సారూ.. మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి..కేసీఆర్ కు మల్లన్నసాగర్ నిర్వాసితుల లేఖ

సారూ.. మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి..కేసీఆర్ కు మల్లన్నసాగర్  నిర్వాసితుల లేఖ

గజ్వేల్, వెలుగు: తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్  మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న సాగర్  ఆర్అండ్ఆర్  కాలనీవాసులు మాజీ సీఎం కేసీఆర్​కు స్పీడ్  పోస్ట్​లో లేఖ పంపించారు. ఆ లేఖను సోమవారం బయటపెట్టడంతో సోషల్  మీడియాలో వైరల్​ అవుతోంది. 

‘మల్లన్నసాగర్  ప్రాజెక్ట్  నిర్మాణంతో ముంపునకు గురైన తొగుట మండలానికి చెందిన వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, పాత కొండపాక(ప్రస్తుత కుక్ నూర్ పల్లి) మండలానికి చెందిన ఎర్రవెల్లి, సింగారం గ్రామాలకు చెందిన నిర్వాసితులం. ఇప్పటికీ ఎన్నో లేఖలు మీకు పంపించాము. కానీ, నేటికి మీరు అసెంబ్లీలో మా సమస్యలపై మాట్లాడలేదు.

 మీరు సీఎంగా ఉన్న సమయంలో పూర్తి చేసిన ప్రాజెక్టు నిర్వాసితుల గురించి ప్రెస్ మీట్  కూడా పెట్టకపోవడం బాధాకరం. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ విధులను నిర్వర్తిస్తే మా సమస్యలు తీరిపోయేవి. మీరే మా పాత గ్రామపంచాయతీలను కొనసాగిస్తామని చెప్పి సర్పంచుల పదివీ కాలం ముగిసేంత వరకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.

 మొక్కుబడిగా అప్పటి సర్పంచులతో తీర్మానం కాపీలను తీసుకున్నారే తప్ప, అసెంబ్లీలో మాత్రం ప్రవేశ పెట్టకుండా మోసం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసినప్పటికీ మీరు స్పందించలేదు. అసెంబ్లీలో నిర్వాసితుల సమస్యల గురించి మాట్లాడేంత వరకు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనేలా లేదు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ఒక్క పూటైనా అసెంబ్లీకి వెళ్లి మా సమస్యల గురించి ప్రభుత్వాన్ని అడగాలని కోరుతున్నాం.’ అని పేర్కొన్నారు.