ఇవాళ చేప ప్రసాదం పంపిణీ

ఇవాళ చేప ప్రసాదం పంపిణీ
  • ఉదయం 11 గంటలకు ప్రారంభం.. రేపు కూడా కొనసాగింపు
  •     హైదరాబాద్​లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో అన్ని ఏర్పాట్లు పూర్తి
  •     ప్రారంభించనున్న స్పీకర్ ప్రసాద్, మంత్రి పొన్నం
  •     క్యూలైన్లలో ఒకరోజు ముందే వేల మంది బారులు
  •     1.6 లక్షల కొర్రమీను చేప పిల్లలు పంపిణీకి సిద్ధం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు బత్తిన కుటుంబ సభ్యులతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేపప్రసాదం పంపిణీని ప్రారంభించనున్నారు. పంపిణీకి ఒక రోజు ముందే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో క్యూలైన్లు నిండిపోయాయి. 

ఎంట్రెన్స్ వద్ద 18 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. 32 కౌంటర్ల ద్వారా చేప పిల్లల కొనుగోలు టోకెన్లు ఇస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ చేపప్రసాద పంపిణీ కార్యక్రమానికి దాదాపు 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్​ చైర్మర్​ సాయి కుమార్ మాట్లాడుతూ 1.60 లక్షల కొరమీను చేపలు పంపిణీకి రెడీగా ఉన్నాయని, వచ్చేవారి సంఖ్య పెరిగితే అదనంగా మరిన్ని ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు.20 వేల మంది ఉండేలా వసతి, భోజనం, తాగునీరు ఏర్పాట్లు చేశారు. చేపప్రసాదం కోసం వచ్చే వారి సౌలత్​ కోసం శనివారం, ఆదివారం హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల నుంచి 130 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపనుంది. రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.