
- జాబితాల్లో అనర్హులకు చోటిచ్చారని పేదల ఆందోళన
- ఆల్‌పార్టీ నేతలతో కలిసి మంత్రి, కలెక్టర్‌కు ఫిర్యాదు
- గజ్వేల్‌లో నిలిచిపోయిన లక్కీ డ్రా
- దుబ్బాక, హుస్నాబాద్ జాబితాలపై అభ్యంతరాలు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఇండ్ల పంపిణీ ముందుకు సాగడం లేదు. అధికారులు రిలీజ్ చేస్తున్న లబ్ధిదారుల జాబితాలు పేదల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. క్షేత్ర స్థాయిలో సర్వేలు జరిపి అర్హులను ఎంపిక చేశామని చెబుతున్నా.. లిస్ట్‌లో అనర్హుల పేర్లు కనిపిస్తుండడంతో ఆందోళనకు దిగుతున్నారు. వీరికి ప్రతిపక్ష నేతలే కాదు.. అధికార పార్టీ నేతలు సైతం మద్దతిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు విడుదల చేసిన జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గజ్వేల్, దుబ్బాక మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మంత్రి, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో గజ్వేల్ లక్కీ డ్రా వాయిదా పడగా.. దుబ్బాక, హుస్నాబాద్ జాబితాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దుబ్బాకలో దుమారం రేపిన రెండో జాబితా
దుబ్బాక మున్సిపాలిటీకి 1,135 ఇండ్లు మంజూరు కాగా 941 నిర్మాణాలను పూర్తి చేశారు. వీటి కోసం 1,653 దరఖాస్తులు రాగా అధికారుల బృందం సర్వే నిర్వహించి.. 587 మందితో మొదటి జాబితాను రిలీజ్ చేసి ఇండ్లను కేటాయించారు. మిగిలిన354 ఇండ్ల కోసం 941 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. స్పెషల్ టీమ్‌తో సర్వే చేయించి.. రెండు రోజుల కింద 310 పేర్లతో రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఆస్తిపరులు, ఒకే ఇంట్లో ముగ్గురు, గతంలో ఇండ్లు పొందిన వారి పేర్లుండడంతో.. అసలైన పేదలు మున్సిపల్ ఆఫీసు ముందు ఆందోళన చేశారు. వీరికి ప్రజాప్రతినిధులు మద్దతివ్వడమే కాదు చైర్ పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డిని వివరణ కోరగా.. రెండో జాబితాపై వచ్చిన ఆరోపణలు పరిశీలించి పేదలకు న్యాయం చేస్తామని చెప్పారు.
గజ్వేల్‌లో లక్కీడ్రా నిర్వహణకు బ్రేక్
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. వీటిలో 132 ఇండ్లను పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన కేటాయించారు. మిగిలిన 1,118 ఇండ్ల కోసం రెండేళ్ల కింద దరఖాస్తులు ఆహ్వానించగా.. 3,512 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆరు జిల్లాస్థాయి టీమ్‌లతో సర్వే నిర్వహించిన అధికారులు నెల కింద 1,118 మందితో డ్రాఫ్ట్ లిస్టును ప్రకటించారు. ఇందులో అనర్హులకు చోటు దక్కడంతో .. ఇండ్లు లేని పేదలు ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపల్ ఆఫీసు వద్ద డ్రాప్ బ్యాక్స్‌ను ఏర్పాటు చేయగా మరో 1,045 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై సర్వే చేసి 289 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,407 మందికి సంబంధించి లక్కీ డ్రా తీసి.. 1,118 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. కానీ, రెండు జాబితాల్లో అనర్హులున్నారని అభ్యంతరాలు వ్యక్తం కాగా.. చైర్మన్ రాజమౌళి గుప్త, కౌన్సిలర్లు మంత్రి హరీశ్ రావు, కలెక్టర్‌ను కలసి లక్కీ డ్రా ఆపాలని కోరారు. దీంతో ఇండ్ల పంపిణీకి బ్రేక్ పడింది.
హుస్నాబాద్‌లో కొనసాగుతున్న నిరసనలు
హుస్నాబాద్ మున్సిపాలిటీలో 520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా 1,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో 280 ఇండ్ల పంపిణీ కోసం అధికారులు 489 మందితో రెండు నెలల కింద జాబితా విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రతిపక్ష నేతలు పేదలతో కలిసి ధర్నా నిర్వహించారు. దీంతో రీ సర్వే నిర్వహించిన అధికారులు 364 మందితో మరో జాబితాను విడుదల చేసి లక్కీ డ్రా ద్వారా 244 మందికి ఇండ్లను కేటాయించారు. ఈ క్రమంలో కొందరు పేదలు లక్కీ డ్రాను అడ్డుకునే ప్రయత్నం చేసినా... పోలీసుల సాయంతో ప్రక్రియను పూర్తి చేశారు. కానీ, పేదలు ఆందోళనలు ఆపలేదు.. ఇటీవల కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో అధికారులు ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇండ్లు హ్యాండోవర్ చేయలేదు.