అసలు సీరియల్స్ ఎందుకు చూస్తారో తెలుసా?

అసలు సీరియల్స్ ఎందుకు చూస్తారో తెలుసా?

అదంతా డ్రామా అని తెలుసు... అయినా సరే ప్రేమించుకుంటే మురిసిపోతారు. కష్టమొస్తే కన్నీళ్లు పెడతారు. ఆ కష్టాలకి  కారణమైన వాళ్లని తిట్టిపోస్తారు. వాటన్నింటినీ దాటొచ్చిన హీరోయిన్​ని చూసి ఇన్​స్పైర్​ అవుతారు. అన్నింటికన్నా ముఖ్యంగా రేపు ఏం జరుగుతుందోనని ప్రతి క్షణం ఎదురుచూస్తుంటారు. ఇది తెలుగు సీరియల్​ ఎఫెక్ట్.. కాదు కాదు ఓవరాల్ ఇండియన్​ డ్రామా సిరీస్​ల ఎఫెక్ట్​. అసలు గంటలు గంటలు టీవీకి అతుక్కుపోయి సీరియల్స్ ఎందుకు​ చూస్తున్నారు ? ఏముందని ఆ సీరియల్స్​లో! 

సీరియల్స్​ మీద  జోకులు వేసేవాళ్లు కొందరైతే.. సీరియల్సే లోకంగా బతికేవాళ్లు ఇంకొందరు. సీరియల్సే కాలక్షేపం అనేవాళ్లు కొందరైతే  .. కుటుంబ చిక్కులకి కారణం కూడా సీరియల్సే అంటారు మరికొందరు. సీరియల్స్​ పాడుచేస్తున్నాయి అంటే... బాగుచేసేవి కూడా అవేగా! అనేది ఇంకొందరి వాదన. నాణానికి రెండు వైపులు ఉన్నట్టే... సీరియల్స్​కి మంచి చెడూ రెండూ ఉన్నాయి. 

శాటిలైట్ ఛానెల్స్​ ఎఫెక్ట్

ఒకప్పుడు సీరియల్స్​ అంటే  దూరదర్శన్​ వైపే చూసేవాళ్లు అంతా. కానీ, 1995 నుంచి పరిస్థితి మారింది. ఆ సంవత్సరమే మొదటి ఇరవై నాలుగ్గంటల శాటిలైట్​ ఛానెల్​ జెమిని వచ్చింది.  ఆ తర్వాతి నాలుగైదు నెలల్లోనే ఈటీవీ కూడా వచ్చింది. ఈ రెండు ఛానెల్స్​ తెలుగు బుల్లితెరకి కొత్త హంగులు అద్దాయి. ఫ్యామిలీ డ్రామాల్లో కాస్త విలనిజాన్ని చూపించాయి​. డివోషనల్​,  తాంత్రిక శక్తులు, కామెడీ, లవ్​  కాన్సెప్ట్​లతో ఆడియెన్స్​ని టీవీకి అతుక్కుపోయేలా చేశాయి. ఆ తర్వాత వచ్చిన ఎంటర్​టైన్​మెంట్ ఛానెల్స్​ కూడా ఈ దార్లోనే నడిచాయి. అయితే, 2008 నుంచి సీరియల్​ కథలు పూర్తిగా టర్న్​ తీసుకున్నాయి. చైల్డ్​ మ్యారేజ్​, చైల్డ్​ లేబర్, ఆడపిల్లలపై ఉండే వివక్షని కళ్లకు కట్టినట్టు చూపించాయి. కానీ, 2014 నుంచి తెలుగు సీరియల్​​ ఫార్మాట్​లో బాగా మార్పులొచ్చాయి. దానికి కారణం డబ్బింగ్​ సీరియల్సే అనొచ్చు. ఇప్పుడు సీరియల్స్‌‌ కథలను టీఆర్‌‌పి రేటింగ్స్​  నిర్ణయిస్తున్నాయి. అందుకే వీలైనన్ని ఎక్కువ ట్విస్టులు, హంగులతో సీరియల్స్ తీస్తున్నారు. అన్ని ఫ్యాక్టర్స్​ ఉండటం వల్లే ఒక్క రోజు సీరియల్ మిస్​ అయినా  కొన్ని వందల కిలోమీటర్లకి  ఫోన్​ చేసి మరీ కథ తెలుసుకుంటున్నారు చాలామంది.  కానీ, ఇక్కడ అర్థంకాని విషయం ఏంటంటే... ఏండ్ల తరబడి సీరియల్స్​ సాగదీస్తున్నా ఆడియెన్స్​లో ఏమాత్రం విసుగు కనిపించట్లేదు. ఏజ్​తో సంబంధం లేకుండా అందరూ సీరియల్స్​కి అడిక్ట్​ అవుతున్నారు. మరి అంతలా ఏముంటుంది సీరియల్స్​లో?

