బోడ కాకరకాయ తినడం వల్ల ప్రయోజనాలు తెలుసా?

బోడ కాకరకాయ తినడం వల్ల ప్రయోజనాలు తెలుసా?

ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాల్లో.. సీజనల్ గా దొరికే కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి. కేవలం ఆషాడం, శ్రావణ మాసాల్లోనే దొరికే వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వానాకాలంలో బోడ కాకరకాయలు తింటే, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెబ్తున్నారు. ఇందులో బి1 ,బి2 , బీ3 లాంటి విటమిన్లు అధికంగా ఉంటాయని బోడ కాకరకాయ తింటే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా.. అదుపులో ఉంటాయని చెబుతున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంతో పాటు మిగతా అటవీ ప్రాంతాల్లో బోడ కాకర కాయలు ఎక్కువగా దొరుకుతాయి. చాలామంది శ్రావణమాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు. అందుకే ఇంటికి ఏ చుట్టం వచ్చినా.. ఈ బోడ కాకరకాయతో వంటలు చేసి పెడతారు. కేవలం అటవీ ప్రాంతంలోనే కాదు దట్టమైన పొదల్లో, చెట్లకు అల్లుకొని ఉన్న తీగల్లో ఈ బోడ కాకరకాయ పెరుగుతుంది. జూలై నుండి ఆగస్టు నెల వరకు మాత్రమే ఇవి కాస్తాయి. బోడ కాకర కాయలు సహజంగా లభిస్తాయంటున్నారు రైతులు.

ఇటీవల కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో బోడ కాకరలు ఎక్కువగా దొరుకుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, చిన్నారులు, పశువుల కాపరులు అడవుల్లో సేకరించి, స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నారు. పావు కిలో 40 రూపాయల నుంచి నుంచి 50 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఒక్కోసారి కిలో 300 రూపాయలు పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కిలో 150 రూపాయల వరకు ఉండేదని, కరోనాతో ఇప్పుడు 200 నుంచి 300 రూపాయల వరకు పలుకుతోదంటున్నారు వ్యాపారులు. కేవలం 2 నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఉండడంతో రేటు ఎక్కువైనా బోడ కాకరకాయలను కొంటున్నారు జనం.