
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: నారాయణపేటలో శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే దగ్గర డ్యాన్స్ చేస్తూ మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శాసన్ పల్లి శేఖర్(45) గుండెపోటుతో చనిపోయాడు. బురుడివాడకు చెందిన శేఖర్ వాటర్ సప్లై విభాగంలో పని చేస్తున్నాడు. డీజే దగ్గర డ్యాన్స్ చేస్తూ కింద పడిపోగా, ఎస్సై వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి వేణుగోపాల్ సీపీఆర్ చేసి, ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గోదావరిలో యువకుడు గల్లంతు..
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వద్ద గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. రామగుండం అక్బర్నగర్ కాలనీకి చెందిన రాజేశ్(23) గోదావరిలో కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లాడు. నిద్రమత్తులో ఉన్న రాజేశ్ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయాడు. రాజేశ్ కుటుంబసభ్యులు, సీపీఐ కార్యదర్శి కనకరాజు గోదావరి బ్రిడ్జి వద్ద ఆందోళనకు దిగారు. రాజేశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నీటి గుంతలో పడి..
మంగపేట, వెలుగు: జయశంకర్భూపాలపల్లి మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కుంటలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన గార అంజయ్య(54) వినాయక నిమజ్జనం సందర్భంగా బ్యాండ్ కొట్టడానికి బ్రాహ్మణపల్లికి వచ్చాడు. మూత్ర విసర్జనకు వెళ్లిన అతడు సబ్ స్టేషన్ సమీపంలోని నీటిగుంటలో పడి చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీవీఆర్ సూరి తెలిపారు.