ఇవే కథలు

ఎవరిలోనైనా అవసరాన్ని బట్టి మంచి, చెడు బయటపడతాయి. కానీ, మన తెలుగు సీరియల్స్​లో  నూటికి తొంభైశాతం విలనిజాన్నే ఎలివేట్​ చేస్తున్నారు. కథ నడవాలి కాబట్టి మిగతా పది శాతం మంచి క్యారెక్టర్లు ఉంటున్నాయి. ఎక్కువగా ‘ఆయనకి ఇద్దరు’ అనే ఫార్ములా  కనిపిస్తోంది సీరియల్స్​లో. ఛానెల్స్​తో సంబంధం లేకుండా ప్రస్తుతం తెలుగులో టెలికాస్ట్​ అవుతున్న సీరియల్స్​ కథలన్నీ  దాదాపుగా ఈ  సబ్జెక్ట్​ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇదీ లేదంటే అనుమానంతో భార్యని దూరం పెట్టిన భర్త లేదా ఆడపడుచులు, అక్కాచెల్లెళ్ల  సాధింపులే ఎక్కువగా చూపిస్తున్నారు. వాళ్ల మధ్య వచ్చే మనస్పర్థలనే హైలెట్​ చేస్తూ ఆడియెన్స్​ని అట్రాక్ట్​ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

కోడళ్లే.. కూతుళ్లు 

నిన్న మొన్నటి వరకు సీరియల్స్​కి అచ్చొచ్చిన ఫార్ములా అత్తాకోడళ్ల కాన్సెప్ట్. కోడలు అత్తగారింట్లో అడుగుపెట్టింది మొదలు గొడవలు స్టార్ట్. కోడల్ని కొడుక్కి దూరం చెయ్యడానికి  అత్త వేసే ఎత్తులు, వాటిని తెలివిగా చిత్తు చేసే కోడలు. చివరాఖరికి ఇంట్లోంచి వెళ్లిపోయే కోడలు.. కన్నీళ్లు. ఏండ్ల తరబడి ఇదే సబ్జెక్ట్​ని అటు తిప్పి ఇటు తిప్పి సీరియల్స్​ తీశారు. కానీ, ఇప్పుడు ట్రెండ్​ మారింది. అత్తలు అమ్మలవుతున్నారు. ఒకటో రెండో కాదు, ప్రస్తుతం టెలికాస్ట్​ అవుతున్న ‘ఇంటికి దీపం ఇల్లాలు’, ‘కార్తీక దీపం’, ‘దేవత’, ‘కస్తూరి’...ఇలా చాలా సీరియళ్లలో  కోడల్ని కూతురిలా చూస్తోంది అత్త. అత్తాకోడళ్లంటే ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారని చెప్పిన సీరియల్సే ఇప్పుడు అత్తాకోడళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపిస్తున్నాయి. ఇది ఒకింత మంచి పరిణామమే. ఒకవేళ అత్తాకోడళ్ళ మధ్య ఫైటింగ్స్​ లాంటివి ఉన్నా.. కామెడీ ట్రాక్​తోనో , ఎత్తుకు పై ఎత్తు  ఫార్మాట్​లోనో వస్తున్నాయి. 

