రైతు 31 పైసల బకాయి చెల్లించలేకపోతే ఏం జరిగిందో తెలుసా.?

రైతు 31 పైసల బకాయి చెల్లించలేకపోతే ఏం జరిగిందో తెలుసా.?
  • 31 పైసలు బాకీ.. ఎన్వోసీ ఇవ్వని బ్యాంక్‌ 
  • రెండేండ్లుగా రైతుకు అధికారుల వేధింపులు
  • బ్యాంకుపై గుజరాత్‌ హైకోర్టు ఆగ్రహం

గుజరాత్ : వందలు, వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోతున్న బడా బాబులను, పారిశ్రామికవేత్తలను ఏమీ చేయలేని కొన్ని బ్యాంకులు.. సామాన్యులు రూపాయి బకాయి ఉన్నా వేధింపులకు గురి చేస్తాయి. ఇలాంటి తరహా సంఘటనలను మనం ఇప్పటికే చాలా చోట్ల విన్నాం, చూశాం, చూస్తున్నాం కూడా. అలాంటి సంఘటనే ఒకటి గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. 

అహ్మదాబాద్ టౌన్ కు సమీపంలోని ఖోర్జా గ్రామానికి చెందిన శ్యామ్ జీ భాయ్ అనే రైతు.. 2020లో తన పేరు మీద ఉన్న కొంత భూమిని రాకేశ్ వర్మ, మనోజ్ వర్మ అనే ఇద్దరు వ్యక్తులకు అమ్మాడు. అయితే.. అంతకంటే ముందే ఈ భూమిపై శ్యామ్ జీ భాయ్ రూ.3 లక్షల పంట రుణం ఎస్ బీఐ బ్యాంకులో తీసుకున్నాడు. భూమిని అమ్మిన కొద్ది రోజుల తర్వాత తాను బ్యాంకు నుంచి తీసుకున్న రుణం మొత్తాన్ని శ్యామ్ జీ చెల్లించాడు. 

ఇదంతా బాగానే ఉన్నా..  తర్వాత శ్యామ్ జీ నుంచి కొనుగోలు చేసిన భూమిని రెవెన్యూ రికార్డుల్లోకి తమ పేర్లను నమోదు చేసుకునేందుకు రాకేశ్ వర్మ, మనోజ్ వర్మ ప్రయత్నించారు. అయితే.. రుణానికి సంబంధించి బ్యాంకు నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో అధి సాధ్యపడలేదు. బ్యాంకు వద్దకు వెళ్తే సమస్య పరిష్కారం కాకపోవడంతో చేసేదేమీ లేక రాకేశ్ వర్మ, మనోజ్ వర్మ రెండేళ్ల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. బ్యాంకు నో డ్యూ సర్టిఫికేట్ ను ఎందుకు ఇవ్వలేదని అడిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) తరపు న్యాయవాది చెప్పిన సమాధానం విని న్యాయమూర్తి అవాక్కయ్యారు. ‘ రైతు శ్యామ్ జీ తీసుకున్న రుణంలో ఇంకా 31 పైసల బకాయి ఉంది. అందుకే నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడం సాధ్యం కాలేదు’ అని ఎస్ బీఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సమాధానంతో గుజరాత్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం..50 పైసల కంటే తక్కువ అప్పు ఉంటే లెక్కలోకి తీసుకోరు. శ్యామ్ జీ అనే రైతు పంట రుణం మొత్తం తిరిగి చెల్లించాడు. అయినా, మీరు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇది ప్రజలను వేధించడం కాక మరేంటి..? అని కోర్టు ప్రశ్నించింది. బ్యాంకు మేనేజర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను మే2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు తెలిపింది. 
మరిన్ని వార్తల కోసం..

తొందరపడి సిజేరీయన్ లను ప్రోత్సహించొద్దు

బీజేపీని ఎదుర్కోవాలంటే 50 ఏళ్లు తపస్సు చేయాలి