దేశంలో సంపన్న ఎమ్మెల్యే డీకే శివకుమార్

దేశంలో సంపన్న ఎమ్మెల్యే డీకే శివకుమార్

కర్నాటక డిప్యూటీ సీఎంకు రూ.1,400 కోట్ల ఆస్తులు
టాప్​ 20లో 12 మంది కర్నాటక వారే
రూ.2 వేలు కూడా లేని బెంగాల్​ ఎమ్మెల్యే నిర్మల్​ కుమార్ లాస్ట్
ఏడీఎఫ్ నివేదిక 


బెంగళూరు: దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్నాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ​ఎమ్మెల్యే డీకే శివకుమార్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.1,400 కోట్లకు పైగా ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఎఫ్) సంస్థ తన రిపోర్టులో వెల్లడించింది. డీకే తర్వాత రెండో స్థానంలో రూ.1,267 కోట్లతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్​కే పుట్టస్వామి ఉన్నారు.  రూ.1,156 కోట్లతో కాంగ్రెస్‌కు చెందిన ప్రియా కృష్ణ మూడో స్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా కర్నాటక నేతలే. అలాగే దేశంలోని టాప్​20 సంపన్న ఎమ్మెల్యేలలో 12 మంది కర్నాటక వారే ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే టాప్​10 రిచెస్ట్ ఎమ్మెల్యేలలో నలుగురు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ వారు ఉన్నారు. అయితే, మైనింగ్ వ్యాపారంతో అత్యంత సంపన్నుడిగా ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డి ఏడీఎఫ్ లిస్ట్ లో 23వ స్థానంలో ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార ఎటువంటి ఆస్తులు లేకుండా కేవలం రూ.1,700తో ఈ లిస్ట్​లో చిట్టచివరి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఒడిశాకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మకరంద ముదులి రూ.15,000తో, పంజాబ్ నుంచి ఆప్ నేత నరీందర్ పాల్ సింగ్ సావ్నా రూ.18,370తో చివరి నుంచి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.