కోడళ్లు కూడా మారుతున్నరు

కన్నీళ్లు కార్చడానికే అన్నట్టు సీరియల్ హీరోయిన్ల​ క్యారెక్టర్లు ఉండేవి ఇంతకుముందు. ఇంటిని చక్కదిద్దడం, ఇంట్లో వాళ్లకి రుచిగా వండి పెట్టడమే డ్యూటీ అన్నట్టు వాళ్ల క్యారెక్టర్లని డిజైన్​ చేసేవాళ్లు. ఇప్పటికీ  కొన్ని సీరియల్స్​లో ఆ ఆలోచనలు కనిపిస్తున్నప్పటికీ.. చాలావరకు కోడళ్లు మారారు. పవర్​ఫుల్​ క్యారెక్టర్లలో కనిపిస్తున్నారు. డాక్టర్లు, కలెక్టర్లు, పోలీసు ఆఫీసర్లుగా రాణిస్తున్నారు. ఎంట్రప్రెనూర్స్​గానూ సత్తా చాటుతున్నారు. తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఇవన్నీ ఆడియెన్స్​లో ఇన్​స్పిరేషన్​ నింపుతున్నాయి. కానీ, ఎన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నా నెగెటివ్ క్యారెక్టర్లే సీరియల్స్​లో హైలెట్​గా కనిపిస్తున్నాయి. కాన్సెప్ట్​ ఏదైనా ఒకప్పటి అత్తల క్యారెక్టర్​లకి పదింతలు మించేలా లేడీ విలన్ల క్యారెక్టర్లు ఉంటున్నాయి ఇప్పుడు. ఈ కథల్లో ఆడియెన్స్​ని ఆకట్టుకుంటున్న అంశాలు​ ఏంటంటే.. 

ఎవరేం చూస్తున్నారు?

తెలుగు టెలివిజన్​లో 60 శాతం ఎంటర్​టైన్​మెంట్​ స్లాట్స్​ ఉన్నాయి. వాటిల్లో 25 శాతం సీరియల్సే ఉన్నాయి. అయితే  వీటిల్లో లవ్​ డ్రామాలకే డిమాండ్​ ఎక్కువ. వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని ఎగబడి చూస్తున్నారు. మరీ ముఖ్యంగా 18 నుంచి 29 ఏండ్ల వయసున్న వాళ్లు లవ్​ డ్రామాల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 30 నుంచి 39 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లు ఫ్యామిలీ డ్రామాల్లో  భార్యా భర్తల అనురాగాల్ని  చూడ్డానికి ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ వయసున్న వాళ్లు అత్తాకోడళ్ల గిల్లికజ్జాల్ని బాగా ఎంజాయ్​ చేస్తున్నారు. లేడీ విలన్​ క్యారెక్టర్స్​ కూడా వీళ్లకి బాగా నచ్చుతున్నాయట. సీరియల్స్​ కావాల్సినంత ఎంటర్​టైన్​మెంట్​ ఇస్తున్న మాట నిజమే అయినా... నిజజీవితానికి పొంతన లేకుండా అల్లుతున్న ఆ కథలు ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపిస్తున్నాయి. కొందరికి మేలు చేస్తే.. ఇంకొందరిని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది. కానీ సీరియల్స్​  వల్ల వచ్చే లాభనష్టాలు ఏంటంటే....

లాభాలేంటి? 

ఏదైనా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్టైతే .. దాన్ని  వరుసకట్టి మిగతా ఇండస్ట్రీలూ రీమేక్​ చేస్తుంటాయి.ఈ రీమేక్స్​​ ఫార్ములా ఇప్పుడు సీరియల్స్​లోనూ బాగా  కనిపిస్తోంది. సినిమాల కన్నా ఎక్కువ సీరియల్సే ​రీమేక్​ అవుతున్నాయి ఇప్పుడు. డబ్బింగ్​ సీరియల్స్ హవా కూడా  రోజురోజుకి పెరుగుతోంది. వీటివల్ల సీరియల్​​ ఆడియెన్స్​ కొత్త భాషలపై కాన్సన్​ట్రేట్​ చేస్తున్నారు. సీరియల్స్​లో ముందుముందు రాబోయే ట్విస్ట్​లని తెలుసుకోవడానికి  భాష తెలియకపోయినా  సీరియల్ ఒరిజినల్ వెర్షన్స్​​ని చూస్తున్నారు. ఆ ప్రాసెస్​లో మెల్లిగా వాటికే అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల వాళ్లకి తెలియకుండానే కొత్త భాషలు నేర్చుకుంటున్నారు. ఆ లాంగ్వేజ్​లోని మిగతా సీరియల్స్​ కూడా చూస్తూ  భాషపై మరింత పట్టు తెచ్చుకుంటున్నారు. 

