కల్తీలు ఎన్ని రకాలు.. ఎలా గుర్తు పట్టాలంటే..

కల్తీలు ఎన్ని రకాలు.. ఎలా గుర్తు పట్టాలంటే..

మూడు పూటలా తిండి ఉంటే చాలు ఎట్లయిన బతకొచ్చు అనుకుంటారు మనుషులు. అందుకే ఆహారాన్ని అమృతం అంటారు. మరి అలాంటి అమృతం కల్తీ అవుతుంటే ఏం తినాలి? ఏం తాగాలి? పొద్దున్నే తెచ్చుకునే పాల ప్యాకెట్​తో మొదలు అందులో కలిపే చక్కెర, టీ లేదా కాఫీ పొడి నుంచి వంటకు వాడే నూనెలు, మసాలాలు, చపాతీ పిండి, ఉప్పు, పప్పులు, చిరు ధాన్యాలు... ఆఖరికి బియ్యం కూడా కల్తీ. ఏం తింటే ఏమవుతుందోనని భయం.

మనదేశంలో కల్తీ చేసే ఆహారపదార్థాల్లో మొదటి ప్లేస్​లో ఉండేది పాలు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలు టెస్ట్ చేస్తే అందులో నీళ్లు, డిటర్జెంట్, కొవ్వు, యూరియా వంటివి కలుపుతున్నట్టు ఒక స్టడీలో తేలింది. వీటితోపాటు సుద్ద, కాస్టిక్ సోడా వంటివి కూడా కలుపుతున్నారట. కోవా, పనీర్ వంటివి కూడా కల్తీ పాల నుంచే తయారుచేస్తున్నారు. కోవా తయారీలో అదనంగా పేపర్, రిఫైన్డ్‌ ఆయిల్, నాసిరకం పాల పొడి వాడుతున్నారు.

కల్తీ అయ్యేవాటిలో ఆ తర్వాతి స్థానం టీ, కాఫీ పొడులది. టీ పొడి రంగులో ఉండే పదార్థాలనే అందులో కలుపుతున్నారు. దానివల్ల లివర్ ఇన్ఫెక్షన్ వస్తోందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాఫీ గింజల్లో చింత పిక్కలు, ఆవాలు వంటివి కలుస్తున్నాయి. ఇలాంటి పొడితో చేసిన కాఫీ తాగితే డయేరియా బారిన పడటం ఖాయం అంటున్నాయి స్టడీలు. బరువు తగ్గడం కోసమని అన్నం మానేసి చపాతీలు తినేవాళ్ల సంఖ్య కొంతకాలంగా బాగా పెరిగిపోయింది. ఆ చపాతీల తయారీకి వాడే గోధుమ పిండి, పప్పుల్లో ఫంగస్ వంటి విషపూరిత పదార్థాలు ఉంటున్నాయి. వీటితో తయారుచేసినవి తినడం వల్ల రకరకాల అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి.

ఇవేకాకుండా ప్రకృతి ఇచ్చే పండ్లు, కూరగాయలను కూడా కల్తీ వదలడం లేదు. అదెలాగంటే... కూరగాయలు తాజాగా ఉన్నట్టు కనిపించాలని వాటికి నిగనిగలాడేలా రంగులు అద్దుతున్నారు. అందుకు ఎక్కువగా మాలాకైట్ గ్రీన్ అనే కెమికల్ కలర్​ను కోటింగ్ కోసం వాడుతున్నారు. దాంతోపాటు పండ్లు, కూరగాయల మీద ఆక్సిటోసిన్, శాకరిన్, మైనం, క్యాల్షియం కార్బైడ్, కాపర్​ సల్ఫేట్​ వంటివి పూస్తున్నారు. మరి ఇన్ని కెమికల్స్‌ నింపుకున్న పండ్లు, కూరగాయలు తింటే హాస్పిటల్​కి వెళ్లక తప్పదు కదా. 

తియ్యటి విషం 

మనదేశంలో స్వీట్స్​కు ఉన్నంత క్రేజ్​ మిగతా ఏ దేశాల్లో ఉండదేమో! స్వీట్లు లేందే శుభకార్యం జరగదు. సిల్వర్ కోటింగ్ ఉన్న స్వీట్లు మంచివి అనుకుంటారు. కానీ... వెండి రేటు పెరిగింది అనుకోండి. అప్పుడు కూడా సిల్వర్​ కోటింగ్​ ఉన్న స్వీట్ల రేటు మారదు. అలాగెందుకని ఎప్పుడైనా ఆలోచించారా? అంత  రేటు పెట్టి తయారుచేసిన స్వీటు అంతకుముందున్న రేటుకే ఎందుకు ఇస్తున్నారని ఒక్క క్షణం ఆలోచిస్తే... దాని వెనక జరిగే కల్తీ అర్థమవుతుంది. అదెలాగంటే... వెండిలాగే  ఉండే అల్యూమినియాన్ని స్వీట్ల మీద పూతగా వాడతారు.
స్వీట్లతో పాటు తేనె కూడా ఎంత రేటు పెట్టి అయినా కొంటారు. కానీ, స్వచ్ఛమైన తేనె దొరకడం అంత ఈజీ కాదు.

