పాతది ఇచ్చేస్తే కొత్త బండికి డిస్కౌంట్!

పాతది ఇచ్చేస్తే కొత్త బండికి డిస్కౌంట్!
  • ఎక్స్ షోరూమ్ ధరలో 46% వరకు స్రాప్ వాల్యూ
  • కొత్త పాలసీతో కాలుష్యం తగ్గుతుంది..
  • ఇండస్ట్రీ టర్నోవర్ రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటుంది

న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన వెహికల్ స్క్రాపింగ్ పాలసీ వలన  కాలుష్యం తగ్గుతుందని, ఇంధన సామర్ధ్యం మెరుగుపడుతుందని రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గురువారం అన్నారు. ఈ పాలసీ వలన ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ టర్నోవర్, రూ. 10 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనావేశారు. పాత వెహికల్ను స్క్రాప్ చేసి కొత్త వెహికల్ తీసుకోవాలనుకునే వారికి కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలిస్తాయని చెప్పారు. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ పాలసీ ప్రకారం 20 ఏళ్ల లైఫ్టైమ్ దాటిన పర్సనల్ వెహికల్స్కు, 15 ఏళ్లు దాటిన కమర్షియల్ వెహికల్స్కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా లేదా రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోకపోయినా ఆ వెహికల్ను ఇక వాడకుండా నిషేధిస్తారు. అంతేకాకుండా ఇటువంటి వెహికల్స్కు రిజిస్ట్రేషన్ చేయరు.
 

కన్జూమర్లకు బెనిఫిట్స్..
రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం..స్క్రాపింగ్ సెంటర్కు పాత  వెహికల్ ఇస్తే  కొత్త వెహికల్ ఎక్స్షోరూమ్ ధరలో 46 శాతం వరకు అమౌంట్ను స్క్రాప్ వాల్యూగా ఇస్తారు.  దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు పర్సనల్ వెహికల్స్పై  రోడ్డు ట్యాక్స్లో 25 శాతం వరకు రాయితీలను ప్రకటిస్తాయి. కమర్షియల్ వెహికల్స్కయితే 15 శాతం వరకు రాయితీని ఇస్తాయి. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాకుండా కొత్త వెహికల్పై 5 % వరకు రాయితీని ఇవ్వాలని వెహికల్ తయారీ కంపెనీలకు  ఆయన సలహాయిచ్చారు. ఈ పాలసీ వలన అందరికీ లాభమేనని దేశంలో ఇంధన సామర్ధ్యం మెరుగుపడడానికి, కాలుష్యం తగ్గడానికి ఈ పాలసీ సాయపడుతుందని తెలిపారు. కొత్త వెహికల్ కొనుగోళ్లు పెరిగితే ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. పాత వెహికల్స్ను తుక్కుగా చేసి ప్లాస్టిక్, కాపర్, అల్యూమినియం, స్టీల్, రబ్బర్ వంటి రా మెటీరియల్స్ను రీసైకిల్ చేస్తారు. దీంతో రా మెటీరియల్స్ను దిగుమతి చేసుకోవడం తగ్గుతుందని, ఫలితంగా వెహికల్ ధరలు తగ్గుతాయని గడ్కరీ అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి  ఈ పాలసీ అమల్లోకి వస్తుంది. 15 ఏళ్ల లైఫ్టైమ్ను దాటిన ప్రభుత్వ వెహికల్స్ను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి స్క్రాప్ చేస్తారు. హెవీ కమర్షియల్ వెహికల్స్కు ఫిట్నెస్ టెస్టింగ్ 2023, ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి కానుంది. 

 

టోల్ గేట్లు ఏడాదిలోగా ఎత్తేస్తరు
ఇంకో ఏడాదిలోపు టోల్గేట్లన్ని తొలగిస్తామని గడ్కరీ చెప్పారు. ఫిజికల్ టోల్ బూత్లను తొలగించి జీపీఎస్ టెక్నాలజీ సాయంతో టోల్ను సేకరిస్తామని అన్నారు. ప్రస్తుతం 93 శాతం వెహికల్స్ ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లిస్తున్నాయని, కానీ మిగిలిన ఏడు శాతం మాత్రం ఫాస్టాగ్కు షిఫ్ట్ కాలేదని లోక్సభలో చెప్పారు. కాగా, ఫాస్టాగ్ వాడనివారు రెండింతల టోల్ అమౌంట్ను కట్టాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ లేకపోతే జీఎస్టీ ఎగవేత, దొంగతనం (టోల్) కేసులను వేస్తామని చెప్పారు.