సభ్యత్వం లేనోళ్లకు ఎంపీ టికెట్‍ ఇవ్వొద్దు

సభ్యత్వం లేనోళ్లకు ఎంపీ టికెట్‍ ఇవ్వొద్దు

వరంగల్‍, వెలుగు: ఉద్యమంలో కనబడని వాళ్లు, పార్టీ సభ్యత్వం కూడా లేనోళ్లకు బీఆర్‍ఎస్‍ వరంగల్‍ ఎంపీ టిక్కెట్‍ ఇవ్వొద్దని మాజీ కార్పొరేటర్లు, కేయూ జేఏసీ ఉద్యమకారులు కోరారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ లో బోడ డిన్నా, జోరిక రమేశ్‍, బొల్లికొండ వీరేందర్‍, బండి రజిని కుమార్‍ మీడియాతో మాట్లాడారు. బ్లాక్‍  మెయిల్‍ రాజకీయాలు చేసేటోళ్లు, స్వలాభం కోసం పనిచేసేటోళ్లు ఇప్పుడు తమ కుటుంబ సభ్యుల కోసం వరంగల్‍ ఎంపీ టిక్కెట్‍ అడుగుతున్నారన్నారు. 

అలాంటి వారికి టిక్కెట్ ఇస్తే ఉద్యమకారులు, నిజమైన కార్యకర్తలు పనిచేయలేరన్నారు. నిన్నమొన్నటి వరకు పార్టీ తరఫున గ్రేటర్‍ ఎమ్మెల్యేలుగా పనిచేసినోళ్లు ఉద్యమకారులను ఎదగనివ్వలేదని ఆరోపించారు. పదేళ్లు పదవులు అనుభవించిన వారు రెండు నెలలు పవర్ లేకుంటేనే పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. చదువులు, ఉద్యోగాలకు దూరమై కేసులు, జైళ్ల పాలైనా పార్టీ వీడకుండా కష్టకాలంలో అండగా ఉన్న కేయూ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‍, కేటీఆర్‍ ఇప్పటికైనా స్పందించి వరంగల్‍ ఎంపీ టిక్కెట్‍ ఉద్యమకారులకు ఇవ్వాలని కోరారు.