మార్కెట్​లో స్వచ్ఛమైన తేనె అని దొరుకుతున్న వాటిలో స్వచ్ఛత అనేది అందని ద్రాక్ష. ఎందుకంటే కొంచెం తేనె తీసుకుని అందులో మొలాసిస్ చక్కెర కలిపి బాటిల్ నింపుతారు. ఇంకొన్ని తేనె బ్రాండ్లలో అయితే చాలావరకు యాంటీ బయాటిక్స్ వాడుతున్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్​మెంట్ చేసిన స్టడీలో వెల్లడైంది. ఇలా తయారైనవి ఎక్కువ కాలం వాడటం వల్ల రక్త సంబంధిత డిజార్డర్స్, లివర్ దెబ్బతినడం వంటివి జరిగే ప్రమాదం ఉంది. 

ఐస్​క్రీమ్‌​ సీక్రెట్

వేసవిలోనే కాకుండా ఏ సీజన్​లో అయినా ఐస్​క్రీమ్​ తినడాన్ని ఇష్టపడతారు చాలామంది. అందుకే ఐస్​క్రీమ్‌ బిజినెస్ ఏడాది పొడవునా జోరుగా సాగుతుంది. ఐస్​క్రీమ్స్​లో తొంభై శాతం కెమికల్స్​ వాడతారని తెలుసా!  ఐస్​క్రీమ్‌ తయారీలో ఇథైల్ ఎసిటేట్, బ్యూట్రాల్డిహైడ్, ఎమిల్ ఎసిటేట్, నైట్రేట్, వాషింగ్ పౌడర్ వంటివి విపరీతంగా వాడుతున్నారు. ఇథైల్ ఎసిటేట్ వల్ల లంగ్స్, కిడ్నీలు, హార్ట్​కు సంబంధించిన వ్యాధులొస్తాయి. ఐస్​క్రీమ్ టెక్స్చర్, టేస్ట్ పోకుండా ఉండడం కోసం అందులో ఒక రకమైన గమ్​ కలుపుతారు. ఆ గమ్​ను జంతువుల తోక, ముక్కు వంటి భాగాలు ఉడికించి తీస్తారు. ఆ గమ్ ఉంటేనే నెమ్మదిగా కరుగుతుంది.  

కంది పప్పు, కారం, ఉప్పు...

దక్షిణాది ఫుడ్ అనగానే అన్నం, పప్పు గుర్తొస్తుంది ఎవరికైనా. ఏ కూర చేసినా చేయకపోయినా రోజూ పప్పో, పప్పుచారో ఉండాల్సిందే. అలాంటి కందిపప్పు పసుపు పచ్చగా కనిపించేందుకు మెటానిల్ ఎల్లో అనే కెమికల్‌ కలుపుతున్నారు. ఆ పప్పు తినడం వల్ల కొంతకాలానికి న్యూరోటాక్సీసిటీ అనే నరాల వ్యాధి వస్తుంది. 
అసలు కారం, ఉప్పు లేనిది వంట పూర్తి కాదు. కానీ...  కారానికి బదులు ఇటుక పొడి, సాల్ట్​లో టాల్క​మ్​ పౌడర్ తయారీలో మిగిలిపోయే వేస్ట్​ను కలుపుతున్నారు. ఇవేకాకుండా.. మిరియాల్లో బొప్పాయి విత్తనాలు, బ్లాక్ బెర్రీలు కలుపుతున్నారు.

ప్రపంచంలోనే ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. ఇందులో మొక్కజొన్న కంకుల సన్నని దారపు పోగుల్ని కలుపుతున్నారు. రంగు కోసం సూడాన్ రెడ్ జి వంటి ఆర్టిఫిషియల్ కలర్​ వాడుతున్నారు. నిజానికి సూడాన్ రెడ్ జి అనేది బట్టలు, చెప్పులు, షూ వంటి వాటికి వాడే రంగు. ఆ రంగుని ఫుడ్​లో వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్యాన్​ చేశారు. అయినా వాడుతున్నారు. ఇదొక్కటే కాదు బటర్, క్రీమ్స్​ తయారీలో నాసిరకం నూనెలు, పామాయిల్, సన్​ఫ్లవర్, సోయాబీన్ నూనెలు కలుపుతున్నారు. ఇలా ఏది చూసినా.. కల్తీనే.

అసలు కల్తీ అనేది ముడి సరుకు నుంచే మొదలవుతుంది. అదెలాగంటే... నాటే విత్తనం దగ్గర్నించి పురుగు చావడానికి, మొక్క బాగా పెరగడానికి... అంటూ అడ్వర్టైజ్​మెంట్లలో చూపించే హానికర కెమికల్​ ఫెర్టిలైజర్స్​ వాడుతున్నారు. అవి వాడటం వల్ల ఆ పంట మొత్తం కెమికల్స్​తో నిండిపోతోంది. ఇవే కాదు.. ఎంతో ఇష్టంగా తినే మాంసంలో కూడా కల్తీ కలవరపెడుతోంది. 

ప్యాకేజ్డ్ మాంసంతో జాగ్రత్త

ఇప్పుడు ప్యాకేజ్డ్ మాంసం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతోంది. కానీ, ఇలా ప్యాక్ చేసిన మాంసం తినడం వల్ల కూడా అనారోగ్యం బారినపడే ప్రమాదముంది. ఎందుకంటే ఆన్​లైన్​లో ఆర్డర్ చేసిన పది నుంచి ఇరవై నిమిషాల్లోనే మాంసం ఇంటికి వస్తోంది. అలా రావాలంటే ఆ మాంసాన్ని ముందుగానే ప్యాక్ చేసి ఉండాలి. అలాంటి మాంసం పాడయ్యే ఛాన్స్​ ఎక్కువ. దాన్ని తింటే రోగాలు రాయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్​.

