కష్టపడినా ఫలితం రాకపాయే..బండి సంజయ్​ ఓటమిపై బీజేపీ శ్రేణుల్లో అంతర్మథనం

కష్టపడినా ఫలితం రాకపాయే..బండి సంజయ్​ ఓటమిపై బీజేపీ శ్రేణుల్లో అంతర్మథనం
  •       మైనార్టీ ఓట్లలో ఎక్కువ శాతం గంగులకే పడడంతో ఫలితం మారినట్లు అంచనా
  •        ముస్లిం ఓట్లను చీల్చలేకపోయిన కాంగ్రెస్ అభ్యర్థి 

కరీంనగర్, వెలుగు :  రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో పాపులారిటీ ఉన్న బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంత కష్టపడినా ఫలితం రాలేదని వాపోతున్నారు. మంగళవారం కరీంనగర్​లో సంజయ్​ను కలిశారు. బీజేపీలో జనాకర్షక నేతల్లో ఒకరైన  సంజయ్ రాష్ట్రమంతా ప్రజాసంగ్రామ యాత్రలు చేసి పార్టీని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లారు. ఆయన హయాంలో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్​ పెరిగింది. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రచారం జరిగింది.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌‌‌‌ను తొలగించాక ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హైకమాండ్​ మళ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్రత్యేకంగా హెలీకాప్టర్​కూడా కేటాయించింది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఎక్కువగా దృష్టి సారించడంతోపాటు ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసిన ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇంత పాపులారిటీ ఉన్న నేత సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది.   

మైనార్టీ ఓట్లే దెబ్బతీశాయి?

కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పోలింగ్ బూత్ ల వారీగా విశ్లేషిస్తే.. బండి సంజయ్ ఓటమికి ప్రధాన కారణం ముస్లిం, మైనారిటీ ఓటర్లేనని తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 390 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 200 పోలింగ్ బూత్‌‌‌‌ల్లో బండి సంజయ్ కుమార్ తన సమీప ప్రత్యర్ధి గంగుల కమలాకర్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. మరో 186 బూత్​లలో బండి సంజయ్ కంటే గంగుల అధిక ఓట్లు సాధించగలిగారు. ఇందులోనూ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న 62 బూత్​ల్లో వన్ సైడ్ పడినట్లు తెలుస్తోంది.

హుస్సేన్ పురాలోని 232 నుంచి 241 వరకు మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో 80 శాతానికిపైగా ముస్లిం ఓటర్లే ఉన్నారు. వీటిలో మొత్తం 6,764 ఓట్లు పోలైతే… అందులో బండి  సంజయ్ కు పడిన ఓట్లు 259 మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్ కు కరీంనగర్ రూరల్ మండలంలోపాటు ముస్లిం ప్రాంతాల్లో గట్టి పట్టుందనే ప్రచారం ఉంది. గంగులను ఓడించడమే లక్ష్యంగా పురమల్ల శ్రీనివాస్ రంగంలోకి దిగారనే చర్చ జరిగింది. కాగా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌‌‌‌కు జైకొట్టిన ముస్లింలు ఇక్కడ మాత్రం గంగులకు మద్దతు పలికారు.