కర్నాటకలో మోదీ వేవ్ లేదు: డీకే.శివ కుమార్

కర్నాటకలో మోదీ వేవ్ లేదు:  డీకే.శివ కుమార్

బెంగళూరు :  కర్నాటకలో మోదీ వేవ్ లేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే. శివ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కర్నాటకలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుంది. రాష్ట్రంలో మోదీ వేవ్ లేదు. ప్రధాని తన పదేండ్ల పాలన కాలంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కర్నాటక నుంచి కోట్లాది రూపాయాలను పన్నుల రూపంలో వసూలు చేసింది. 230 తాలూకాల్లో తీవ్రమైన కరువు నెలకొన్నప్పటికీ రాష్ట్రానికి నిధులను అందించలేదు”అని డీకే. శివ కుమార్ తెలిపారు.

బెంగళూరు రూరల్ నియోజకరవర్గంలో తన సోదరుడు డీకే. సురేశ్ రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీఎస్ పొత్తు అనేది విఫలమైన కూటమి అని అభివర్ణించారు. ప్రజలు దానిని తిరస్కరిస్తారని పేర్కొన్నారు. జేడీ (ఎస్) నాయకుడు హెచ్ డీ. కుమారస్వామితో సహా ఆ పార్టీ అభ్యర్థులందరూ ఓటమి పాలవుతారని జోస్యం  చెప్పారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్న అవినీతి ఆరోపణలపై కూడా డీకే. శివ కుమార్ స్పందించారు. ‘‘నాకు వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వారు ఏం నిరూపించలేరు. కాంగ్రెస్ లో ఎటువంటి అసమ్మతి లేదు. 24 గంటల్లో దానిని పరిష్కరిస్తాం. కానీ, బీజేపీలో మాత్రం అసమ్మతి ఉంది. ఆ పార్టీ దాదాపుగా 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది’’ అని డీకే. శివ కుమార్ వెల్లడించారు.