న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం లోక్ సభలో జాతీయ గీతంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించనున్నారు. వందేమాతరం గురించి ఇప్పటివరకూ తెలియని వాస్తవాలతో పాటు మరికొన్ని కొత్త విషయాలను ఈ చర్చ ద్వారా వెలుగులోకి తేనున్నారు. వందేమాతరంపై డిబేట్ పెట్టాలని ఇదివరకే లోక్ సభ నిర్ణయించింది. 10 గంటల పాటు చర్చించాలని డిసైడ్ అయింది. చర్చను ప్రధాని మోదీ ప్రారంభించి మాట్లాడుతారు.
ఆయన తర్వత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడతారు. అలాగే, లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక వాద్రా గాంధీ కూడా ఈ చర్చలో పాల్గొననున్నారు. కాగా.. వందేమాతరానికి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మోదీ గత నెల 7న ఉత్సవాలు ప్రారంభించారు.
జాతీయ గీతం ప్రాధాన్యం గురించి యువత, స్టూడెంట్లకు అవగాహన కల్పించేందుకు ఏడాది పాటు ఉత్సవాలు జరపనున్నారు. అలాగే, వందేమాతరంపై రాజ్యసభలోనూ మంగళవారం చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోజు రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తారు. ఆయన మాట్లాడిన తర్వాత రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా మాట్లాడతారు.
ఎన్నికల సంస్కరణలపై మాట్లాడనున్న రాహుల్
లోక్ సభలో వందేమాతరంపై చర్చతో పాటు ఎన్నికల సంస్కరణలపైనా డిబేట్ పెట్టనున్నారు. మంగళ, బుధవారం వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తో పాటు పలు విషయాలపై నేతలు చర్చిస్తారు. ఎన్నికల సంస్కరణలపై చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
వందేమాతరం, ఎన్నికల సంస్కరణలపై లోక్ సభ, రాజ్యసభలో నిర్వహించే చర్చలో తమ పార్టీ తరపున ఎవరెవరు పాల్గొనాలో కాంగ్రెస్ ఇదివరకే లిస్టును ఖరారు చేసింది. దిగువ సభలో చర్చకు దీపేందర్ హూడా, బిమోల్ అకోయ్ జామ్, ప్రణితి షిండే, ప్రశాంత్ పడోలే, చామల కిరణ్ రెడ్డి తదితరుల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి.
