సర్పంచులకు బిల్లులు ఆపిందే మీ సర్కారు: మంత్రులు

సర్పంచులకు బిల్లులు ఆపిందే మీ సర్కారు: మంత్రులు
  • బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై మంత్రులు శ్రీధర్​బాబు, సీతక్క ఫైర్​
  • సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్​ ప్రభుత్వమే కారణమని మండిపాడు​
  • పంచాయతీరాజ్​ పెండింగ్​బిల్లులపై సభలో వాడివేడి చర్చ

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్​పెండింగ్​నిధులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. మంగళవారం బడ్జెట్​ పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి పంచాయతీల నిధులపై మాట్లాడారు. నిధులు ఇవ్వడం లేదని, పింఛన్లు రావడం లేదని, పల్లెలు ఆగమైతున్నాయంటూ కామెంట్లు చేశారు. దీంతో మంత్రులు శ్రీధర్​ బాబు, సీతక్క ఆయనకు గట్టి కౌంటర్​ఇచ్చారు. సర్పంచులకు బిల్లులు ఆపిందే గత ప్రభుత్వమని ఎదురుదాడి చేశారు. ప్రభాకర్​రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సాకుతో సర్పంచులకు బిల్లులు ఆపుతున్నారని విమర్శించారు.

లోకల్​బాడీ ఎన్నికల్లోపు సర్పంచులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్​ చేశారు. తమ ప్రభుత్వం బడ్జెట్​లో పంచాయతీరాజ్​కు నిధులను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతే.. కాంగ్రెస్​ప్రభుత్వం మాత్రం తగ్గిస్తున్నదని ఆరోపించారు. రూరల్​ రోడ్స్​ నిర్మాణానికి (సీఆర్​ఆర్​)కు కేవలం రూ.700 కోట్లే కేటాయించారని, అవి ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. రూ.1,100 కోట్లు ఇప్పటికే పెండింగ్​ ఉన్నాయని, వాటిని ఎలా ఇస్తారని అడిగారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో పల్లెలు ఏడుస్తున్నాయన్నారు. అందరికీ ఫండ్స్ ఆపేశారని, 8 నెలలుగా ఒక్క రూపాయి రాలేదన్నారు. స్కూళ్లలో పారిశుధ్యం లేదని, వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. దివ్యాంగుల పింఛన్​రూ.6 వేలు చేస్తామని దాని ఊసే ఎత్తడం లేదన్నారు. 2014కి ముందు ఎట్లుండే గ్రామీణ వ్యవస్థ.. కేసీఆర్​ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలన్నారు.  

సర్పంచులకు నిధులు ఆపిందే 
బీఆర్ఎస్ ​సర్కార్: శ్రీధర్​ బాబు

సర్పంచులకు పెండింగ్​ బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైందే బీఆర్ఎస్​ సర్కార్​అని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. పెండింగ్​బిల్లులు ఇవ్వట్లేదన్న ప్రభాకర్​ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా కౌంటర్​ ఇచ్చారు. ‘‘సర్పంచులు రూ.5 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేయించారు. బిల్లులు పెట్టుకుంటే కొన్నికూడా చెల్లించలేదు. దీంతో బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది బీఆర్ఎస్​ పాలకులు చేసిన పాపం కాదా? వారు చేసిన పాపాలను మేం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్లు ప్రతి శాఖలోనూ అన్నీ పెండింగ్​పెట్టిపోయారు. ఒకదాని తర్వాత ఒకటి బిల్లులను మేం క్లియర్​ చేసుకుంటూ పోతున్నాం. కచ్చితంగా అన్ని బిల్లులు చెల్లిస్తం. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తాం. రుణమాఫీ రెండో విడత పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో హామీలన్నీ అమలు చేస్తాం’’ అని మంత్రి స్పష్టం చేశారు. 

పింఛన్లు ​ఎగ్గొట్టింది బీఆర్ఎస్సే: సీతక్క

సామాజిక పింఛన్లను ఎగ్గొట్టిన ఘనత గత బీఆర్ఎస్​ సర్కారుదేనని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘‘2020 జులైలో ఇవ్వాల్సిన పింఛన్​ను ఎగ్గొట్టేసి ఆగస్టులో ఇచ్చారు. తర్వాత పింఛన్​ను ఎప్పుడూ లేట్​గానే ఇచ్చారు. వాళ్ల వల్లే పింఛన్​ లేట్​గా అందుతున్నది. మేం వచ్చాక ప్రతి నెలా పింఛన్​ ఇస్తున్నాం. కాస్త వెనుకా ముందు అయినా అందరికీ చెల్లిస్తున్నాం. పంచాయతీలకు రూ.370.80 కోట్ల బిల్లులు రిలీజ్​ చేశాం. కొన్ని పెండింగ్​లో పడ్డాయి. బీఆర్ఎస్​ పాలకులే రూ.1,500 కోట్లు పెండింగ్​ పెట్టి పోయారు. ప్రస్తుతం పల్లెల్లో పాలనాధికారుల అడ్మినిస్ట్రేషన్​ నడుస్తున్నది. బిల్లులన్నింటినీ క్లియర్​ చేస్తం. ఆగస్టు 5 నుంచి 13 వరకు అన్ని గ్రామాల్లో ‘స్వచ్ఛదనం పచ్చదనం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’’ అని ఆమె చెప్పారు.