ఫ్యాక్టరీల్లో ఏం జరుగుతోంది?

ఫ్యాక్టరీకి ముడి సరుకు వచ్చాక, వాటి క్వాలిటీని చెక్​ చేయాలి. ఆ తర్వాత వాటిని వాడొచ్చో లేదో డిసైడ్ చేస్తారు. దాంతోపాటు వాటిలో ఇంకా ఏమేం పదార్థాలు కలపొచ్చో.. లేదో చూస్తారు. వచ్చిన సరుకులో కెమికల్స్‌ శాతం ఎక్కువగా ఉంటే వాటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఇవన్నీ చేశాకే ప్రొడక్ట్ తయారుచేయడం మొదలుపెట్టాలి.  ఈ పనులన్నీ సరైన పద్ధతిలో జరిగితేనే అవి తినడానికి పనికొస్తాయి. అలాకాకుండా వాటిని నామమాత్రంగా శుభ్రం చేసి, వాటితో తినుబండారాలను తయారుచేయడం వల్ల జరగబోయే నష్టం గురించి ఎవరూ ఆలోచించట్లేదు.  

విదేశీ కల్తీ ఇలా...

విదేశీ ప్రొడక్ట్స్ అంటే మనవాళ్లకు మక్కువ ఎక్కువ. ఎందుకంటే ‘‘విదేశీయులు ప్రొడక్ట్స్​ని దాదాపు మెషిన్లతోనే తయారుచేస్తారు. ప్రాసెస్​ నీట్​గా ఉంటుంది. చక్కగా ప్యాకింగ్ చేస్తారు. కాబట్టి, అవి తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు” అనుకుంటారు. ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. ఒక ప్రొడక్ట్ వేరే దేశం నుంచి మన దగ్గరకు రావాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఆ వచ్చిన సరుకుసేల్​ అయ్యేందుకు మరికొంత టైం పడుతుంది.

అప్పటి వరకు అవి రుచి, వాసన పోకుండా, తాజాగా ఉండాలి. పైగా వాతావరణం కూడా మారుతుంది. కాబట్టి ఆ మార్పుల్ని కూడా తట్టుకోవాలి. అందుకని పదార్థం పాడుకాకుండా ఉండేందుకు వాటిలో పలురకాల కెమికల్స్‌‌‌‌ కలుపుతారు. దాంతో అవి రుచి, వాసన కోల్పోవు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటాయి. అలా ప్రొడక్ట్ మొత్తం కెమికల్స్‌‌తో నిండిపోతుంది. మరి అన్ని కెమికల్స్‌‌ నింపుకున్న తిండి తింటే ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుందా? ఆ ఎఫెక్ట్​ వెంటనే కనిపించకపోయినా, ఫ్యూచర్​లో కనిపిస్తుంది.
ఇలా ఏది తినాలన్నా ‘ఇది కల్తీదేమో...!’ అనే అనుమానం, భయాలతో బతుకుతున్నాం. మనసులో అన్ని భయాలున్నా తినక తప్పదు. అందుకని ఏదో ఒకటి తింటూ కాలం గడిపేస్తున్నాం. ఇన్ని భయాలతో బతకడం ఎందుకని కొందరు మార్కెట్​లో దొరికే ‘ఆర్గానిక్’ ప్రొడక్ట్స్​ మీద ఆధారపడుతున్నారు. మరి.... ఆర్గానిక్​ అని చెప్తున్నవన్నీ ఆర్గానికేనా?

ఆర్గానికేనా!

ఆర్గానిక్​ అనేవన్నీ ఆర్గానిక్​ వేనా అనే అనుమానం వచ్చినా.. వాటి రంగు, రుచి చూసి నమ్మేస్తుండొచ్చు. ఎందుకంటే వాటి గురించి ప్రమోషన్ ఓ రేంజ్​లో​ ఉంటుంది. పైగా వాటిని చూస్తే కెమికల్స్‌ వాడనివే అనిపిస్తుంది. నిజానికి ఆర్గానిక్​ అని చెప్పేవాటిలో కూడా కల్తీ ఉంటుంది. ఆ విషయంలోకి వెళ్లేముందు... ఆర్గానిక్ పేరుతో అమ్మేవి ఎలా తయారవుతున్నాయో తెలుసుకోవాలి. ఆర్గానిక్​ అంటే.. పొలంలో ఏ రసాయనాలూ వాడకుండా దాదాపు మూడేండ్లు ఖాళీగా ఉంచాలి. మట్టిలో కెమికల్స్‌ ప్రభావం పూర్తిగా పోయి, సారవంతమవ్వాలి. ఆ తర్వాతే విత్తనాలు నాటాలి. మొక్క పెరగడానికి, పురుగు పట్టకుండా ఉండటానికి కంపోస్ట్‌ ఎరువులనే వాడాలి. ప్రభుత్వం కొన్ని మందుల్ని సిఫార్సు చేస్తుంది. వాటివల్ల ఇబ్బంది ఉండదని పరీక్షించి, హామీ ఇస్తుంది. అలాంటి వాటిని కొంత వరకు వాడొచ్చు.