ఎంట్రప్రెనూర్స్​గా మారుతున్నరు

ఇంతకుముందు  ఏ సీరియల్​ పెట్టినా ఆడవాళ్లు వంటింట్లోనే కనిపించేవాళ్లు. కానీ, ఇప్పుడు ఆడవాళ్ల పాత్రల్ని ఒక్కో సీరియల్​ ఒక్కోలా డిజైన్​ చేస్తోంది. ముందు చెప్పుకున్నట్టే  హీరోయిన్లని డిఫరెంట్​ ప్రొఫెషన్స్​లో చూపిస్తోంది. మరీ ముఖ్యంగా హౌస్​ వైవ్స్​ పిండివంటలతో ఎంట్రప్రెనూర్స్​గా మారడం.. కుట్లు, అల్లికలతో లక్షలు సంపాదించడం చాలా సీరియల్స్​లో చూస్తున్నాం. అలాగే అత్తలు బిజినెస్​ టైకూన్స్​గా రాణించడం చూసి చాలామంది ఇన్​స్పైర్​ అవుతున్నారు. వాళ్లు కూడా బిజినెస్ వైపు అడుగులేస్తున్నారు. సక్సెస్​ఫుల్​ ఎంట్రప్రెనూర్స్​గా మారుతున్నారు. 

అవేర్​నెస్​  కల్పిస్తున్నయ్

సీరియల్స్​లో పోలీసు, కోర్టు సీన్​లకి కొదవే లేదు. వీటివల్ల ఎంటర్​టైన్​మెంట్​తో పాటు ఇన్ఫర్మేషన్​ కూడా తెలుస్తోంది ఆడియెన్స్​కి. పోలీసులు, లా అండ్​ ఆర్డర్​పై అవేర్​నెస్​ వస్తోంది. సోషల్​ ఇష్యూస్, ఆస్తి వివాదాలు, వారసత్వానికి సంబంధించిన డ్రామాలు  అవగాహన కల్పిస్తున్నాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తలకి సంబంధించిన చట్టాల గురించి తెలుస్తోంది. ఎడ్యుకేషన్​ వాల్యూస్​ని కూడా చెబుతున్నాయి సీరియల్స్. 

ఎంప్టీనెస్ట్​ సిండ్రోమ్​ 

సీరియల్స్​ చూసేవాళ్లలో హౌస్​వైవ్స్​​ పర్సంటేజ్​ చాలా ఎక్కువ. వాళ్లలోనూ కాస్త వయసు పైబడ్డ వాళ్లు ​ ఎక్కువగా చూస్తుంటారు సీరియల్స్​. కారణం ఎంప్టీనెస్ట్​ సిండ్రోమ్​. పిల్లలు స్కూల్​కి వెళ్తారు. భర్త ఆఫీసుకి వెళ్తాడు. వాళ్లు తిరిగి వచ్చే సరికి సాయంత్రం ఐదో.. ఆరో అవుతుంది. అప్పటివరకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే ఎవరికైనా కష్టమే. అలా ఏం తోచక సీరియల్స్​కి అలవాటు పడ్డవాళ్లు నూటికి ఎనభైశాతం మంది ఉన్నారు. అందరూ ఇంటికి చేరే వరకు  వాళ్లని సీరియల్స్​ ఎంగేజ్​  చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వయసు పైబడ్డ వాళ్లకి సీరియల్సే కాలక్షేపం అయ్యాయి. హౌస్​ వైవ్స్​​ ఇంటి, వంట పనులతో రోజులో ఒక ఐదారు గంటలైనా  ఎంగేజ్​ అవుతారు. కానీ,  వయసు పైబడ్డ వాళ్లకి ఆ మాత్రం ఆటవిడుపు కూడా ఉండదు. అలాంటి వాళ్లు సీరియల్స్ వల్ల తాము ఒంటరిగా ఉన్నామనే ఆలోచనల నుంచి బయటపడుతున్నారు. సీరియల్స్​లోనే తమ సంతోషాల్ని వెతుక్కుంటున్నారు. అలా వాళ్లకి తెలియకుండానే  సీరియల్స్​ చూస్తూ ఎంప్టీనెస్ట్​ సిండ్రోమ్​ నుంచి బయటపడుతున్నారు.

