కర్నాటక కొత్త సీఎంగా డీకే! సీఎం పదవి వదులుకుంటుంన్నందుకు సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఇదే..

కర్నాటక కొత్త సీఎంగా డీకే! సీఎం పదవి వదులుకుంటుంన్నందుకు సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఇదే..
  • ఇవాళ (మే 28) డీకేతో కలిసి అల్పాహార విందు..
  •  తర్వాత గవర్నర్ను కలిసి రాజీనామా 
  • ఆ తర్వాత మీడియా ప్రకటనకు చాన్స్ 

కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నియామకానికి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం పదవి నుంచి దిగిపోయి, రాజ్యసభకు వెళ్లడానికి సిద్ధరామయ్య అంగీకరించినట్లుగా సమాచారం. సీఎం మార్పుపై ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ, గురువారం (మే 28) ఉదయం 11 గంటలకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌‌‌‌ను కలవడానికి సిద్ధరామయ్య అపాయింట్మెంట్ కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ధ్రువీకరించాయి.

బెంగళూరు: కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నియామకానికి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం పదవి నుంచి దిగిపోయి, రాజ్యసభకు వెళ్లడానికి సిద్ధరామయ్య అంగీకరించినట్లుగా సమాచారం. ముందుగా కర్నాటక తదుపరి సీఎంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును హైకమాండ్ పరిశీలించినప్పటికీ.. వయోభారం, ఆరోగ్య కారణాల రీత్యా సీఎం పదవి చేపట్టేందుకు ఆయన అంగీకరించలేదని తెలిసింది. దీంతో డీకే శివకుమార్‌‌ను కొత్త సీఎంగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం రాత్రి ఆలస్యంగా నిర్ణయించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

కర్నాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ, డీకే సారథ్యంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సీఎం పదవి కోసం ఇరువురు నేతలు పోటీ పడగా, చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి చేపట్టేలా హైకమాండ్ సర్దిచెప్పింది. ఈ నేపథ్యంలో ఏడాదికిపైగా సీఎం పదవి కోసం డీకే వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలాగే హైకమాండ్ వాగ్దానం ప్రకారం, డీకేకు నాయకత్వాన్ని అప్పగించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ గట్టిగా మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

రాష్ట్రంలో మళ్లీ 2028లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున.. ఆలోగా పార్టీని మళ్లీ పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, ఎన్నికల్లో గెలిచేలా చూసే బాధ్యతను కూడా డీకేపైనే పెట్టినట్టుగా సమాచారం. కాగా, సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తనతో చెప్పారని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ ఆర్‌‌.వి. దేశ్‌‌పాండే తెలిపారు.

  • నేడు గవర్నర్​ను కలవనున్న సిద్ధూ 

సీఎం మార్పు దాదాపు ఖరారు అయినప్పటికీ, సిద్ధరామయ్య దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. నాయకత్వ మార్పు ఊహాగానాలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అలాగే, డీకే శివకుమార్ గురువారం అల్పాహారం కోసం సిద్ధరామయ్యను కలుస్తారని భావిస్తున్నారు. సీఎం మార్పుపై ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ, గురువారం ఉదయం11 గంటలకు గవర్నర్ గెహ్లాట్‌‌ను కలవడానికి సిద్ధరామయ్య అపాయింట్మెంట్ కోరినట్లు సీఎంవో వర్గాలు ధృవీకరించాయి. 

  • రాజీనామా చేస్తారా? సాగదీస్తారా? 

సిద్ధరామయ్య గురువారం లేదా శుక్రవారమే రాజీనామా చేయవచ్చని.. వారాంతంలో డీకే ప్రమాణ స్వీకారం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ సిద్ధరామయ్య తన రాజీనామాను ఇంకా సాగదీయాలని చూస్తే గనక.. డీకే ప్రమాణ స్వీకారం జూన్ 18న రాజ్యసభ ఎన్నికల తర్వాతకు వాయిదా పడవచ్చని చెప్తున్నారు.