ప్రైవేట్​నాటక ప్రదర్శనకు డీఎంఎఫ్​టీ నిధులు

ప్రైవేట్​నాటక ప్రదర్శనకు డీఎంఎఫ్​టీ నిధులు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో మౌలిక సదుపాయాలకు ఖర్చుపెట్టాల్సిన డీఎంఎఫ్​టీ నిధులను ఆఫీసర్లు ప్రైవేటు కార్యక్రమాలకు  కేటాయించారు. ఓ ముఖ్యనేత ఆదేశాలతో జరిగిన ఈ తతంగం  స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విజయ భాను కళ సమితి స్వర్ణోత్సవాల సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఏప్రిల్ 1,  2 తేదీల్లో దమయంతి స్వయంవరం, రావణ పద్య నాటకం ప్రదర్శన చేశారు. అయితే ప్రదర్శన ఏర్పాట్లకు ఫండ్స్ కావాలంటూ జిల్లాలోని ఓ ముఖ్య నేతను సమితి సభ్యులు కోరారు. దీనికి ఆ నేత స్పందిస్తూ వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయాలంటూ కలెక్టర్ కు సూచించారు. దీంతో కలెక్టర్​ సీబీ‌‌‌‌ఎఫ్ (కలెక్టర్ క్యూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్స్)  నుంచి విడుదల చేయాలని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ను ఆదేశించారు. కొన్నేళ్లుగా సీబీ‌‌‌‌ఎఫ్ ఫండ్స్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రీయింబర్స్ కింద జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి నాటక ప్రదర్శన కోసం రూ. 3.76లక్షలు, హార్మోనియమ్ కోసం రూ. 1.30లక్షలు  ఆఫీసర్లు విడుదల 
చేశారు.

మూడు రోజుల్లోనే ఫండ్స్​ రిలీజ్.. 

ప్రభుత్వ పనులు పూర్తి చేసి  బిల్లులు పెట్టుకొని నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా డబ్బులు రావు.. అలాంటిది ఈ కార్యక్రమానికి మాత్రం జిల్లా ముఖ్య నేత ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద ఫండ్స్ విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మార్చి 26న ఫండ్స్ విడుదల చేయాలంటూ ఆ నేత ఆదేశించగానే ఏప్రిల్ 1న నాటక ప్రదర్శన ఉండగా మార్చి 30నే చెక్కును ఆఫీసర్లు ఆ సభ్యులకు అప్పగించారు. ఫండ్స్ లేకపోయిన నేత మెప్పు కోసం జిల్లా ఆఫీసర్లు కేవలం కొటేషన్ మాత్రమే తీసుకొని జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి కేటాయించడం గమనార్హం. 

బిల్లులు లేకుండా చెల్లింపులు

సాధారణంగా పనులు పూర్తి చేసి బిల్స్ పెట్టుకున్నాక ఫండ్స్ రిలీజ్ చేయాల్సి ఉండగా జిల్లా ఆఫీసర్లు మాత్రం అందుకు విరుద్దంగా ఎలాంటి బిల్లులు లేకుండా ఫండ్స్ విడుదల చేశారు. కేవలం కొటేషన్ మాత్రమే తీసుకొని ఫండ్స్ రిలీజ్ చేయగా నేటి వరకు ఎందుకు ఖర్చు చేశారు.. అనే వాటిపై ఆఫీసర్ల సమాధానం చెప్పలేక దాటవేస్తున్నారు. ఈ ఫండ్స్ వినియోగంపై పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం తుతూ మంత్రంగా నాటక ప్రదర్శన చేశారని, ఫండ్స్ ను పూర్తిగా  దుర్వినియోగం చేశారని కొంతమంది విజయభాను కళ సమితి సభ్యులే ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడితే పలు అక్రమాలు బయట పడుతాయని పలువురు కోరుతున్నారు.