స్ట్రెస్​ దూరం 

సీరియల్స్​ స్ట్రెస్​ బస్టర్స్​గా పనిచేస్తున్నాయని చెబుతున్నాయి స్టడీలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి, వంట పనులతో అలిసిపోయిన హౌస్​ వైవ్స్​​కి, పొలం పనులు, ఆఫీసు వర్క్​తో సతమతమయ్యే వాళ్లకి  సీరియల్స్​ రిలాక్సేషన్​ ఇస్తున్నాయి​. వాళ్లని పని ఒత్తిడి నుంచి బయటపడేస్తున్నాయి. అవి చూస్తున్నంతసేపు వర్క్​ టెన్షన్స్​ని దరిచేరనివ్వట్లేదు. పైగా రేపు ఏం జరుగుతుందోనన్న ఎగ్జైట్​మెంట్​ని నింపుతున్నాయి వాళ్లలో. దీనివల్ల కొంతలో కొంతైనా వాళ్లు పని ఒత్తిడి నుంచి బయటపడుతున్నారట. అలా మానసికంగా ఫిట్​గా ఉంటున్నారు.  సీరియల్స్​తో మంచి ఎంత ఉందో...  చెడు కూడా అంతే ఉంది.   

కుటుంబానికి టైం లేదు

ఇంతకుముందు సాయంత్రం అయిందంటే కుటుంబమంతా ఒక దగ్గర చేరేవాళ్లు. చిన్నాపెద్దా ఒకరితో మరొకరు మనసువిప్పి మాట్లాడుకునేవాళ్లు. ఇరుగుపొరుగు ఆప్యాయంగా పలకరించుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు ఏమాత్రం ఖాళీగా ఉన్నా ఇంట్లో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన సీరియల్స్​ చూడడానికే తప్ప కబుర్ల జోలికి పోవట్లేదు. సీరియల్స్​తో బిజీ అవుతుండటంతో ఒకే ఇంట్లో  ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా బతుకుతున్నారు చాలామంది. సీరియల్​ బ్రేక్స్​లోనే ఇంటిపనులు చేసుకునే ఆడవాళ్లు కోకొల్లలు. దీనివల్ల పిల్లల సమస్యలు పెద్దలకి తెలియట్లేదు.. భార్యాభర్తలు ఒకరికొకరు ఎమోషనల్​గా దూరం అవుతున్నారు. ఆ ఎఫెక్ట్​ చాలామంది పెద్ద వాళ్ళను మెల్లిగా డిప్రెషన్​లోకి నెట్టేస్తుంది. పిల్లల్ని ముభావంగా మార్చేస్తోంది. అందుకే  టైమ్‌‌ లిమిట్‌‌ పెట్టుకొని సీరియల్స్‌‌ చూడాలని సైకాలజిస్ట్​లు అంటున్నారు.

టీనేజర్స్​కి తిప్పలు

ప్రస్తుతం టెలికాస్ట్​ అవుతున్న సీరియల్స్​లో పిల్లలతో కలిసి చూడదగ్గవి ఎన్ని? అని  ఆలోచిస్తే ఒక్కటి కూడా కనిపించదు. ఏ సీరియల్​ పెట్టినా హీరో హీరోయిన్ల మధ్య  వచ్చే మూడో మనిషి లేదా ఎక్స్​ట్రా మ్యారిటల్​ ఎఫైర్సే ఉంటున్నాయి. దీనివల్ల పిల్లలు ఎక్స్​ట్రా మ్యారిటల్​ ఎఫైర్స్​ని చాలా తేలిగ్గా  తీసుకునే అవకాశం  ఉంది. ఇవన్నీ మామూలే.. సొసైటీ కూడా వీటిని యాక్సెప్ట్​ చేస్తుందన్న ఫీలింగ్​ వస్తోంది వాళ్లకి. ఇది రానురాను మరిన్ని అనర్థాలకి దారితీస్తుంది. అటుగా వాళ్లు ఆకర్షితులయ్యే అవకాశాలు లేకపోలేదు. పైగా ఈ మధ్య ఏ సీరియల్​ పెట్టినా  హీరోహీరోయిన్ల మధ్య లవ్​ ట్రాక్​లు శ్రుతి మించుతున్నాయి. ఈ ప్రభావం టీనేజర్స్​పై ఎక్కువగా పడుతోంది.

