వణికిస్తున్న డెంగ్యూ..ఒకేరోజు ఇద్దరి మృతి

వణికిస్తున్న డెంగ్యూ..ఒకేరోజు ఇద్దరి మృతి
  •     చింద్రియాల కాలనీలో ఒకేరోజు ఇద్దరి మృతి
  •     లోపించిన పారిశుధ్యం 
  •     గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు


అశ్వాపురం వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింద్రియాల కాలనీ గ్రామం డెంగ్యూ జ్వరాలతో మంచం పట్టింది.  గ్రామంలో 235 కుటుంబాలు, 738 జనాభా ఉన్నారు. నాలుగు రోజులుగా గ్రామంలో డెంగ్యూ బారిన పడ్డారు. శుక్రవారం ఒకేరోజు డెంగ్యూ జ్వరంతో వెన్న రంజిత్ కుమార్, నిమ్మల శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

ఇటీవల  కురిసిన వర్షాలతో   గ్రామంలో పారిశుధ్యం లోపించింది. గ్రామంలో 20 మందికి పైగా జ్వరాలతో అల్లాడుతున్నారు.  ఒకే కుటుంబానికి చెందిన డేగల బ్లేస్సి (14)  డేగల హర్షవర్ధన్ (16) మణుగూరులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరానికి చికిత్స పొందుతున్నారు.   పాలకవర్గం నిర్లక్ష్యంతో జ్వరాలతో ఈ గ్రామం అల్లాడుతోంది. 

వైద్య శిబిరం ఏర్పాటు

శనివారం గ్రామంలో నలుగురు వైద్యులతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరాలతో బాధపడుతున్న 20 మంది రక్త నమూనాలను సేకరించి టెస్టింగ్ కోసం మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పంపించారు. గ్రామంలో బ్లీచింగ్ చల్లి, ఫినాయిలు స్ప్రే చేయించారు .ఈ సందర్భంగా జిల్లా ఇమ్యూ నైజేషన్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ పారిశుధ్య లోపంతోనే జ్వరాలు సోకుతున్నాయన్నారు.  జ్వరాలు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్లు బాలాజీ, పరిష్య నాయక్ , సంకీర్తన, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మణికంఠ రెడ్డి తెలిపారు.  గ్రామంలోనే మకాం వేసి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు

ఎక్కడ చూసినా అపరిశుభ్రతే

వర్షాల కారణంగా కాలనీలో తీవ్రమైన అపరిశుభ్రత చోటు చేసుకుంది.  వీధులలో అడుగు తీసి అడుగు వేయడమే గగనమవుతుంది. సైడ్ కాలువలు  ఇవటర్నల్​ రోడ్లు  అధ్వానంగా తయారయ్యాయి. ఇండ్ల లోపల తేమ చేరి అపరిశుభ్రంగా ఉంటుంది. పంచాయతీ పాలకవర్గం  గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

గ్రామాల్లో వణికిస్తున్న జ్వరాలు

చండ్రుగొండ,వెలుగు:మండలంలోని గుర్రాయిగూడెం, చండ్రుగొండ, మహ్మద్ నగర్, అయ్యన్నపాలెం, తదతర గ్రామాల్లో జ్వరాలు వణికిస్తున్నాయి.  కళ్ల కలకలు వచ్చి వాటితో పాటు చలి జ్వరం సోకి వణికిపోతున్నారు.  ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లో  దోమలు విపరీతంగా పెరిగాయి.  వైద్యం కోసం  జ్వరపీడితులు  కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లి లోని ప్రవేట్​ ఆస్పత్రులకు వెళ్తున్నారు. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ పరీక్షల పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారని  గ్రామస్తులు అంటున్నారు.

చండ్రుగొండ పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ తనూజ ను వివరణ కోరగా గ్రామాల్లో జ్వరాలతో ప్రజలు బాధపడ్తున్న విషయం వాస్తవమేనన్నారు. ఇప్పటికే మహ్మద్ నగర్ గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. జ్వర లక్షణాలున్న వారు  ఏఎన్ఎం , ఆశాలకు సమాచారమిచ్చి చండ్రుగొండ పీహెచ్ సీకి రావాలని కోరారు.