
- దివ్యమైన విజయం
- 19 ఏండ్ల దివ్య దేశ్‌ముఖ్‌దే విమెన్స్ చెస్ వరల్డ్ కప్
- ఈ ఘనత సాధించిన ఇండియా మహిళగా రికార్డు
- వరల్డ్ కప్ నెగ్గిన యంగెస్ట్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర
- ఫైనల్ టై బ్రేక్‌లో హంపిపై గెలుపు
- జీఎం హోదా కూడా సొంతం
దివ్య దేశ్‌ముఖ్. వయసు 19 ఏండ్లు. ఆటలో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. పెద్ద టోర్నీలు ఆడిన అనుభవం తక్కువే. తన కెరీర్‌లో అతి పెద్ద ఈవెంట్‌లో ఫైనల్ ఆడుతోంది. కానీ, ఎదురుగా ఉన్నది 38 ఏండ్ల కోనేరు హంపి. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం.. రెండుసార్లు వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచి మరెన్నో ఘనతలు ఆమె సొంతం. అయితేనేం.. దివ్య అస్సలు తగ్గలేదు. మేటి ప్రత్యర్థితో తన జీవితంలో అతి పెద్ద ఫైనల్ ఆడుతున్నా ఆమె కళ్ళలో భయమన్నదే కనిపించలేదు. ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు.. ఆమె వేసిన ప్రతి ఎత్తుకూ తిరుగే లేదు.
హంపి గ్రాండ్ మాస్టర్ అయిన మూడేండ్ల తర్వాత పుట్టిన ఈ టేనేజ్ సెన్సేషన్.. తనకంటే రెట్టింపు వయసున్న దిగ్గజంతో ఢీ అంటే ఢీ అన్నట్టు పోరాడి చివరకు పైచేయి సాధించింది. ఫిడే విమెన్స్ వరల్డ్ కప్ అందుకొని కొత్త చరిత్ర సృష్టించింది. రెండు వేర్వేరు తరాలకు చెందిన ప్రత్యర్థుల మధ్య జరిగిన ఈ అద్భుతమైన ఫైనల్లో గెలిచిన యువ సంచలనం దివ్యగ్రాండ్ మాస్టర్ హోదా సైతం కైవసం చేసుకొని చెస్ ప్రపంచంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.
బటుమి (జార్జియా): ప్రపంచ చెస్ చరిత్రలో కొత్త పొద్దు పొడిచింది. ఇండియా టీనేజ్ సెన్సేషన్,19 ఏండ్ల దివ్య దేశ్‌ముఖ్ ఫిడే వరల్డ్ చెస్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్‌గా, దేశానికి వరల్డ్ కప్ అందించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. సోమవారం ముగిసిన ఫైనల్లో 2.5–1.5 తేడాతో తోటి ప్లేయర్, లెజెండ్ కోనేరు హంపిని టైబ్రేక్‌లో ఓడించి ఈ చారిత్రక విజయం అందుకుంది. ఈ విక్టరీతో చెస్‌లో అత్యున్నతమైన గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా కూడా అందుకుంది. ఇండియా నుంచి హంపి, హారిక, ఆర్. వైశాలి తర్వాత జీఎం హోదా అందుకున్న నాలుగో అమ్మాయిగా నిలిచింది.
ఓవరాల్‌గా ఇండియా88వ గ్రాండ్ మాస్టర్ అయింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఒక్క జీఎం నార్మ్ కూడా లేని దివ్య, ఏకంగా చాంపియన్‌గా నిలిచి గ్రాండ్‌మాస్టర్ కావడం ఒక అద్భుతమే అనొచ్చు. ఈ టోర్నమెంట్ విజేతకు నేరుగా గ్రాండ్‌మాస్టర్ హోదా లభిస్తుంది. మరోవైపు పెండ్లి, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉండి రీఎంట్రీలో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న హంపి ఈ టోర్నీలో అంచనాలు అందుకుంటూ ఫైనల్ చేరినా.. ఆఖర్లో యువ రక్తం జోష్ ముందు తలొగ్గాల్సి వచ్చింది. వరల్డ్ కప్ అందకోలేకపోయినా.. మెగా టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలవడం కూడా తక్కువేం కాదు.
హోరాహోరీలో జూనియర్‌దే పైచేయి
శని, ఆదివారాల్లో దివ్య, హంపి మధ్య జరిగిన రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రాగా ముగియడంతో విన్నర్‌ను తేల్చేందుకు టైబ్రేకర్ అనివార్యమైంది. క్లాసికల్ గేమ్స్ మాదిరిగా హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో దివ్య గొప్ప మానసిక బలాన్ని చూపెపట్టింది. తొలి టై బ్రేక్ గేమ్‌లో హంపి మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ సమయం గడుస్తున్న కొద్దీ ఒత్తిడికి గురై కొన్ని పొరపాట్లు చేసింది. దీంతో 81 ఎత్తుల తర్వాత ఆ గేమ్ డ్రాగా ముగిసింది.
ఇక రెండో గేమ్‌లో హంపి ఆరంభంలో ఒక పావును త్యాగం చేసినా, దివ్య సమర్థవంతంగా ఎదుర్కొని ఆటను సమం చేసింది. అయితే, 40వ ఎత్తులో హంపి మరో పావును త్యాగం చేసి దూకుడుగా ఆడటానికి ప్రయత్నించి పొరపాటు చేసింది. దీంతో ఒత్తిడికి లోనైన లెజెండరీ ప్లేయర్ ఎండ్‌గేమ్‌లో మరో తప్పిదం చేయడంతో దివ్యకు విజయావకాశం లభించింది. ఆఖర్లో గెలుపోటములు దోబూచులాడినప్పటికీ చివరి వరకు పట్టు వదలని దివ్య 75వ ఎత్తులో అద్భుత
విజయాన్ని అందుకుంది.
నాకు రాసి పెట్టి ఉన్నట్టుంది..
లెజెండరీ ప్లేయర్ హంపిపై గెలిచిన వెంటనే దివ్య భావోద్వేగానికి గురైంది. ఆనందభాష్పాలతో ఉద్వేగానికి లోనైంది. ‘ఈ విజయాన్ని జీర్ణించుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది. బహుశా ఈ గెలుపు నాకు రాసి పెట్టి ఉందేమో. టోర్నీకి ముందు నాకు ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు, ఇప్పుడు నేను నేరుగా గ్రాండ్ మాస్టర్‌ని అయ్యాను. ఈ గెలుపు నాకెంతో విలువైనది. కానీ, ఇంకా చాలా సాధించాల్సింది ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అనుకుంటున్నా’ అని ఫైనల్ అనంతరం దివ్య చెప్పుకొచ్చింది.
ఫిడే వరల్డ్ కప్ గెలిచిన దేశ తొలి మహిళగా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. కోనేరు హంపి రన్నరప్‌గా నిలవడంతో ఇద్దరు ఫైనలిస్టు ఇండియా నుంచే ఉండటం మన దేశం చెస్, ముఖ్యంగా మహిళల్లో ఉన్న అపారమైన ప్రతిభకు నిదర్శనం.
– రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశంలోని ఇద్దరు అత్యుత్తమ చెస్ క్రీడాకారిణులు పాల్గొన్న చారిత్రాత్మక ఫైనల్లో యువ కెరటం దివ్య దేశ్‌ముఖ్ వరల్డ్ కప్ విన్నర్‌గా నిలవడం గర్వకారణం. గొప్ప ఘనత సాధించిన ఆమెకు నా అభినందనలు. ఈ విజయం యువతకు స్ఫూర్తినిస్తుంది.
–ప్రధాని నరేంద్ర మోదీ