బాడీ షేమింగ్..​ కాస్త రంగు తక్కువ ఉండే హీరోయిన్

ఆ రంగు వల్ల ఆమె ఎదుర్కొనే ఛీత్కారాలు, కష్టాలు.. ఇదే కథగా టీఆర్పీలో దూసుకెళ్తున్నాయి ‘కార్తీకదీపం’, ‘కృష్ణతులసి’, ‘సుందరి’ లాంటి చాలా సీరియల్స్.  బరువు ఎక్కువ ఉండే హీరోయిన్.. దానివల్ల ఆమె పడే ఇబ్బందుల్నే చూపిస్తున్నారు ‘గుండమ్మ కథ’ సీరియల్​లో​.  పెద్దగా చదువుకోని అమ్మాయి.. ఇంగ్లీష్​ మాట్లాడలేక పడే ఇబ్బందులే కథలుగా తెలుగులో చాలా సీరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ బాడీ షేమింగ్​నే టీఆర్పీకి కీ పాయింట్​గా చేసుకున్నాయి. నల్లగా, లావుగా పుట్టడమే తప్పు అన్నట్టు వాళ్లని సీరియల్​లో  లేడీ విలన్లు పెట్టే టార్చర్​ అంతా ఇంతా కాదు. వీటన్నింటి వల్ల నల్లగా, లావుగా ఉండటాన్ని ఒక లోపంగా చూస్తోంది సొసైటీ కూడా. చాలామంది పిల్లలకి కూడా బాడీ షేమింగ్​ కామన్​ కాబోలు అనిపిస్తోంది. 

పెరుగుతున్న క్రైమ్​ రేటు 

రూరల్​ ఏరియాలతో పోల్చితే అర్బన్​లో సీరియల్స్ ప్రభావం కాస్త తక్కువగా ఉంది. పెద్దగా చదువుకోని వాళ్లు, కూలిపనులు చేసుకొని బతికేవాళ్లు సీరియల్స్‌‌ని వినోదం కోసమే చూస్తున్నప్పటికీ.. వాళ్లు రియల్​ లైఫ్​లో కూడా సీరియల్స్​లో జరిగినట్టే జరుగుతుంది అనుకుంటున్నారు. వాళ్ల చుట్టు పక్కల మనుషుల్ని ఆ సీరియల్​ క్యారెక్టర్లతో  పోల్చుకుంటున్నారు. అత్తాకోడళ్ల గొడవలు, తోటికోడళ్ల మధ్య సాగే తగువులు  వీళ్ల  మనసుల్లో బలంగా నాటుకుపోతున్నాయి​.  అలాగే పల్లె, పట్నం తేడా లేకుండా సీరియల్స్ వల్ల క్రైమ్​ రేటు బాగా పెరుగుతోంది. ఓ సీరియల్‌‌ చూసి ఒకామె తన కోడలికి పాయిజన్​ ఇచ్చిందంటే సీరియల్స్​ ప్రభావం సొసైటీపై ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్కటే కాదు సీరియల్స్​ చూసి  భర్తను చంపి ఆ స్థానంలో ఇంకొకర్ని తీసుకొచ్చినవాళ్లూ ఉన్నారు. ఇవే కాదు,  సీరియల్స్​ని అనుకరిస్తూ ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి​.  

మారుతున్న కల్చర్​

సీరియల్స్​ వల్ల చాలామంది జేబులు కూడా ఖాళీ అవుతున్నాయి. మన కల్చర్​ పైనా సీరియల్స్​ ప్రభావం బాగా కనిపిస్తోంది. సీరియల్స్​ కనిపించే చీరలు, నగలు, ఫర్నిచర్​  ఆడవాళ్లని బాగా అట్రాక్ట్​ చేస్తున్నాయి. డబ్బింగ్​ సీరియల్స్​ వల్ల కల్చర్​లోనూ మార్పు వస్తోంది. ఒకప్పుడు తెలుగు సీరియల్స్​లో చీరకట్టు మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు హిందీ సీరియల్స్​లో కనిపించే ​ కట్టుబొట్టుని కూడా తెలుగు సీరియల్స్​ ఫాలో అవుతున్నాయి. పాపిట్లో సింధూరం పెట్టుకోవడం హిందీ డబ్బింగ్​ సీరియల్స్​ చూసి నేర్చుకున్నదే. అట్లాగే మన దగ్గర ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ లేకపోయినా, హిందీ సీరియల్స్​ని కాపీకొట్టి  ఉమ్మడి  కుటుంబాల కాన్సెప్ట్​ని ఫాలో అవుతున్నారు. దంతేరస్​ లాంటి ఉత్తరాది పండుగలు మనదగ్గరా సెలబ్రేట్​ చేసుకుంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే మన తెలుగు సీరియల్​ కల్చర్​ మారే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్​  పిల్లలపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. 

