రాష్ట్ర వ్యాప్తంగా 2,267 మంది పార్ట్‌‌ టైం టీచర్ల డిస్‌‌ కంటిన్యూ

రాష్ట్ర వ్యాప్తంగా 2,267 మంది పార్ట్‌‌ టైం టీచర్ల డిస్‌‌ కంటిన్యూ

మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సోషల్‌‌ వెల్ఫేర్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూళ్లలో ఉన్న పార్ట్‌‌ టైం టీచర్లను తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 225 స్కూళ్లలో పనిచేస్తున్న 2,267 మంది టీచర్లను డిస్‌‌ కంటిన్యూ చేస్తూ సోషల్‌‌ వెల్ఫేర్‌‌ ఎడ్యుకేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌ సొసైటీ సెక్రటరీ డాక్టర్‌‌ అలుగు వర్షిణి ఆర్డర్స్‌‌ జారీ చేశారు. పార్ట్‌‌టైం టీచర్ల తొలగింపుతో ఏర్పడిన ఖాళీల వివరాలు పంపాలని జోనల్‌‌ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్‌‌, ఔట్‌‌ సోర్సింగ్‌‌ పద్ధతిలో భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రెగ్యులర్‌‌ టీచర్లపై భారం

సోషల్‌‌ వెల్ఫేర్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూళ్లలో పదేండ్లుగా పార్ట్‌‌టైం టీచర్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్‌‌ పోస్టు ఖాళీ అయిన వెంటనే నాన్‌‌ రెగ్యులర్‌‌ ప్రాతిపదికన పార్ట్‌‌టైమ్‌‌, సీనియర్‌‌ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్‌‌ అసోసియేట్స్‌‌ను నియమిస్తున్నారు. చివరగా 2022 జూన్‌‌లో  రాష్ట్ర వ్యాప్తంగా 225 స్కూళ్లలో 2,267 మందిని రిక్రూట్‌‌ చేశారు. అగ్రిమెంట్‌‌ ప్రకారం ఈ ఏడాది జూలై 31తో వారి సర్వీస్ పూర్తి అయింది. చాలా స్కూళ్లలో రెగ్యులర్‌‌ స్టాఫ్‌‌ లేకపోవడంతో పార్ట్‌‌ టైమ్‌‌ టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు వీరిని తొలగించడంతో స్టూడెంట్లకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు.


 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్స్‌‌లెన్సీ (సీవోఈ)లో పనిచేస్తున్న 14 మంది పార్ట్‌‌టైం టీచర్లను తొలగించారు. వీరిలో సబ్జెక్ట్‌‌ టీచర్లు, అసిస్టెంట్‌‌ కేర్‌‌ టేకర్‌‌, పీఈటీ ఉన్నారు. ప్రిన్సిపాల్‌‌తో పాటు మరో మూడు టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్ట్‌‌ టైమ్‌‌ టీచర్లను డిస్‌‌ కంటిన్యూ చేయడం వల్ల హైస్కూల్‌‌ స్టూడెంట్లకు టీచింగ్‌‌ చేసే వారు లేరు. దీంతో రెగ్యులర్‌‌ టీచర్లపై అదనపు భారం పడుతోంది.

ఆందోళనలో పార్ట్‌‌టైం టీచర్లు

పార్ట్‌‌ టైం టీచర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా అరకొర జీతాలతో పనిచేస్తున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా తొలగించడం సరికాదని అంటున్నారు. పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ తమను తొలగించడం అన్యాయమని, ముందస్తు సమాచారం లేకుండా తమను రోడ్డు పాలు చేయొద్దని, ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. అలాగే పెండింగ్‌‌లో ఉన్న మూడు నెలల జీతాలను రిలీజ్‌‌ చేయాలని డిమాండ్‌‌ చేస్తున్నారు.

 ఖాళీ పోస్ట్‌‌లను కాంట్రాక్ట్, ఔట్‌‌ సోర్సింగ్‌‌ విధానంలో భర్తీ చేస్తామని చెబుతున్నా.. తిరిగి తమనే తీసుకుంటారన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని వివిధ స్కూళ్లకు చెందిన పార్ట్​టైం టీచర్లు గురువారం మంచిర్యాలలోని ఆర్‌‌సీవో ఆఫీస్‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టరేట్‌‌ ఎదుట నిరసన తెలిపి తమను సొసైటీలోనే కొనసాగించాలని కోరుతూ అడిషనల్‌‌ కలెక్టర్‌‌ మోతిలాల్‌‌కు వినతిపత్రం అందజేశారు. వీరికి మద్దతుగా పేరెంట్స్‌‌ కమీట మెంబర్లు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. .

ఏకపక్షంగా తొలగించడం అన్యాయం 

నేను బెల్లంపల్లి సీవోఈలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నాను. విద్యార్థులను తీర్చిదిద్దుతూ బెల్లంపల్లి సీవోఈని రాష్ట్రంలోనే ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిపాం. ఎలాంటి సమాచారం లేకుండా మమ్మల్ని తొలగించడం సరికాదు. స్కూళ్లలో ఖాళీలు ఉన్నందున తిరిగి తమనే నియమించాలి. 
- మిట్ట రమేశ్‌‌, సబ్జెక్ట్‌‌ అసోసియేట్‌‌