దీపావళి క్రాకర్స్‌‌పై ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం

దీపావళి క్రాకర్స్‌‌పై ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి కాలుష్య తీవ్రత వేగంగా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యలో వాయు కాలుష్య నియంత్రణకు సీఎం కేజ్రీవాల్ సర్కారు పలు చర్యలు తీసుకుంటోంది. సరి బేసి విధానంలో రోడ్ల మీదకు వాహనాలను అనుమతించడం మొదలు.. పౌరుల్లో కాలుష్యంపై బాధ్యతను పెంచేందుకు కేజ్రీ ప్రయత్నిస్తున్నారు. మరో రెండు నెలల్లో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వాయు కాలుష్య తీవ్రత దృష్ట్యా దీపావళికి టపాసుల క్రయ విక్రయాలు, పేల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. 

‘గత మూడేళ్లుగా దివాళీ సమయంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది పండుగకు అన్ని రకాల ఫైర్‌క్రాకర్స్‌ల అమ్మకాలు, స్టోరేజ్, వాడకంపై బ్యాన్ వేస్తున్నాం. మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం’ అని కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. గతేడాది కూడా టపాసులపై బ్యాన్ వేశామని, అయితే అది ఆలస్యంగా వేయడంతో వ్యాపారులు నష్టపోయారన్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత పీఎం 2.5గా ఉందని, ఇది సురక్షితమైన లిమిట్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ట్రేడర్లు దీన్ని అర్థం చేసుకుని క్రాకర్స్‌ అమ్మకాలు జరపొద్దని విజ్ఞప్తి చేశారు.