హుజూరాబాద్ ఎంపీపీకి అసమ్మతి సెగ

హుజూరాబాద్ ఎంపీపీకి అసమ్మతి సెగ

కరీంనగర్, హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ మండల ప్రజా పరిషత్ లో అసమ్మతి రాజుకుంది. ఎంపీపీ ఇరుమల్ల రాణిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వివిధ పార్టీల ఎంపీటీసీ సభ్యులు కరీంనగర్​కలెక్టర్ కర్ణన్​కు బుధవారం లెటర్​ ఇచ్చారు. ఎంపీపీ భర్త సురేందర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎంపీటీసీ సభ్యులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని అసమ్మతి ఎంపీటీసీ సభ్యులు ఆరోపించారు. మొన్నటి వరకు మున్సిపల్ చైర్ పర్సన్లపై అవిశ్వాస తీర్మానాల జోరు కొనసాగగా..ఇప్పుడు మండల ప్రజా పరిషత్ లలో ఇదే ట్రెండ్​ మొదలుకావడం చర్చనీయాంశంగా మారింది.

హుజురాబాద్ మండల ప్రజాపరిషత్ లో మొత్తం 12 మంది ఎంపీటీసీలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. గెలిచి నాలుగేళ్లయినా తమకు నిధులు కేటాయించడం లేదని, మండల పరిషత్ సమావేశంలో చర్చించే ఎజెండాను తమకు ముందుగా చెప్పకుండానే ఎంపీపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రశ్నించిన సభ్యులను బెదిరిస్తున్నారని ఎంపీటీసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంపీపీ భర్త సురేందర్ రెడ్డి తానే ఎంపీపీగా వ్యవహరిస్తూ వైస్ ఎంపీపీ సీట్లో కూర్చుని అన్ని విషయాల్లో తలదూరుస్తూ మండల పరిషత్ అధికారులను భయపెడుతూ పనులు  చేయించుకుంటున్నారనే విమర్శలున్నాయి. బై ఎలక్షన్ టైంలో గ్రామాల అభివృద్ధికి రిలీజ్ అయిన తమ నిధులను ఎవ్వరికీ ఇవ్వకుండా తానే కాంట్రాక్టర్లతో పనులు చేసుకుంటూ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మెజార్టీ ఎంపీటీసీల విశ్వాసం కోల్పోయినందున ఎంపీపీ ఇరుమల్ల రాణిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నట్లు వారు ప్రకటించారు. 12 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను 10 మంది సభ్యులు అవిశ్వాస లేఖపై సంతకాలు చేశారు. 

ఎంపీపీ బరిలో ముగ్గురు..

ఎంపీపీ రాణిపై అవిశ్వాసం ప్రకటించిన ఎంపీటీసీ సభ్యులు.. ఎలాగైనా తమ పంతాన్ని నెగ్గించుకుని ఎంపీపీని గద్దె దించేందుకు పావులు కదుపుతున్నారు. ఆమె స్థానంలో మరెవరు ఉన్నా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒక పేరును ఫైనల్ చేయించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీగా పోటీ చే సేందుకు సింగాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గుడి పాటి సరిత, పెద్దపాపయ్యపల్లి ఎంపీటీసీ శిరీష, కాట్రపల్లి ఎంపీటీసీ అనిత ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.