తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
  • బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్, మాజీ ఎంపీ విజయశాంతి డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ పోలీసులు కేసీఆర్ కుటుంబానికి తొత్తులుగా మారారని బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ నర్సుల తొలగింపును నిరసిస్తూ ధర్నా చేస్తున్న బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమని వారు సోమవారం ఒక సంయుక్త ప్రకటన మీడియాకు విడుదల చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలపట్ల పోలీసుల అనుసరించిన తీరు ఆక్షేపణీయమని వారు పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లను అకారణంగా తొలగించి వారి కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. విధుల నుండి తొలగించిన ఆయా ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు.