బీజేపీలో కుదరని సయోధ్య..ఎంపీ అభ్యర్థుల ఎంపికపై నేతల్లో అసంతృప్తి

బీజేపీలో కుదరని సయోధ్య..ఎంపీ అభ్యర్థుల ఎంపికపై నేతల్లో అసంతృప్తి
  • 3 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి 
  • పనిచేయని బుజ్జగింపులు 
  • పార్టీ కార్యక్రమాలకు రాజాసింగ్,  సీనియర్​ నేతలు దూరం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఇంకా ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు  పలువురు సీనియర్ నేతలతో ఆ పార్టీ రాష్ట్ర , జాతీయ నాయకత్వం మాట్లాడినా.. ఫలితం లేకుండా పోయింది. రెండు, మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది.  ఎలక్షన్​ నోటిఫికేషన్ టైమ్ దగ్గరపడుతున్నా.. నేతలంతా ప్రచారంలో పాల్గొనకపోవడంతో అటు రాష్ట్ర నాయకత్వంతోపాటు అభ్యర్థుల్లోనూ టెన్షన్ మొదలైంది. 

తెలంగాణలోని17 స్థానాల్లో బీజేపీ మెజార్టీ సీట్లను కొత్త అభ్యర్థులకే కేటాయించింది. దీంతో ఎన్నో ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమను కాదని, కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఎలా కేటాయిస్తారంటూ పలు చోట్ల సీనియర్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. కొందరు తమకు సమాచారం ఇవ్వకుండా అభ్యర్థులను ఎంపిక చేశారనే కారణంతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. 

కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని మాధవీలతకు హైదరాబాద్​ ఎంపీ సీటు కేటాయించడం, తనను కనీసం సంప్రదించకుండానే అభ్యర్థి పేరును ప్రకటించడంపై హైదరాబాద్ సిటీలోనే ఏకైక బీజేపీ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ అలకబూనారు. ఆయనతోపాటు హైదరాబాద్ సిటీలోని చాలా మంది నేతలూ ఈ విషయమై బహిరంగంగానే మాట్లాడారు. వారందరూ మాధవీలతతో కలిసి ప్రచారంలో పాల్గొనడం లేదు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి రాజాసింగ్ ఇన్‌ చార్జీగా ఉన్నా.. ఎన్నికల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నగరంలో అమిత్ షా మీటింగ్ జరిగినా రాజాసింగ్​అటెండ్​ కాలేదు. ఇదే బాటలో పలువురు జాతీయ నేతలతో పాటు నల్గొండ, ఆదిలాబాద్, మల్కాజ్​గిరి, వరంగల్, జహీరాబాద్, ఖమ్మం.. ఇలా దాదాపు అన్ని చోట్లా పలు కారణాలతో నేతలు  ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. 

బుజ్జగించినా ఫలితం లేదు!

బీజేపీలో నేతల మధ్య గ్యాప్ అంశం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జి అభయ్ పాటిల్,  బీజేపీ సంస్థాగత సహ కార్యదర్శి శివ ప్రకాశ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ తదితరులను రంగంలోకి దింపింది. రాజాసింగ్ తో సహా పలువురు నేతలతో  వారు మాట్లాడారు. అటు అభ్యర్థులతోనూ చర్చించారు. కానీ, ఇప్పటివరకూ దాని ఫలితం మాత్రం రావడం లేదు. 

మల్కాజ్​గిరి సీటు ఆశించిన మేడ్చల్​ జిల్లా అధ్యక్షుడు హరీశ్​రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు.. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని  వెల్లడించి.. అప్పటి నుంచి రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారు. మరోపక్క నల్గొండ, ఖమ్మంలో అభ్యర్థుల సీట్లను మార్చాల్సిందేనని నేతలు పట్టుపడుతున్నట్టు తెలిసింది. పార్టీ నేతలపై కేసులు పెట్టించి జైల్లో వేయించిన వారి గెలుపు కోసం ఎలా పనిచేయాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. 

మరోపక్క కొత్తగా వచ్చిన నేతలు పాత కేడర్​ను పట్టించుకోవడం లేదనే ఆవేదనతోనూ చాలా మంది ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే, అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించకపోతే తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడం కష్టమేననీ ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు.