రేవంత్ రెడ్డికి డీకే అరుణ వార్నింగ్

రేవంత్ రెడ్డికి డీకే అరుణ  వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లో పుట్టి పెరిగినోడి లెక్క పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. రేవంత్ తన భాషను మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. సోనియాను బలి దేవతగా అభివర్ణించిన రేవంత్ మాటలను ప్రజలు మర్చిపోలేదని, ఆయనను తెలంగాణ చంద్రబాబుగా భావిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దొడ్డిదారిన కాంగ్రెస్ లో చేరిన చరిత్ర రేవంత్ ది అని ఫైర్ అయ్యారు. ‘‘అమిత్ షాను గుజరాత్ నుంచి బహిష్కరించడాన్ని సుప్రీం తప్పుపట్టింది. తెలంగాణ ఏర్పాటును కాదు.. రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే మోడీ పార్లమెంట్ లో తప్పుపట్టారు” అని గుర్తు చేశారు. ‘‘ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో వేధించి ఎంతో మందిని జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్ ది. దేశ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. బీజేపీని మాత్రమే ప్రజలు నమ్ముతున్నారు” అని అన్నారు. 

టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్న విషయం రాష్ట్రపతి ఎన్నికతో రుజువైందన్నారు. ‘‘సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. హుజూరాబాద్ లెక్కనే మునుగోడులోనూ కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కదు” అని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓటమి భయం వేధిస్తోందని, అందుకే తమపై హత్యాప్రయత్నాలు చేయించుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

బ్లాక్ మెయిలింగ్ రేవంత్​కు అలవాటే : ఈటల

బట్ట కాల్చి మీద వేయడం, బ్లాక్ మెయిలింగ్ చేయడం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అలవాటేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మాట మాట్లాడితే సభ్యత, సంస్కారం ఉండాలని.. కానీ అవేవీ రేవంత్ లో కనిపించడం లేదన్నారు. పిచ్చి భాష మాట్లాడితే ప్రజల్లో పలుచనయ్యేది ఆయనేనన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఈటల మీడియాతో మాట్లాడారు. మూడు,  నాలుగు పార్టీలు మారిన రేవంత్... పీసీసీ చీఫ్ అయ్యాక సరైన రిజల్ట్ రావడం లేదనే నిస్పృహలో ఉన్నారని అన్నారు. ‘‘రేవంత్ అంత మొనగాడే అయితే కొడంగల్ లో ఎందుకు గెలవలేదు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నా రేవంత్.. ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు” అని ప్రశ్నించారు.  ‘‘నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తానని రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ ఆఫర్ చేశారు. అయినా ఆయన టీఆర్ఎస్ లో చేరలేదు.

రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కాంట్రాక్టు పనులను కేసీఆర్ రద్దు చేసినా, చివరికి డబ్బులు ఇవ్వకుండా ఆపేసి ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన మాత్రం టీఆర్ఎస్ లో చేరలేదు” అని చెప్పారు. ‘‘నా కొట్లాట అంతా సీఎం కేసీఆర్ తోనే. ఆయనకు దమ్ముంటే  గజ్వేల్ లో నాతో పోటీకి సిద్ధం కావాలి. ధైర్యం ఉంటే పోటీ చేస్తానని ప్రకటన చేయాలి” అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు.

రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో
బీజేపీ జోలికొస్తే ఊరుకోం : రాజాసింగ్ 

హైదరాబాద్, వెలుగు: బ్లాక్ మెయిలర్ గా పేరున్న రేవంత్ రెడ్డికి బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై ఆరోపణలు చేసే అర్హత లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిందే బీజేపీ మద్దతుతో అనే విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, బీజేపీ జోలికొస్తే ఊరుకోబోమని బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. బీజేపీ లేకుంటే తెలంగాణ ఏర్పడేదే కాదన్నారు. రాజకీయాల్లో రంగులు మార్చే నైజం రేవంత్​ది అని విమర్శించారు. సోనియాపై ఈడీ కేసు ఉంది కాబట్టే విచారణకు పిలుస్తున్నారని, రేవంత్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ తో రేవంత్  కుమ్కక్కయ్యారని అన్నారు. అందుకే ఓటుకు నోటు కేసు ముందుకు సాగడం లేదన్నారు.