పెరుగుతున్న అనుమానాలు 

ఈ మధ్య టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్​ కథలు చాలావరకు అనుమానాలతోనే నడుస్తున్నాయి. నిజానికి ఇవన్నీ నిజజీవితంలో చాలా అరుదుగా జరుగుతాయి​. కానీ వాటినే హైలెట్ చేస్తూ కథలు అల్లడం వల్ల సొసైటీ మొత్తం ఇలానే ఉందనే అపోహ పడే  అవకాశం ఉంది.  ఆ సీరియల్​లో ఇలానే ఉందిగా, ఆమె కూడా అలానే చేసిందిగా అంటూ  తమ పార్టనర్​ని అనుమానిస్తున్నారు. దీనివల్ల కుటుంబంలో ఒకరిపై మరొకరికి నమ్మకం పోతోంది.  అనుమానాల వల్ల సొసైటీపైనా చెడు ప్రభావం పడుతోంది. పిల్లల ముందు ఇలాంటి సీరియల్స్​ అసలే  చూడకూడదని సైకాలజిస్ట్​లు సలహా ఇస్తున్నారు. అలాగే ఈ మధ్య పిల్లల్ని విలన్లుగా చూపించడం ఒక  ట్రెండ్​ అయింది. చిన్న పిల్లలు కిడ్నాప్​లు చేయడం,  కుట్రలు పన్నడం... వయసుకు మించిన ఎక్స్​ప్రెషన్స్​, డైలాగ్​లు చెప్పించడం వంటివి  చూడాల్సి రావడం దురదృష్టకరం.  

తెలుగులో తొలి సీరియల్​ 

సరిగ్గా 37 యేండ్ల కిందట జూలై 7, 1984 న ఇండియన్​ టెలివిజన్​లో  మొదటిసారి సీరియల్​ టెలికాస్ట్​ అయింది. దూరదర్శన్​లో ‘హమ్​ లోగ్​’ పేరుతో వచ్చిన ఆ సీరియల్ మెక్సికన్​ టెలివిజన్​ సిరీస్​ ‘వెన్​ కన్​మిగోలోని ’ కి రీమేక్​.  మొత్తం 154 ఎపిసోడ్స్​తో దాదాపుగా పద్దెనిమిది నెలలు అలరించిన ఆ సీరియల్ కథ తాగుడుకి బానిసైన భర్త,  అన్నీ తానై కుటుంబాన్ని నడిపించే భార్య చుట్టూ తిరిగింది. ఆడా మగా తేడాలు, మూఢ నమ్మకాలు, పేదరికం, సోషల్​ వాల్యూస్​, విమెన్​ ఎంపవర్​మెంట్ గురించి ఈ సీరియల్​లో చూపించారు. ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్‌‌ చివరిలో వాస్తవంలో జరుగుతున్న విషయాల్ని రిలేట్​ చేస్తూ బాలీవుడ్​ సీనియర్​ నటుడు అశోక్​ కుమార్​ కాసేపు మాట్లాడేవాడు. అలా ఆ సీరియల్​ దాదాపు లక్షలాది మంది మనసుల్లో ​​బలమైన ముద్ర వేసుకుంది. ఆ తర్వాత  మెల్లిగా తెలుగు టెలివిజన్​కి సీరియల్స్​ పరిచయమయ్యాయి. మొదట ‘రామాయణ్​’, తర్వాత ‘ మహా భారత్​’ , ‘మాల్గుడిడేస్’  సీరియల్స్​తో దేశంలో టీవీ వ్యూయర్​షిప్​ కోట్లకు చేరిపోయింది. ​దూరదర్శన్​లో ఆదివారం పగటిపూట వచ్చిన ఈ సీరియల్స్​ కోసం దేశంలోని చిన్నాపెద్దా అందరూ ఎదురుచూసేవాళ్లు. 

