నన్నే కోవర్ట్ అంటరా? టిఆర్ఎస్ బండారం రోజుకోటి బయటపెడ్త

 నన్నే కోవర్ట్ అంటరా? టిఆర్ఎస్ బండారం రోజుకోటి బయటపెడ్త
  • కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్

కరీంనగర్: తెలంగాణ కోసం.. టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నన్నే కోవర్ట్ అంటారా..? టీఆర్ఎస్ పార్టీ బండారం రోజుకొకటి బెయటపెడ్తానని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. నా నామినేషన్ తిరస్కరించే కుట్ర చేశారు.. నన్ను ప్రపోజ్ చేసిన వాళ్లను బెదిరించి పోర్జరీ చేశారని కేసు పెట్టించాలని చూశారని ఆయన ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాకు మద్దతిచ్చిన వారిని భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తే.. వాళ్లు భయపడకుండా ఆ సంతకాలు మావేనని కలెక్టర్ ముందు చెప్పారని, అయినా ఎన్నికల అధికారి మూడు గంటలపాటు ఇబ్బంది పెట్టి చివరికి నా నామినేషన్ ఆమోదించారని ఆయన వెల్లడించారు. దమ్ముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ వాళ్లకు, మంత్రులకు చెప్పాను, నా నామినేషన్ మీద వాళ్ళు దృష్టి పెట్టారంటేనే నేను నైతికంగా విజయం సాధించినట్లేనని ఆయన పేర్కొన్నారు. 
అర్జునగుట్టలోని ఆలయంలో నాకు ఎమ్మెల్సీ ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్ నాకు హామీ ఇచ్చారు, మేయర్ పదవి పోయాక కూడా తన జన్మదినం రోజున కేసిఆర్ నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మంత్రుల ముందు, నేతల ముందు చెప్పారు, మేయర్ గా పనిచేసిన నేను కార్పొరేటర్ గా ఉండనని చెప్పినా.. సీఎం చెప్పడంతో కొనసాగాను, కరీంనగర్ కు చెందిన మంత్రి నన్ను అవమానాలకు గురి చేశారుని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన భాను ప్రసాద్ రావు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పని చేశారు? అని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాద్ రావు 12 రోజులైనా కరీంనగర్ లో ఉన్నారా..? ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలు గురించి ఎప్పుడైనా మాట్లాడావా?పంచాయతీరాజ్ చట్టం గురించి మండలి లో ఒక్క మాట అయినా భానుప్రసాద్ మాట్లాడారా..? అని నిలదీశారు. మున్సిపల్ చట్టంలో సెక్షన్లు కుదించినా  ఏనాడు మాట్లాడలేదు.. ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ప్రజాప్రతినిధుల ఓట్లు ఎలా అడుగుతారు? అని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏనాడూ శిక్షణ శిబిరాలు పెట్టని భాను ప్రసాదరావు ఇప్పుడు మాత్రం క్యాంపులు పెడుతున్నాడని, నా నామినేషన్ వల్ల ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు కార్పొరేటర్లకు గౌరవం వచ్చిందిన్నారు.
వాళ్లు గెలిస్తే వ్యాపారాలు చేసుకుంటారే తప్ప పట్టించుకోరు 
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ల వ్యాపారాలు చూసుకుంటారు తప్ప స్థానిక సంస్థల ప్రయోజనాలు పట్టించుకోరని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. రాజీవ్ రహదారి నిర్మాణ లోపాలపై వేసిన శాసన మండలి కమిటీ చైర్మన్ గా భాను ప్రసాదరావు అవినీతికి పాల్పడ్డారని, రాజీవ్ రహదారిలో ఎన్ని మలుపులు ఉన్నాయి అన్ని కోట్లు భాను ప్రసాదరావు తీసుకున్నాడని ఆరోపించారు. అదే తనను గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోసం కరీంనగర్లో ఆఫీస్ ప్రారంభిస్తానని, నిరుపేద స్థానిక ప్రజాప్రతినిధుల కోసం హెల్త్ కార్డులు సాధిస్తానన్నారు. 
