కరోనా కరప్షన్: ఒక్కో వెంటిలేటర్‌పై రూ.13 లక్షల అవినీతి

కరోనా కరప్షన్: ఒక్కో వెంటిలేటర్‌పై రూ.13 లక్షల అవినీతి
  • కర్ణాటక ప్రభుత్వంపై కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపణలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి అవకాశంగా మలుచుకుందని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. కరోనా పేషెంట్ల ఆరోగ్యం విషమించిన సమయంలో వారి ప్రాణాలను కాపాడడంలో కీలకమైన పాత్ర పోషించే వెంటిలేటర్ల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఒక్కో వెంటిలేటర్‌ను రూ.4.78 లక్షలకు కొనుగోలు చేస్తే కర్ణాటకలో వాటిని రూ.18.20 లక్షల చొప్పున కొన్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్న కరోనా కరప్షన్‌ ఈ వెంటిలేటర్ల కొనుగోలు స్కామ్ ద్వారా బయటపడిందని చెప్పారు. ఒక్కో వెంటిలేటర్‌పై దాదాపు 13 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారాయన. దీనిపై సమాధానం చెప్పాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను ట్విట్టర్ వేదికగా నిలదీశారు. వెంటిలేటర్ల కొరతతో కర్ణాటక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, బీజేపీ మంత్రులు మాత్రం కరోనా కరప్షన్ చేసే పనిలో బిజీగా ఉన్నారని డీకే శివకుమార్ మండిపడ్డారు. పీపీఈలు, టెస్టు కిట్లు మొదలు అన్ని అన్ని కొనుగోళ్లలోనూ.. ఆఖరికి బెడ్స్ వరకు కరోనా కరప్షన్‌కు వాడుకుంటున్నారని ఆరోపించారు.  ఆరోగ్య సంక్షోభాన్ని బీజేపీ ప్రభుత్వం దోచుకునేందుకు అవకాశంగా మార్చుకుంటోందన్నారు. దీనికి ఓ పత్రిక కథనాన్ని జత చేసి బీజేపీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.