పంట చేతికొచ్చాక కూడా ఏ కెమికల్స్ వాడకూడదు. వాటితో ఏవైనా తినుబండారాలు తయారుచేసేటప్పుడు కూడా ఎడిటివ్స్ వాడకూడదు. అలాగే ప్రాసెస్ పూర్తయ్యాక క్వాలిటీ చెకింగ్ చేయాలి. అప్పుడే అవి తినడానికి పనికొస్తాయి. ఇదంతా జరగడానికి చాలా టైం పడుతుంది​. కానీ... ఇదే సరైన ప్రాసెస్. ఇలా పండించి, ప్రాసెస్ చేసినవే ఆర్గానిక్​ ప్రొడక్ట్స్. మార్కెట్​లో ఆర్గానిక్​ పేరుతో మనం కొంటున్న, తింటున్న వాటిలో కొన్ని మాత్రమే ఈ పద్ధతిలో తయారవుతున్నాయి. ఒకవైపు తినే ఫుడ్​లో కల్తీ జరుగుతుంటే, మరోవైపు నకిలీ దందాతో... గుర్తించలేనంతగా నకిలీ ప్రొడక్ట్స్​ మార్కెట్​లోకి వస్తున్నాయి. 

యాడ్స్‌, లేబుల్స్ క్రేజ్ చూసి..

‘ఆర్గానిక్​’ అని ఒక లేబుల్ అంటించినంత మాత్రాన అది ఆర్గానిక్ అయిపోదు. అందుకే ‘మెరిసేదంతా బంగారం కాదు. తినేదంతా ఆరోగ్యకరం కాదు’ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్​మెంట్​ చేసిన స్టడీలో వెల్లడైంది. కొందరు వ్యాపారులు వాళ్ల స్వార్థం కోసం ప్రాసెస్ చేసేటప్పుడు కెమికల్స్ వాడి, ప్యాక్​ మీద ఆర్గానిక్ లేబుల్ అంటిస్తున్నారు. ఈ అంశాల మీద ఎవరైనా నోరెత్తినా, కేసులు పెట్టినా తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటున్నారు. అందుకే లేబుల్స్ చూసి, యాడ్స్‌ నమ్మి మోసపోవద్దు. అసలు, నకిలీ మధ్య తేడా కనిపెట్టడానికి కొన్ని దారులున్నాయి. 

సర్టిఫికెట్​ తప్పనిసరి

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్​ –2006 ప్రకారం, ఇండియాలో తయారయ్యే ప్రతి ఫుడ్ ప్రొడక్ట్​కి ఫుడ్​ సేఫ్టీ సర్టిఫికెట్​ ఉండాలి. దాన్నే ఎఫ్.​ఎస్.​ఎస్.​ఎ.ఐ. రిజిస్ట్రేషన్ అంటారు. మనదేశంలో వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్స్​ నడిపేవాళ్లు.. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్లంతా ఈ లైసెన్స్​ తీసుకోవాల్సిందే. వాళ్ల ఫుడ్ ప్రొడక్ట్​ పైన14 అంకెల లైసెన్స్​ నెంబర్ ప్రింట్ ఉండాలి. అప్పుడే వాళ్లకు బిజినెస్ చేసుకునేందుకు అర్హత ఉన్నట్టు. చేసే బిజినెస్​ని బట్టి లైసెన్స్ ఇస్తారు.  

కల్తీలో రకాలున్నాయి..

కల్తీలో రకాలున్నాయి. వాటిలో మొదటిది ప్రొడక్షన్​లో సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల లేదా పండించే భూమి, వాడే నీళ్లు, చల్లే పురుగుల మందుల వల్ల ఫుడ్ కలుషితం అవ్వొచ్చు. రెండోది, ప్రాసెసింగ్​లో అవుతుంది. అదెలాగంటే, రంగు, రుచి, నిల్వ చేయడం కోసం రసాయనాలు కలపడం. ​మూడోది కావాలని చేసే కల్తీ. ఉదాహరణకు చూస్తే... టీ పొడిలో రంపం పొట్టు కలపడం వంటివి. ఇలా మూడు రకాల కల్తీ ఉంటుంది. 

ఆర్గానిక్ విషయానికొస్తే.. ఆర్గానిక్ ప్రొడక్ట్స్​లో సింథటిక్ కెమికల్స్ వాడకూడదు. జన్యు మార్పిడి పంటలు వాడకూడదు. ఇండస్ట్రియల్ లేదా మెటల్ వేస్ట్ కలిసిన కలుషితమైన నీళ్లు వాడకూడదు. అంతకంటే ముందు, పండించే నేలకి ప్రియారిటీ ఇవ్వాలి. పైన చెప్పిన కలుషితాలన్నీ నేలలోకే వెళ్తాయి. కాబట్టి నేలలో కెమికల్స్ ఉండకూడదు. అందుకోసం మూడేండ్ల ముందు ఏమేం పంటలు వేశారు. ఏ కెమికల్స్ వాడారు? అనేది పరిశీలిస్తారు. ఆ తర్వాత మరో మూడేండ్లు ఆర్గానిక్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్​ ఫాలో అయినవాళ్లకు మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఐదారేండ్లుగా కెమికల్స్ వాడకుండా, నేలను సురక్షితంగా, సారవంతంగా ఉంచితేనే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్​కు అనుమతిస్తారు.

