కర్నాటకలో వెరైటీగా దీపావళి

కర్నాటకలో వెరైటీగా దీపావళి

దీపావళి పండుగను మనదేశంలో ఒక్కోచోట ఒక్కోలా చేసుకుంటారు. కర్నాటకలోని ధంగర్ గౌలి తెగవాళ్లు దీపావళి పండుగని చేసుకునే తీరు వెరైటీగా అనిపిస్తుంది. ఆ రోజు ఊరివాళ్లంతా కలిసి ‘గజ’ అనే జానపద నృత్యం చేస్తారు. అంటే... అచ్చం ఏనుగు నడిచినట్టు నెమ్మదిగా అటు ఇటు కదులుతూ డాన్స్ చేస్తారు. ఈ  రోజు గజ నృత్యం చేస్తే.. దుష్టశక్తులు తొలగి, మంచి జరుగుతుందని నమ్ముతారు. 

దీపావళి రోజు...  పొద్దున్నే గుడిసెల్ని శుభ్రం చేసుకొని, ఆవుల్ని పూజిస్తారు. ధంగర్ తెగవాళ్లంతా ఎర్రని గీతలు, డిజైన్ బొమ్మలున్న తెల్లని కోటు లాంటి డ్రెస్​ వేసుకుని, నెత్తిన తెలుపు రంగు తలపాగా పెట్టుకుంటారు. కొందరు డోలు, కంచు పళ్లెం వాయిస్తుంటే, ‘చాంగ్ భళా, హోయ్ గజా’ అని పాడుతూ, లయబద్ధంగా ‘గజ’ నృత్యం చేస్తారు మిగతావాళ్లు.  అంతేకాదు సాయంత్రం అందరూ ‘షాపాట్’ అనే ఫన్నీ గేమ్ ఆడతారు. ఆ ఆటలో ఒక వ్యక్తి నేలపై పడుకుంటాడు. మిగతావాళ్లు అతడిని చేతులతో పైకి ఎత్తుతారు. 

మరాఠీ, కొంకణీ కలిపి..

ధంగర్ తెగవాళ్లు గుడిసెల్లో నివసిస్తారు. వీళ్లు ఆవులు, గొర్రెల్ని పెంచుతూ జీవనం సాగిస్తారు. వీళ్ల  గుడిసెలు ఉన్న ప్రాంతాన్ని ‘గౌలివాడ’ అంటారు. కర్నాటకలోని ఎల్లాపూర్, దండేలి, ముండ్​గాడ్ వంటి జిల్లాల్లో గౌలివాడలు ఉన్నాయి. అయితే, వీళ్లు ఇక్కడివాళ్లు కాదని, వందేండ్ల కిందట మహారాష్ట్ర, గోవా నుంచి కర్నాటక అటవీ ప్రాంతంలోకి ఈ కమ్యూనిటీ వలస వచ్చిందని చెప్తారు. 
అందుకు రుజువు... ఇప్పటికీ వీళ్లు  మరాఠీ, కొంకణీ  భాషలు కలగలసిన భాష మాట్లాడటం. 

పశుసంపద పెరగాలని

‘‘ఊళ్లోని మగవాళ్లంతా గజ నృత్యం చేయాలనేది మా తెగ నియమం. అందుకని పెద్దవాళ్లను చూసి ఈ డాన్స్ నేర్చుకుంటారు మగపిల్లలు. అంతేకాదు కొన్ని గౌలివాడల్లో దీపావళి రోజు తమలపాకులు, వక్కపలుకులు పంచి, ‘షిల్లంగన్​’ వేడుక చేస్తారు. ఈ సందర్భంగా తమ కోర్కెలు తీర్చాలని, పశుసంపద పెరగాలని మహావిష్ణువుని పూజిస్తారు. పాలు, నెయ్యి, మజ్జిగ, బెల్లంతో తియ్యని వంటకాలు చేసి ఇరుగుపొరుగు తో ఇచ్చిపుచ్చుకుంటార’’ని చెప్తున్నాడు బజ్జూ కోయ తాటే అనే యువకుడు.