మానసిక క్షోభ భరించలేక పోతున్నం ..తెలంగాణ ఉద్యమకారులపై కేసులు కొట్టివేయాలి : ప్రపూల్ రామ్ రెడ్డి

మానసిక క్షోభ భరించలేక పోతున్నం ..తెలంగాణ ఉద్యమకారులపై కేసులు కొట్టివేయాలి :  ప్రపూల్ రామ్ రెడ్డి
  • జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రపూల్ రామ్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కేసులు నమోదై కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యమకారులు మానసిక క్షోభకు గురవుతున్నారని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ ప్రపూల్ రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం చిక్కడపల్లిలోని జేఏసీ కార్యాలయంలో కళ్లెపు చంద్రన్న ప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామ్ రెడ్డి మాట్లాడుతూ.. నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వ నిర్వాకంతో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

 మరోవైపు తెలంగాణ ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా ఉద్యమకారులపై కేసులు కొట్టివేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేసులు కొట్టివేసి తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్​ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎం.వెంకటస్వామి, హరిప్రసాద్ గౌడ్, సాయిలు, అంజలి కుమారి, లావణ్య, బాలలక్ష్మి, స్వరూపారాణి, లలితమ్మ, సుచరిత, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.