మనదేశంలో ఆర్గానిక్ ప్రొడక్షన్​ చేయాలనుకుంటే కచ్చితంగా సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్స్​ని ఆర్గానిక్ ఏజెన్సీలు ఇస్తాయి. రైతులు నేరుగా అమ్ముకుంటే సర్టిఫికెట్ అవసరం లేదు. అది కూడా సంవత్సరానికి వాళ్ల ఆదాయం 12లక్షలలోపు ఉంటేనే ఈ రూల్ వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువైతే మాత్రం రైతులు కూడా సర్టిఫికెట్ తీసుకోవాలి. కొనేవాళ్లు చూడాల్సింది ఆర్గానిక్​ సర్టిఫైడా? కాదా? అని.
అలాగే బియ్యం, పప్పులు వంటి సింగిల్ ఇంగ్రెడియెంట్స్​ మాత్రమే వందశాతం ఆర్గానిక్​ నుంచి వస్తాయి. వాటి ప్యాక్ మీద అది రాసి ఉంటుంది. అలా రాకపోతే, రాయడానికి వీల్లేదు. వడ్లను ఆర్గానిక్ మిల్లులో పట్టించాలి. వేరే ధాన్యం ఆడించే మిల్లులో పట్టకూడదు. ప్రాసెసింగ్ యూనిట్​ని కూడా చెక్ చేస్తారు. ఎక్కడి నుంచి కొంటున్నారు? ఎలా స్టోర్​​ చేస్తున్నారు? ఏం వాడుతున్నారు? వంటివి చూస్తారు. ఎందుకంటే స్టోరేజ్​లో కూడా కెమికల్స్ వాడకూడదు.

బిస్కెట్, లడ్డు వంటి తినుబండారాల్లో రకరకాల పదార్థాలు కలుపుతారు. అందుకని వాటిని మల్టీ ఇంగ్రెడియెంట్స్ అంటారు. 95శాతం ఆర్గానిక్ సోర్స్ నుంచి వచ్చినవైతేనే ఆర్గానిక్ అని లేబుల్ వేస్తారు. అంతకంటే తక్కువ ఉంటే లేబుల్ వెయ్యరు.
వీటిని వెరిఫై చేసి, సర్టిఫై చేసేందుకు మనదేశంలో రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్. దీన్ని ఇండియా ఆర్గానిక్ స్టాండర్డ్స్ అంటారు. దీన్ని అగ్రి ప్రొడక్ట్ ఫుడ్ డెవలప్​మెంట్ అథారిటీ (ఎపిడా) ఇస్తుంది. ఈ అథారిటీ అప్రూవ్ చేసిన ఏజెన్సీలు కొన్ని ఉంటాయి. వాళ్లు వెరిఫై చేసి సర్టిఫికెట్ ఇస్తారు.

రెండోది పీజీఏ (పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్) ఇది నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ ఇస్తుంది. ఇది గ్రూప్ సర్టిఫికేషన్. అంటే.. కొందరు రైతులు కలిసి ఆర్గానిక్ ఫామింగ్ చేస్తామని గ్రూప్​ కడతారు. ఆ గ్రూప్​లో ఒక్కరు ఫెయిల్ అయినా, గ్రూప్​ మొత్తం ఫెయిల్ అయినట్టే. సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్లు ఏడాదికొకసారే వచ్చి పరిశీలిస్తారు. మిగతా టైం అంతా ఆ గ్రూప్​దే బాధ్యత. 
ఆర్గానిక్ అయినా కాకపోయినా ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. ప్యాక్ మీద ఇంగ్రెడియెంట్ లిస్ట్, ప్రొసీజర్, లేబుల్, నెంబర్ ఉంటాయి. నెంబర్ ఆధారంగా ప్రొడక్ట్ డిటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేబుల్​లో కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్​గా ఎఫ్​.ఎస్​.ఎస్.ఎ.ఐ. వెరిఫై చేస్తుంది. రెస్టారెంట్స్, హోటల్స్, రిటెయిల్ షాప్స్.. ఏవైనా సరే వెరిఫై చేస్తారు. లైసెన్స్​ కోసం అప్లై చేసినప్పుడు శాంపిల్స్ తీసుకుని చెక్ చేస్తారు.

ఆర్గానిక్ పంట అయితే ప్రతి ఏడాది చెక్ చేస్తారు. ఏడాది చివర్లలో శాంపిల్స్ తీసి టెస్ట్ చేస్తారు. మూడేండ్ల కిందటి కెమికల్స్‌ ఉన్నా ఆ టెస్ట్​లో బయటపడతాయి. ఆ తర్వాత ఇతర ప్రదేశాలకు పంపాలన్నప్పుడు స్టోర్ చేయాల్సివస్తే ధాన్యాలను కోల్డ్ స్టోరేజ్​లో పెడతారు. దానివల్ల పురుగుపట్టదు, ప్రొడక్ట్ పాడవదు. గాలి ఆడకుండా ప్యాక్ చేస్తే పాడవకుండా ఉంటాయి. వెజిటబుల్స్ అయితే మూడు రోజులకంటే ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. ఇంట్లో పెంచుకునేవాళ్లు రసాయనాలను బయటినుంచి కొనకుండా ఇంట్లోని కిచెన్ వేస్ట్​ని ఎరువులా వాడొచ్చు.  – డా. జీవీ రామాంజనేయులు, ‘సహజ ఆహారం’ డైరెక్టర్
 
