఛన్ల పంపిణీకి ఇంకో వారం రోజులు పట్టొచ్చని ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో దివ్యాంగులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై బైఠాయించారు. దీంతో రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు దివ్యాంగులను అరెస్ట్ చేసి ట్రాఫిక్‌‌‌‌ను క్లియర్ చేశారు. కొంతమంది దివ్యాంగులు పోలీసుల నుంచి తప్పించుకొని చివ్వెంల మండలం గుంజలూరు వద్ద రోడ్డుపై నిరసనకు దిగారు. అక్కడా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.