ఇక, తెలుగులో వచ్చిన మొట్టమొదటి వీక్లీ సీరియల్స్​ ‘అనగనగా ఒక శోభ’, ‘కుంకుమాగ్ని’ . ఈ రెండింటిలో కట్నకానుకల ఆచారాన్ని ప్రశ్నించిన ‘కుంకుమాగ్ని’ సీరియల్​ చాలామందిని ఆలోచింపజేసింది. దాంతో ఇండస్ట్రీ దృష్టి డైలీ సీరియల్స్ వైపు మళ్లింది. 1996 లో మొదటి తెలుగు డైలీ  సీరియల్​ ‘రుతురాగాలు’ టెలికాస్ట్​ అయింది. యద్దనపూడి సులోచనారాణి రాసిన నవల ఆధారంగా మంజులా నాయుడు తీసిన ఈ సీరియల్​ 450 ఎపిసోడ్స్​తో అందరి మనసు గెలుచుకుంది. ఈ సీరియల్​లో  ప్రతి క్యారెక్టర్ నిజజీవితంలో మన చుట్టూ ఉన్నవే కావడంతో జనాల్లో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జనాల్లో నడిచే ‘కస్తూరి’, ‘కిట్టిగాడు’ లాంటి  కథలే సీరియల్స్​గా వచ్చాయి. కానీ, శాటిలైట్​ ​ ఛానెల్స్​ రాకతో   సీరియల్స్​ సీన్​ మారిపోయింది. 2003 నుంచి 2008 వరకు ప్రసారమైన ‘చక్రవాకం’ తెలుగు సీరియల్​ స్టయిల్​ మార్చేసింది. 2008 నుంచి 2013 వరకు నడిచిన ‘మొగలిరేకులు’ ఒక సెన్సేషన్​. 

మన సీరియలే టాప్

ఇండియన్​ టెలివిజన్​లో వెయ్యి ఎపిసోడ్స్​ దాటిన మొట్టమొదటి సీరియల్​ ‘క్యోంకీ సాస్​ బీ కభీ బహూతీ’.  ఏక్తాకపూర్​ ప్రొడ్యూస్​ చేసిన ఈ సీరియల్​ అప్పట్లో  ఎన్నో రికార్డ్​లని బ్రేక్​ చేసింది. ఈ సీరియల్​ తర్వాత ఏక్తాకపూర్​ ఏ షో ప్రొడ్యూస్​ చేసినా ‘కె’ అక్షరంతోనే టైటిల్​ పెడుతోందంటే దాని మానియా అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కెతో పాటు భాగ్య కూడా కలిసింది. స్మృతీ ఇరానీ  నటించిన ఈ సీరియల్​ దాదాపు 1, 833 ఎపిసోడ్స్​తో అలరించింది. ఆ రికార్డ్​ని బ్రేక్​ చేస్తూ మరాఠి సీరియల్​ ‘చార్​ దివస్’​ మూడు వేల ఎపిసోడ్స్​కి చేరుకుంది. అందుకు లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది. ఆ సీరియల్​ని వెనక్కి నెట్టి మన తెలుగు సీరియల్​ ‘అభిషేకం’ ఇండియన్​ టెలివిజన్​లోనే లాంగెస్ట్ రన్నింగ్​ సీరియల్​గా నిలిచింది. 2008 లో మొదలైన ఈ సీరియల్​ ఇప్పటివరకు 3,950 ఎపిసోడ్స్​ పూర్తి చేసుకుంది. 

టాప్​–10లో నాలుగు ఛానెల్స్

బ్రాడ్​ కాస్ట్​ రీసెర్చ్​ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా ప్రతి వారం దేశంలో  ఎక్కువమంది చూసిన ఛానెల్స్, సీరియల్స్​ లిస్ట్​ రిలీజ్​ చేస్తుంది. దీన్నే టీఆర్పీ రేటింగ్​ అంటారు. దీని ప్రకారం ఈ వారం ఇండియాలోని టాప్ –10 బెస్ట్​ ఛానెల్స్​లో  దక్షిణాది నుంచి నాలుగు ఛానెల్స్  ఉన్నాయి. ఈ లిస్ట్​లో​ తమిళ ‘సన్​ టీవీ’ రెండు, ‘స్టార్​ మా’ మూడు, ‘స్టార్​ విజయ్’​ ఏడు, ‘జీ తెలుగు’  పదో ప్లేస్​లో ఉన్నాయి. అలాగే ఈ వారం ‘కార్తీక దీపం’  సీరియల్​ 90.49 పాయింట్స్​తో ముందు ఉంది. ఆ తర్వాత 83.72 పాయింట్లతో ‘ఇంటింటి గృహలక్ష్మి’, 81.60 పాయింట్లతో  ‘గుప్పెడంత మనసు’ రెండుమూడు స్థానాల్లో నిలిచాయి. ‘దేవత’, ‘చెల్లెలి కాపురం’, ‘రాధమ్మ కూతురు’, ‘త్రినయని’ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హిందీలో ‘అనుపమ’ సీరియల్  దూసుకెళ్తోంది. 

ఆవుల యమున, వెలుగు నెట్​వర్క్