ఇంట్లో చెక్ చేయొచ్చు

  • కాఫీ లేదా టీ పొడిని తెల్ల కాగితం మీద రుద్దితే రంగు కలిపారో లేదో తెలుస్తుంది. ఇనుప పొడి కలిపింది, లేనిది తెలియాలంటే అయస్కాంతం పెట్టాలి. 
  • తేనెలో దూది ముంచి నిప్పు అంటించాలి. అది కాలిపోతే స్వచ్ఛమైంది. నీళ్లలో ఒక స్పూన్ తేనె వేసి, కలిపినా కూడా కల్తీ అయిందో, లేదో తెలుసుకోవచ్చు.  
  • గ్లాసు గోరువెచ్చని నీళ్లలో టీస్పూన్ పసుపు వేయాలి. అది కిందకి చేరితే ఒరిజినల్. నీళ్లలో కలిసిపోతే ఫేక్. 
  • వెన్న కరిగించి, బాటిల్​లో పోసి ఫ్రిజ్​లో పెట్టాలి. కాసేపటికి లేయర్స్​లా కనిపిస్తే అది ఫేక్. అలాగే... కరిగించిన వెన్నని బాటిల్​లో పోసి, చిటికెడు చక్కెర వేసి గిలక్కొట్టాలి. ఐదు నిమిషాల తర్వాత ఎరుపు రంగులోకి మారితే అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్టు. 
  • సాల్ట్‌‌‌‌ని నీళ్లలో వేస్తే తెల్లగా అయిందా?అయితే టాల్కమ్​ పౌడర్ తయారీలో వచ్చే వేస్ట్​ అందులో కలిసినట్టే.
  • ఐస్​ క్రీమ్​లో నిమ్మరసం కలిపి చూడండి. బుడగలు వస్తే వాషింగ్ పౌడర్ కలిపారని అర్థం. ఇలా కొన్ని ట్రిక్స్ వాడి ఏది అసలో, ఏది కల్తీనో తెలుసుకోవచ్చు.

ఏం తినాలన్నా అనుమానం

పూర్వంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు కల్తీ తిండే తింటున్నాం. ఇంట్లో వంటకు వాడే నూనె, టీ పొడి, మసాలా, చివరకు బియ్యం కూడా కల్తీ అంటే నమ్మలేకపోతున్నాం. కల్తీలకు పాల్పడే వారిపై సీరియస్​ యాక్షన్​ తీసుకోవాలి. కస్టమర్స్​కు అనుమానం వస్తే వెంటనే టెస్టింగ్​ చేసేలా మొబైల్​ ల్యాబ్​ సదుపాయం తీసుకొస్తే బాగుంటుంది. - దాసరి సురేశ్​, హనుమకొండ

జబ్బులొస్తున్నయ్​..
ప్రభుత్వం సిబ్బందిని పెంచి, తినుబండారాలు, నిత్యావసరాలను తరచూ చెక్ చేయాలి. ఆహార పదార్థాల కల్తీ కారణంగా చిన్న వయసులోనే క్యాన్సర్​, గుండె జబ్బు వంటి వ్యాధులు వస్తున్నాయి. తాజాగా తీసుకోవాల్సిన మాంసం కూడా నిల్వ రసాయనాలతో అమ్మడం భయం కలిగిస్తోంది. - డాక్టర్ చలసాని హరిక్రిష్ణ, ప్రిన్సిపల్, మదర్ థెరిసా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సత్తుపల్లి 

నిజం తెలిసినా తప్పట్లే

మార్కెట్లో దొరికే పదార్థాలు అసలువా? కల్తీవా? అన్న విషయాన్ని గుర్తుపట్టే పరిస్థితి లేదు. కల్తీ వస్తువుల తయారీ, కెమికల్స్ వాడకం ఈ మధ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద షాపులన్న తేడా లేకుండా పదిహేనురోజులకు ఒకసారి తనిఖీ చేయాలి. బయట జరిగే కల్తీ చూసి... ఆర్గానిక్ పదార్థాలని అనగానే అవి నమ్మి కొంటున్నాం. అవెంతవరకు ఒరిజినలో తెలియట్లే.  -  కె.రాజు, సిద్దిపేట


కల్తీవి గుర్తు పట్టుడు కష్టం 

మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాటిని నమ్మడంలేదు. కల్తీ వస్తువులు అమ్మకాలు జరిపే చోట తనిఖీలు చేయాలి. ఆర్గానిక్​ పండ్లు, కూరగాయల్ని కూడా కల్తీ చేస్తున్నారు. పండ్లు, కూరగాయల్ని కొనేటప్పుడు తాజావా లేక రంగులు వేసి అమ్ముతున్నారా? అనేది గుర్తుపట్టుడు కష్టం.   – మరిమడ్ల లత, చొప్పదండి,  కరీంనగర్ జిల్లా

