కేసీఆర్ ఫ్రంట్ ప్రపోజల్ కు ఒప్పుకోని స్టాలిన్!

కేసీఆర్ ఫ్రంట్ ప్రపోజల్ కు ఒప్పుకోని స్టాలిన్!

వీలుంటే మీరూ కాంగ్రెస్ తో కలవండి 

CM కేసీఆర్ తో స్టాలిన్

చెన్నై: ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ సమావేశం ముగిసింది. తాజా రాజకీయాలపై ఇద్దరూ దాదాపు గంట సేపు చర్చించారు. సమావేశం తర్వాత కేసీఆర్, స్టాలిన్ ఇద్దరూ మీడియాతో మాట్లాడలేదు.

లోక్ సభ ఎన్నికలు, రాజకీయ వ్యూహాలపై స్టాలిన్- కేసీఆర్ చర్చించారని డీఎంకే నేతలు చెప్పారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు… కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోటీ చేశాయనీ…  ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ గా ఏర్పాటయ్యేందుకు డీఎంకే ముందుకు రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్టుగా చెప్పారు.

ఈ సందర్భంగా డీఎంకే వైఖరిని స్టాలిన్.. కేసీఆర్ కు వివరించారని చెప్పారు. “కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తీసుకురావడమే మా లక్ష్యం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా డీఎంకేనే ప్రపోజ్ చేసింది కాబట్టి… కాంగ్రెస్ నుంచి మేం విడిపోలేం. వీలుంటే మీరూ కాంగ్రెస్ తో జతకలవండి” అంటూ తన అభిప్రాయాన్ని స్టాలిన్ కేసీఆర్ కు చెప్పినట్టుగా DMK నేతలు తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్ అజెండాను కేసీఆర్ వివరించినప్పటికీ.. అందుకు స్టాలిన్ నుంచి సానుకూల స్పందన రాలేదని డీఎంకే తెలిపింది.

ఆదివారం తమిళనాడు వెళ్లిన కేసీఆర్.. ఇవాళ స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తమ ఇంటికి వచ్చిన కేసీఆర్ కు స్టాలిన్ తో పాటు.. ఆయన సోదరుడు అళగిరి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు వినోద్, సంతోష్ కూడా ఉన్నారు.