సివిల్స్ పాసయ్యానని సంతోషం.. అంతలోనే షాకింగ్ న్యూస్

సివిల్స్ పాసయ్యానని సంతోషం.. అంతలోనే షాకింగ్ న్యూస్

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ర్యాంకు సాధించానని తెలియగానే ఆ యువతి ఆనందానికి అవధుల్లేవు. తల్లిండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. ఇరుగు పొరుగు వాళ్లతో పాటు లోకల్స్ లీడర్స్, స్థానిక అధికారులు కూడా ఆమెను అభినందనలతో ముంచెత్తారు. తీరా అసలు విషయం తెలిసి ఆ యువతి షాక్ అయ్యింది. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తాను ర్యాంకు సాధించలేదని తెలిసి నీరాశచెందింది. అసలింతకు  తప్పు ఎక్కడ దొర్లింది..?

జార్ఖండ్‌ రామ్‌గఢ్ కు చెందిన దివ్య పాండే(24) సివిల్స్ పరీక్ష రాసింది. గతవారం యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. దివ్య పాండే సోదరి ప్రియదర్శిని పాండేకు యూపీకి చెందిన ఓ స్నేహితురాలు.. ఫోన్ చేసి ఫలానా దివ్య పాండేకు యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 323 ర్యాంకు వచ్చిందని చెప్పింది. దీంతో ఆ దివ్య తన సోదరే అనుకుంది ఆమె. ఈ క్రమంలో ఇంటర్నెట్ లో రిజల్ట్స్ కోసం సెర్చ్ చేశారు. అయితే.. ఆ టైమ్ లో సర్వర్, ఇంటర్నెట్ సమస్య కారణంగా ఎంతసేపటికీ ఆ వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. తన స్నేహితురాలు చెప్పిన మాట నిజమే అనుకున్నారు. 323 ర్యాంకు రావడం నిజమేనని నమ్మిన దివ్య కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. స్థానికులకు స్వీట్లు పంచారు. దివ్య పాండే తండ్రి జగదీశ్ ప్రసాద్ పాండే 2016లో సెంట్రల్ కోలార్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) నుంచి క్రేన్ ఆపరేటర్ గా రిటైర్ అయ్యాడు. దీంతో ఆ తండ్రి కష్టం ఫలించిందని అంతా అనుకున్నారు. విషయం తెలిసిన సీసీఎల్ అధికారులు, జిల్లా పాలనా సిబ్బంది దివ్య పాండేను పిలిపించుకుని ఘనంగా సత్కారం చేశారు. క్రేన్ ఆపరేటర్ కుమార్తెకు సివిల్స్ ర్యాంకు అంటూ మీడియాలోనూ ఆమె పేరు మార్మోగింది. 

ర్యాంకు వచ్చిన ఆనందంలో ఢిల్లీకి చేరిన ఆ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాంకు వచ్చింది జార్ఖండ్ రామ్ గఢ్ జిల్లా చిట్టాపూర్ లోని రాజ్ రప్ప కాలనీకి చెందిన దివ్య పాండేకి కాదని అధికారులు తేల్చారు. ఆ ర్యాంకు దక్షిణ భారత్ కు చెందిన దివ్య పీ అనే అమ్మాయిది అని చెప్పడంతో ఆ కుటుంబం నిరాశగా ఇంటికి వెనుదిరిగింది. తమ పొరబాటును గ్రహించిన దివ్య కుటుంబం వెంటనే జిల్లా అధికారులు, సీసీఎల్ యాజమాన్యానికి క్షమాపణలు చెప్పింది. ఈ విషయంలో దివ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, ఇది కేవలం పొరబాటుగా జరిగిన ఘటనేనని రామ్ గఢ్ అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదు..

కవిగా మారిన హీరో రామ్..ది వారియర్ నుంచి సాంగ్ రిలీజ్