ప్రజలను భ్రమలో పడేశారు

ఇప్పుడంతా అడ్వర్టైజ్​మెంట్లమయం. ప్రజలను భ్రమలో పడేశారు. వాటి ఆకర్షణలో పడి వస్తువు బాగున్నా.. లేకున్నా దాని మీద ఉన్న లేబుల్ చూసి కొనాల్సి వస్తోంది. ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పి కొన్ని కంపెనీలు మార్కెట్లోకి బెల్లం, ధాన్యాలను అమ్ముతున్నాయి. వాటిలో నాణ్యత ఉందా? లేదా? అవి నిజంగా ఆర్గానిక్ అని ఎవరు ప్రూవ్​ చేయాలి?ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు తనిఖీ చేయాలి.  - కిష్టయ్య, రిటైర్డ్​ టీచర్, పాలమూరు

ఆర్గానిక్‌లో నకిలీని ఇలా గుర్తించొచ్చు..
2018–19 మధ్యకాలంలో ఎఫ్​.ఎస్​.ఎస్.​ఎ.ఐ. (ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్​ ఇండియా)1,06,459 శాంపిల్స్ టెస్ట్ చేసింది. అందులో15.8 శాతం సబ్​ –స్టాండర్డ్, 3.7 శాతం అన్​సేఫ్​, 9 శాతం లేబులింగ్​ డిఫెక్ట్స్​ ఉన్నాయని గుర్తించింది. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీలను గుర్తించేందుకు ఈ కింది విషయాలు చెక్​ చేయాలని చెప్పింది ఎఫ్​.ఎస్​.ఎస్​.ఎ.ఐ. 
ప్యాకింగ్ చేసిన ఫుడ్ ఐటమ్స్​లో నకిలీని గుర్తించాలంటే న్యూట్రిషన్ లేబుల్ చూడాలి. దాని మీద ఆ ప్రొడక్ట్​లో వాడిన ఇంగ్రెడియెంట్స్ లిస్ట్ ఉంటుంది. అందులో ఏదైనా ఎక్కువ ఉన్నట్టు లేదా మిస్​ అయినట్టు ఉంటే అది నకిలీ. దాన్ని ‘స్మార్ట్ కన్జ్యూమర్ యాప్’ సాయంతో తెలుసుకోవచ్చు.

ఈ యాప్​ను కన్జ్యూమర్ మినిస్ట్రీ, ఎఫ్​.ఎస్.​ఎస్​.ఎ.​ఐ. కలిసి రూపొందించారు. లేబుల్ చూశాక, తయారీ, ఎక్స్​పైరీ డేట్స్​ ఉన్నాయో లేదో చూడాలి. ఆ డేట్స్ సరిగా కనిపించకపోయినా, ఆ ప్రొడక్ట్ డ్యామేజ్ అయినట్టు ఉన్నా అది రీసైకిల్ చేసిందని. వాటితోపాటు ప్రొడక్ట్ టెక్స్చర్, వాసన, రంగు కూడా గమనించాలి. అలాగే లోగో, సైజ్​, కలర్స్​ని బట్టి ప్రొడక్ట్ అసలో, నకిలీదో చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బ్రాండ్లు వాటి ప్యాకేజింగ్​లో సెక్యూరిటీ హోలోగ్రామ్స్, మెసేజ్​ వెరిఫికేషన్, క్యూఆర్ కోడ్ లేదా స్ర్కాచ్​ కోడ్ వేస్తాయి.

ఇవన్నీ ఆ ప్రొడక్ట్ క్వాలిటీ చెప్పే అంశాలు. వీటిని పక్కన పెడితే మొదటగా కనిపించే తప్పు ప్రొడక్ట్ లేదా కంపెనీ పేరులో స్పెల్లింగ్ తేడాలు. ముఖ్యంగా ఆన్​లైన్​ షాపింగ్ చేసేవాళ్లు ఈ విషయాలు జాగ్రత్తగా గమనించాలి. మనదేశంలో తయారైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్​​ అయితే... జీవిక్ భారత్ (హిందీ, ఇంగ్లీష్​), ఎఫ్​.​ఎస్​.ఎస్​.​ఎ.ఐ, పీజీఎస్ – ఇండియా గ్రీన్ (పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్) వంటి లోగోలు ఉంటాయి. 

సరిగా శుభ్రం చేయాలి

ఇప్పుడు మనం తినే వాటిల్లో చాలా వరకు కల్తీవే ఉంటున్నాయి. టీ పొడి, కారం, పాలు ఇలా రోజూ వాడే వాటిలో కల్తీ జరుగుతోంది. పండ్లు, కూరగాయలు తాజాగా కనిపించడానికి మైనపు పూత వేస్తున్నారు. అది చూసి ప్రజలు మోసపోతున్నారు. కానీ, అవే తినాల్సి వస్తుంది. కాబట్టి ఇంటికి తెచ్చాక, ఆ కోటింగ్ పూర్తిగా పోయేలా కడగాలి. సరిగా శుభ్రం చేయకుండా వండుకున్నా, తిన్నా ఆరోగ్యం పాడవుతుంది. అలాగే సరిగా ఉడకని పదార్థాలు,

సరైన పద్ధతిలో ఉడికించని ఫుడ్ ఐటమ్స్ కూడా కల్తీ కిందకే వస్తాయి. కాబట్టి తినేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ప్యాకింగ్ చేసి అమ్మే వాటిలో కూడా కల్తీ జరుగుతుంది. పండ్ల జ్యూస్​లు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారుచేస్తారు. కానీ, అవి నిజంగా పండ్లతో తయారైనవి కావు. వాసన, రుచి కోసం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు. అలాంటివి తాగకూడదు. చిన్న పిల్లలు తినే ఫుడ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చక్కెర, ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం వల్ల ఫ్యూచర్​లో ఎఫెక్ట్ చూపిస్తాయి.

