నాగార్జున ఎమోషనల్: డిస్ట్రిబ్యూటర్ ‘నెల్లూరు’ హరి కన్నుమూత.. అక్కినేని ఫ్యామిలీ బలమైన అండను కోల్పోయింది

 నాగార్జున ఎమోషనల్: డిస్ట్రిబ్యూటర్ ‘నెల్లూరు’ హరి కన్నుమూత.. అక్కినేని ఫ్యామిలీ బలమైన అండను కోల్పోయింది

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుడు), ఎగ్జిబిటర్‌, నిర్మాత ‘నెల్లూరు’ హరి అలియాస్ గుజ్జలపూడి హరికుమార్ (46) కన్నుమూశారు. ఆదివారం (మే 24, 2026) ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కేవలం 46 ఏళ్ల వయసులోనే హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా పంపిణీ రంగంలో కీలక పాత్ర పోషించిన హరి ఆకస్మిక మరణం సినీ వర్గాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

హరి పిక్చర్స్ ద్వారా ఎన్నో హిట్ చిత్రాలను హరికుమార్ పంపిణీ చేశారు. 2025లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సహా పలు సక్సెస్ ఫుల్ సినిమాల వెనుక కీలక పాత్ర పోషించారు. 2006లో రామ్ నటించిన ‘దేవదాస్’ సినిమాను తమిళనాడులో విడుదల చేసి వరుస సినిమాలను పంపిణీ చేసి సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే హరి గత 20 ఏళ్లలో వందలాది చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ మూవీస్, వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల నుంచి వచ్చిన పలు భారీ చిత్రాలను నెల్లూరు ప్రాంతంలో పంపిణీ చేస్తూ హరి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలోనే హరి మృతిపై సినీ స్టార్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున ఎమోషనల్ పోస్ట్ 

హరి మరణవార్త వినగానే అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనతో తనకు ఉన్న 25 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

‘‘గుజ్జలపూడి హరికుమార్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది. మా పరిచయం 25 ఏళ్లకు పైగా ఉంది. అక్కినేని కుటుంబానికి ఆయన ఎప్పుడూ ఓ అండగా నిలిచారు. మా జీవితాల్లో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తెలుగు సినీ పరిశ్రమ ఒక గొప్ప డిస్ట్రిబ్యూటర్‌ను, అద్భుతమైన మనసున్న వ్యక్తిని కోల్పోయింది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ నాగార్జున సంతాపం వ్యక్తం చేశారు.