మెదక్​ జిల్లాలో ఇష్టారీతిన కంపెనీ రసాయన వ్యర్థాల విడుదల

మెదక్​ జిల్లాలో ఇష్టారీతిన కంపెనీ రసాయన వ్యర్థాల విడుదల

మెదక్​ జిల్లాలోని కొన్ని ఫ్యాక్టరీల నిర్లక్ష్యంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టారీతిన రసాయన వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ విడుదల చేస్తుండటంతో గాలి, నీరు కలుషితమవు తున్నాయి. ఈ పరిస్థితి జిల్లాలో ఇటీవల పెరగడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. 

మెదక్ (శివ్వంపేట, చేగుంట), వెలుగు: మెదక్​ జిల్లాలోని మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, శివ్వంపేట, నర్సాపూర్ మండలాల్లో ఎక్కువగా స్టీల్, ఫార్మా, పౌల్ట్రీ, ఆయిల్, పేపర్ తయారీ, తదితర పరిశ్రమలు ఉన్నాయి. కొన్ని పరిశ్రమల్లో ప్రొడక్షన్ ప్రాసెస్ అయ్యాక వెలువడే వ్యర్థ రసాయన జలాలను ఇష్టారీతిగా ఎక్కడబడితే అక్కడ వదిలేస్తున్నారు. రసాయనాలతో కూడిన నీరు పారడంతో వ్యవసాయ భూములు నిస్సారంగా మారుతున్నాయి. వేసిన పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. వ్యర్థ రసాయన జలాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో బోర్లలో నుంచి కలుషిత జలాలు వస్తుండటం ఇందుకు నిదర్శనం. చిన్నశంకరంపేట, శివ్వంపేట మండలాల్లోని వివిధ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో పొగ వెలువడుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  

పాడవుతున్న చెరువులు!
కంపెనీల వ్యర్థ జలాలతో చెరువుల్లోని నీళ్లు కలుషితమవుతున్నాయి. ఆ నీటిని పంటలకు వాడలేని పరిస్థితి. పశువుల దాహార్తి తీర్చేందుకు, చేపలు పెంచేందుకు వీలులేకుండా పాడవుతున్నాయి. 

  • చేగుంట మండలం పోలంపల్లి, చందయిపేట, అనంతసాగర్, రెడ్డిపల్లి, వడ్యారం గ్రామాల పరిధిలో ఉన్న కంపెనీలు ఎక్కువ  కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. 
  • శివ్వంపేట మండలం నవాపేట్ పరిధిలోని రెండు కెమికల్ కంపెనీలు వ్యర్థ రసాయనాలను వ్యవసాయ భూముల్లోకి వదులుతున్నాయి. దీంతో స్థానిక బోర్లలో కూడా దుర్వాసనతో నీళ్లు వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్​ పంటలపై కూడా పడుతోందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంపెనీ వ్యర్థాలతో నీరు కలుషితం కావడంతో సాంబయ్య చెరువులోని చేపలు చనిపోయాయి. ఆయా కంపెనీల నుంచి వెలువడే  దుర్వాసనతో ఊళ్లలో ఉండలేక పోతున్నామని స్థానిక గ్రామాల ప్రజలు పలుమార్లు ఆందోళన చేశారు. శనివారం మనోహరబాద్ మండలం రంగాయిపల్లి గ్రామస్తులు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామంటూ చెట్లగౌరారంలోని అగర్వాల్ ఫౌండ్రీస్​ కంపెనీ ముందు ధర్నా చేశారు.
  • మూడు రోజుల కింద శివ్వంపేట మండలం పెద్ద గొట్టిముక్ల గ్రామంలోని కరణం చెరువు పూర్తిగా కలుషితమైంది. బిజిలీపూర్ శివారులో ఉన్న ఓ కంపెనీ వ్యర్థ రసాయన జలాలను చెరువులోకి వదలడంతో నీరంతా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. నీళ్లు దుర్వాసన వస్తున్నాయి. దాంతో ఆ నీటిని దేనికీ ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఇలా జిల్లాలోని పలుచోట్ల కంపెనీల నిర్లక్ష్యంతో గాలి, నీరు కలుషితమవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కంపెనీలు ఎక్కడబడితే అక్కడ వ్యర్థాలను విడుదల చేయకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. .