ప్యాకేజ్డ్ ఫుడ్స్​లో ఇంగ్రెడియెంట్ లిస్ట్​ ఉంటుంది. అందులో నాలుగు లేదా ఐదు ఐటమ్స్, మూడు లైన్లు డిస్క్రిప్షన్ ఉంటే అది మంచి ప్రొడక్టే. అంతకంటే ఎక్కువ ఇంగ్రెడియెంట్స్, డిస్క్రిప్షన్ లైన్స్ ఉన్నాయంటే అది ఎక్కువసార్లు ప్రాసెస్ చేశారని అర్థం. ఐదు గ్రాముల కన్నా ఎక్కువ చక్కెర, మూడు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు ఉంటే అవి ఆరోగ్యానికి మంచివి కావు. అలాగే డైరెక్ట్​ ప్లాస్టిక్​తో కవర్ చేసినవి తినొద్దు. సీజనల్ ఫుడ్స్ తినాలి. ఇంట్లో, లోకల్ గార్డెన్స్​లో పెంచినవైతే బెటర్. – జి. సుష్మ, సీనియర్ కన్సల్టెంట్ డైటీషియన్,  కేర్ హాస్పిటల్స్,  హైదరాబాద్

చట్ట ప్రకారం చేస్తే కల్తీ జరగదు

బియ్యం, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాల్లో రాళ్లు, మట్టి, ఇసుక వంటివి కలుపుతారు. దానివల్ల వాటి క్వాంటిటీ పెరుగుతుంది. అలాగే లెడ్, మెర్క్యూరీ వంటివి కూడా ఫుడ్​లో వాడతారు. దానివల్ల పొత్తికడుపు, పేగు క్యాన్సర్లకు దారి తీస్తుంది. చట్ట ప్రకారం, క్వాలిటీ చెకింగ్ చేస్తారు. అందు​లో ఇవన్నీ తెలుస్తాయి. కానీ, కస్టమర్స్ కొనేటప్పుడు అలానే వచ్చేస్తున్నాయి. అంటే లోపం ఎక్కడుంది? చట్ట ప్రకారం జరుగుతున్నాయా? లేదా? అనేది ప్రశ్నార్థకం.

బెల్లంలో సుద్ద కలుపుతారు. అది తెలియాలంటే బెల్లాన్ని నీళ్లలో కలిపితే, సుద్ద కిందకి వెళ్లిపోతుంది. దాన్ని బట్టి కల్తీ అయిందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే పాల విషయానికి వస్తే వాటిలో ప్రొటీన్లు ఉంటాయి. కానీ, నీళ్లు కలిపిన పాలు తాగడం వల్ల ఎలాంటి న్యూట్రిషన్స్ అందవు. పాలు మరగబెట్టినప్పుడు లేయర్ ఏర్పడినా, ఒక చుక్క పాలు నేల మీద వేస్తే అది కదలకుండా ఉన్నా అవి స్వచ్ఛమైనవి. 

ప్యాకెట్స్​లో కాకుండా విడిగా దొరికే నూనెల్లో దాదాపు కల్తీ ఉంటుంది. యాడ్స్‌  చూసి మోసపోవద్దు. కొన్ని బ్రాండెడ్ కంపెనీలు వాళ్ల బ్రాండ్ పేరు కాపాడుకోవడం కోసం బాగానే తయారుచేస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. 

అలాగే ఈరోజు వండింది రేపు తినడం కూడా ముప్పే. రోజులు గడిచేకొద్దీ అందులో ఫంగస్ ఏర్పడుతుంది. అలాంటివి తింటే రోగాలు వస్తాయి. ముఖ్యంగా నాన్​వెజ్​ రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉన్నా, వేడి చేసుకుని తింటుంటారు కొందరు. దానివల్ల గ్యాస్ట్రో ఇంటస్టైనల్ వ్యాధులు, డయేరియా వంటివి వస్తాయి. వేడి చేయడం వల్ల కెమికల్స్ పోవు. ఎంతో ఎక్కువ వేడి చేస్తే తప్ప కెమికల్స్​ పోవు. 

ఈమధ్య పొత్తికడుపు క్యాన్సర్లే ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే అజినొమోటోని వెస్ట్రన్ ఫుడ్స్​లో, నూడిల్స్​లో ఎక్కువగా వాడతారు. దానివల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. ఆ నూడిల్స్ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఇంట్లో నిల్వ పచ్చళ్లు పెట్టుకుంటే నిల్వ ఉండడానికి ఉప్పు వాడతాం. కానీ, బయట దొరికే పచ్చళ్లలో ఉప్పుతో పాటు వెనిగర్ కూడా కలుపుతారు.  – డా. జహీరున్నీషా, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, రెనోవా హాస్పిటల్, హైదరాబాద్. 
 
::: మనీష పరిమి 
::: వెలుగు నెట్​వర్క్​