ఇవాళ సభ ముందుకు ఏడు సవరణ బిల్లులు

ఇవాళ సభ ముందుకు ఏడు సవరణ బిల్లులు

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్‌‌ చట్టంపై అసెంబ్లీ, మండలిలో చర్చ నిర్వహించనున్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం ఉభయ సభల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపనున్నారు. తీర్మానానికి ముందు ఈ చట్టంపై సీఎం కేసీఆర్‌‌‌‌ మాట్లాడనున్నారు. సోమవారం అసెంబ్లీ, మండలిలో క్వశ్చన్‌‌ అవర్‌‌ను రద్దు చేస్తూ స్పీకర్‌‌, చైర్మన్‌‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్‌‌ రిలీజ్‌‌ చేశారు.

అలాగే, అసెంబ్లీ ముందుకు ఏడు సవరణ బిల్లులు రానున్నాయి. జీఎస్టీ అమెండ్‌‌మెంట్‌‌ బిల్‌‌, ఆజామాబాద్‌‌ ఇండస్ట్రియల్‌‌ ఏరియాలో లీజుల రద్దు, మున్సిపల్‌‌ చట్టంలో సవరణలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వయో పరిమితి పెంపు, ఫారెస్ట్‌‌ యూనివర్సిటీ బిల్‌‌, యూనివర్సిటీస్‌‌ కామన్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు ఏర్పాటు, మోటార్‌‌ వెహికల్‌‌ చట్టంలో సవరణలు చేస్తూ ఆయా శాఖల మంత్రులు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావుకు సభ సంతాపం తెలపనుంది. అసెంబ్లీ, మండలిలో సదరన్‌‌ పవర్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కంపెనీ, తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్‌‌, ట్రాన్స్‌‌మిషన్‌‌ కార్పొరేషన్‌‌, రెన్యూవబుల్‌‌ ఎనర్జీ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్ల వార్షిక నివేదికలను ప్రవేశపెట్టనున్నారు.