రెవెన్యూ ఆఫీసర్ల కక్కుర్తికి రైతు బలి

రెవెన్యూ ఆఫీసర్ల కక్కుర్తికి రైతు బలి
  •     లిటిగేషన్​ భూమి పట్టా చేస్తామని రూ.4.50 లక్షలు తీసుకున్న సర్వేయర్​, సీనియర్​ అసిస్టెంట్​ 
  •     ఏడాది పాటు తిప్పుకుని పని కాదన్నరు 
  •     పైసలే ఇవ్వలేదని బుకాయింపు  
  •     మనస్తాపంతో ఉరేసుకున్న రైతు  
  •     తహసీల్దార్​ ఆఫీస్ ముందు కుటుంబీకుల ధర్నా

బచ్చన్నపేట, వెలుగు : రెవెన్యూ ఆఫీసర్ల కాసుల కక్కుర్తికి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపూర్​కు చెందిన రైతు బలయ్యాడు. లిటిగేషన్​భూమిని పట్టా చేసిస్తామని నమ్మబలికి నాలుగున్నర లక్షలు తీసుకుని తీరా చేతులెత్తేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కనీసం తాను ఇచ్చిన లంచం డబ్బులనైనా  తిరిగివ్వాలని వేడుకున్నా కనికరించక పోవడంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం...పడమటి కేశవాపూర్ కు చెందిన కొమ్మటి రఘుపతి (45)కి కొన్నె శివారులో సర్వే నంబర్​75, 76లో ఎకరం 30 గుంటల భూమి ఉండగా అందులో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు.

ఇందులో 20 గుంటలు మాత్రమే రఘుపతి పేరున ఉంది. మిగతాది లిటిగేషన్​లో ఉంది. దీంతో ఆయన గతేడాది తహసీల్దార్​ఆఫీస్​కు వెళ్లి అడగడంతో మిగిలిన భూమిని పట్టా చేసి రికార్డుల్లోకి ఎక్కిస్తామని సీనియర్​అసిస్టెంట్​సుమన్​, సర్వేయర్​రవీందర్​మాటిచ్చారు. ఇందుకోసం రూ.6 లక్షలు డిమాండ్​ చేశారు. దీంతో భూమి పట్టా అవుతుందనే ఆశతో రఘుపతి అక్కడా ఇక్కడా అప్పు చేసి రూ 4.50 లక్షలు ముట్టజెప్పాడు. ఏడాదిగా ఆఫీస్​చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఎంతకీ పని కాకపోవడంతో ఇటీవల గట్టిగా అడిగాడు. దీంతో సదరు భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందున పట్టా చేయడం వీలుకాదని తేల్చి చెప్పారు. అయితే, తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని వేడుకున్నాడు. దీనికి  సీనియర్​అసిస్టెంట్​సుమన్​, సర్వేయర్​ రవీందర్​ఒప్పుకోలేదు. తమకు అసలు డబ్బులే ఇవ్వలేదని బుకాయించారు. ఈ విషయాన్ని బాధిత రైతు గ్రామంలోని కొందరికి చెప్పుకుని బాధపడ్డాడు. అప్పులిచ్చిన వారు అడగడం, భూమి పట్టా కాకపోవడంతో మనోవేదనకు గురై  తన వ్యవసాయ భూమి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, ముగ్గురు బిడ్డలు శ్వేత, అశ్విని, మహాలక్ష్మి ఉన్నారు. పెద్ద బిడ్డ శ్వేత పెండ్లి మాత్రం చేశాడు. 

రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన

రైతు కుటుంబానికి రూ 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ పడమటి కేశవాపూర్​గ్రామస్తులు బచ్చన్నపేట తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట ధర్నా చేశారు. మృతదేహాన్ని ఆఫీస్​ముందు ఉంచి ఆందోళన చేశారు. ఆఫీస్​ డోర్లు మూసి గొళ్లెం పెట్టి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. రూ. 4.50 లక్షలు లంచం  తీసుకుని మోసం చేసిన సీనియర్​ అసిస్టెంట్​ సుమన్​, సర్వేయర్​రవీందర్​ను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ధర్నా విరమించేది లేదని పట్టుబట్టారు. స్పందించిన తహసీల్దార్ ​విశాలక్ష్మి, ఎస్సై సతీశ్ వారిని సముదాయించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.