గజ్వేల్- ప్రజ్ఞాపూర్లో డబుల్ బెడ్ రూమ్..ఇండ్ల పంపిణీ కలేనా?

గజ్వేల్- ప్రజ్ఞాపూర్లో డబుల్ బెడ్ రూమ్..ఇండ్ల పంపిణీ కలేనా?
  • లబ్ధిదారులను ఎంపిక చేశారు
  • ఇండ్ల  అప్పగింత మరిచారు
  • ఏళ్ల తరబడి ఎదురుచూపులు
  • ఆందోళనకు సిద్దవుతున్న లబ్ధిదారులు

సిద్దిపేట, వెలుగు: గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పెద్ద సమస్యగా మారింది. లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆరు నెలలు గడిచినా ఇంత వరకు ఇండ్లను అలాట్ చేయలేదు. దీంతో ఇటీవల లబ్ధిదారులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి తమకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీకి 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా 1100 ఇండ్ల నిర్మాణం పూర్తిచేశారు. గత మార్చిలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితా ప్రకటించారు. నెల రోజుల్లో లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించి గృహ ప్రవేశాలు చేయిస్తామన్న అధికారుల హామీ నేటికీ నెరవేరలేదు.

మూడేండ్లుగా పంపిణీ ప్రక్రియ

గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలోని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ మూడేండ్లుగా పెండింగ్​లోనే ఉంది.  20 వార్డుల్లోని పేదల కోసం   1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించగా అందులో 132 ఇండ్లను పట్టణంలో రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికి కేటాయించారు. మిగిలిన 1118 ఇండ్ల పంపిణీ కోసం 2021లో నోటిఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్లు స్వీకరించారు.

పేదల నుంచి మొత్తం 3512 అప్లికేషన్లు వచ్చాయి. ఆరు జిల్లాస్థాయి అధికారుల బృందాల ఆధ్వర్యంలో వీటిని పరిశీలించారు.  ఏడాదిన్నర పాటు జరిగిన సర్వే అనంతరం నెల  రోజుల క్రితం1118 మంది లబ్ధిదారులతో  డ్రాఫ్ట్ లిస్టును ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈఏడాది మార్చిలో లక్కీ డ్రా ద్వారా1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కాగా ఇండ్లు లభించినా ఇంత వరకు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు. అందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యక్ష కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

ఇండ్లు ఖాళీ చేయని నిర్వాసితులు

గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలోని పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాత్కాలికంగా కేటాయించారు. నిర్వాసితుల పరిహారాలు, ప్యాకేజీలు పెండింగ్ లో ఉండడంతో వారు ఇండ్లను ఖాళీ చేయడం లేదు.  మరోవైపు లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులు ఇండ్ల కోసం ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు.  

ఎన్నికల సాకుతో అధికారులు లబ్ధిదారులను సముదాయించినా ప్రస్తుతం వారు వినే పరిస్థితుల్లో లేరు. డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించిన కాలనీలో దాదాపు 70 శాతం ఇండ్లు నిర్వాసితులే నివాసం ఉంటున్నారు. కొన్నింటికి నిర్వాసితులే తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. దీంతో వారిని ఎలా ఖాళీ చేయించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటుండగా మరోవైపు ఎంపికైన లబ్ధిదారులు తమకు ఇండ్లు ఎప్పుడిస్తారంటూ నిలదీస్తున్నారు. 

కిరాయి ఇండ్ల లోనే నివాసం

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దొరికినా ఇప్పటికీ అప్పగించక పోవడంతో కిరాయి ఇండ్లలోనే నివాసం ఉంటున్నాం. నెలకు రెండు వేల చొప్పున ఆర్థిక భారాన్ని భరిస్తున్నా అధికారులు మాపై కరుణ చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ఇండ్లను అప్పగిస్తే ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.
బీబీ బేగం, లబ్ధిదారు

నిర్వాసితులు ఖాళీ చేయక ఇబ్బంది

గజ్వేల్ మున్సిపాల్టీ కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మల్లన్న సాగర్ నిర్వాసితులు ఖాళీ చేయక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపాల్టీ పరిధిలో లక్కీ డ్రా ద్వారా 1100 మంది పేదలను ఎంపిక చేసినా ఇండ్లు అందుబాటులోకి రాకపోవడంతో వారికి కేటాయించలేకపోతున్నాం. ఈ విషయంపై జిల్లా అధికారులతో మాట్లాడుతున్నాం. త్వరలోనే సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించడానికి ఏర్పాట్లు చేస్తాం.
రాజమౌళి, మున్సిపల్ చైర్మన్  గజ్వేల్ ప్రజ్ఞాపూర్

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రామకోటి రామరాజు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నివాసముండే ఇతడికి 8 నెలల క్రితం డబుల్ బెడ్ రూమ్ మంజూరైంది. ఇప్పటి వరకు ఇల్లు అప్పగించకపోవడంతో  స్థానికంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

ఇటీవల అతడి తల్లి మృతి చెందడంతో డెడ్​బాడీని ఇంట్లోకి తీసుకురావడానికి ఇంటి యజమాని అంగీకరించలేదు. దీంతో రోడ్డుపైనే టెంట్ వేసి ఉంచాడు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.