ఢిల్లీకి చేరిన కర్నాటక సీఎం పంచాయితీ.. సిద్దరామయ్యనా ! ..డీకే శివకుమారా..!

ఢిల్లీకి చేరిన కర్నాటక సీఎం పంచాయితీ.. సిద్దరామయ్యనా ! ..డీకే శివకుమారా..!

కర్నాటక సీఎం అభ్యర్థి ఎంపిక పంచాయితీ ఢిల్లీకి చేరింది.  సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్, సిద్దరామయ్యలను మే 15న  ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది.  రాహుల్, ఖర్గే చర్చించిన తరువాత కర్ణాటక సీఎం అభ్యర్థిపై  నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  మే 15 లేదా మే 16 తేదీల్లో సీఎం అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం ఉంది.  అయితే సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్ఠానమే ప్రకటించాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

బెంగుళూరులోని శాంగ్రీల్లా హోటల్ లో సీఎల్పీ భేటీ జరిగింది. ముఖాముఖీగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు.  కాంగ్రెస్ అధిష్టానం నియమించిన పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు తీసుకుని హైకమాండ్‌కు నివేదించారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను పరిశీలకులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియమించారు. 

మొదట డీకే శివకుమార్.. సిద్దరామయ్యతో విడివిడిగా సమావేశమైన పరిశీలకులు తరువాత ఇద్దరితో కలిసి  చర్చించారు.  ఖర్గే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వేణుగోపాల్ సూచించారు.   మీటింగ్ జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల కార్యకర్తలు బయట నినాదాలు చేశారు.