
బెంగళూరు : రాజకీయ ప్రత్యర్థులు తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా తాంత్రిక పూజలు చేయిస్తున్నారని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కేరళలోని ఓ దేవాలయంలో అఘోరాలు, తాంత్రికులతో యాగాలు చేయిస్తున్నారని మీడియాకు వెల్లడించారు. థాలిపరంబులోని రాజరాజేశ్వర ఆలయానికి దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతంలో అఘోరాలు రాజ కంటక, మరణ మోహన స్తంభన యాగాలు చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందని చెప్పారు. ఆ యాగంలో పాల్గొన్న వ్యక్తులే తనకు చెప్పారన్నారు.
శత్రువులను అడ్డు తొలగించడానికి ఈ యాగం చేస్తారని వివరించారు. 21 ఎర్ర మేకలు, 21 నల్ల మేకలు, ఐదు పందులు, మూడు గేదెలను ఈ యాగాల్లో బలిస్తున్నారని తెలిపారు. దీని వెనక బీజేపీ, జేడీఎస్ నాయకులున్నారా అని మీడియా ప్రశ్నించగా.. కర్నాటకకు చెందిన లీడర్లే చేయిస్తున్నారని, వాళ్లు ఎవరనేది తనకు తెలుసని శివకుమార్ సమాధానమిచ్చారు. వాళ్ల పేర్లు చెప్పమని అడగ్గా.. మీడియానే ఇన్వెస్టిగేట్ చేయాలని సూచించారు. కౌంటర్‌గా మీరు పూజలు చేస్తారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు.. ‘‘నేను రోజూ ఒక నిమిషంపాటు దేవుడిని ప్రార్థిస్తాను. మనం నమ్మే శక్తులే మనల్ని కాపాడతాయి”అని శివకుమార్ బదులిచ్చారు.