
- గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పంపిణీ
- సెర్ఫ్ ఎంక్వైరీలో బయటపడ్డ లెక్కలు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో వేలాది మంది అనర్హులకు గుడ్డిగా ఆసరా పింఛన్లు మంజూరు చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏనాడూ ఈ స్కీమ్‌పై ఎంక్వైరీ చేసి, అనర్హులను ఏరివేయలేదు. మరోవైపు పింఛన్ల కోసం అర్హులు పెట్టుకున్న అప్లికేషన్లను ఏండ్లకేండ్లు పెండింగ్పెట్టారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగమయ్యాయి. ఇటీవల అనర్హులను ఏరివేసేందుకు రాష్ట్రప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేపట్టగా అక్రమాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి వారసులు అడ్డదారిలో ఆసరా పింఛన్ పొందుతున్నట్టు తేలింది. వీరంతా తమ రిటైర్మెంట్ పెన్షన్‌తో పాటు ఆసరా పింఛన్లు కూడా జేబులో వేసుకున్నారు. కాగా, వీరిలో 3,824 మంది ఇప్పటికే చనిపోయినా.. వారి అకౌంట్లలో పింఛన్లు జమవుతున్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. కాగా, జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్లను ప్రభుత్వం బంద్పెట్టింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏకంగా 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నట్టు బయటపడింది.
రెండు రకాల పింఛన్లు పొందుతున్నందుకే నోటీసులు: మంత్రి సీతక్క
రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య, ఫ్యామిలీ రెండు రకాల పింఛన్లను1,826 మంది పొందుతున్నట్టు ట్రెజరీ శాఖ గుర్తించిందని మంత్రి సీతక్క తెలిపారు. వారందరికీ రికవరీ నోటీసులు పంపిందని, అందులో భాగంగానే దాసరి మల్లమ్మకు నోటీసులు ఇచ్చారని ఒక పత్రిక ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కొందరు ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.