ఉద్యమకారులపై రాళ్లేసిన వారిని కేసీఆర్ పక్కన పెట్టుకున్నారు
ఉద్యమాన్ని దూషించిన వాళ్లను ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు. మానుకోటలో రాళ్లువిసిరిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చారని, 24 గంటల్లోపే ఆయనకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులు లేరా? వెంకటరామిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు? ఉద్యమకారులకు పాలనలో అవకాశం ఇస్తే ప్రజల కష్టాలు తీరేలా పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. నాకు మేయర్ గా అవకాశం వచ్చినప్పుడు రూపాయికే అంత్యక్రియలు, ఒక రూపాయికి నల్లా కనెక్షన్ వంటి పథకాలు తెచ్చానని గుర్తు చేశారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ నేను తెస్తే.. ఆ పథకం పేరిట చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారని ఆరోపించారు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది.. కాబట్టే నేను ఎంతో బాధతో సీఎంకు లేఖ రాశానన్నారు. భాను ప్రసాదరావు 4 సెట్ల నామినేషన్ వేశారని, ఈ నాలుగు సెట్లకు ప్రపోజల్ సంతకాలు చేసిన 40 మంది పేర్లు ఆయన చెప్పగలిగితే నేను ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. 1320 మంది జిల్లా లోకల్ బాడీ ప్రజాప్రతినిధుల్లో ఆయనకు 20 మంది కూడా తెలియదని, కేవలం డబ్బు సంచులతో మాత్రమే భాను ప్రసాద్ రావు గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయన స్థానికుడు కాదు. ఆయన తన ఓటును కూడా జీహెచ్ఎంసీలో రాయించుకున్నాడన్నారు. ఓటుకు 10 లక్షలు తీసుకోండి. కానీ ఓటు మాత్రం నాకే వేయండి అని రవీందర్ సింగ్ కోరారు. 
టీఆర్ఎస్ లో యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ తోపాటు మెయింటెనెన్స్ బ్యాచ్ కూడా ఉంది
టీఆర్ఎస్ పార్టీలో యూటీ (UT) బ్యాచ్, బీటీ( BT) బ్యాచ్ తో పాటు మెయింటనెన్స్ బ్యాచ్ కూడా ఉందని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ విమర్శించారు. నేను టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ కాబట్టే నాకు  మేయర్ గా అవకాశం ఇచ్చారని, అయితే తాను ఏనాడూ పార్టీలో కోవర్టుగా పనిచేయలేదనన్నారు. నన్ను ఓడించేందుకు కుట్ర చేశారు తప్ప.. నేను ఎవరినీ ఓడించడానికి ప్రయత్నించలేదని వివరించారు. వినోద్ కుమార్ ఎంపీగా ఓడిపోయినా.. మూడు నెలలకే ఆయనకు పదవి ఇచ్చారని, అలాగే కవిత ఓడిపోయాక 4 నెలలు కాకముందే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారని విమర్శించారు. ఇకపై నేను కూడా పార్టీకి సంబంధించిన రోజుకొక విషయం బయటకు చెప్తా, వాళ్లు మీకు పది లక్షలు ఇస్తే తీసుకోండి. నేను మీకు తలా ఒక రూపాయి ఇస్తా.. నాకు ఓటేయండి అని ఆయన కోరారు. నన్ను గెలిపిస్తే స్థానిక సంస్థల సమస్యలను చట్టసభలో వినిపిస్తా.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు పెరిగేలా చూస్తానన్నారు. హుజూరాబాద్ లో ఓటుకు పది వేలు ఇచ్చినా ఈటల రాజేందర్ గెలవడం చూశామని, అదే రీతిలో జిల్లా ప్రజలు మరోసారి చైతన్యం చూపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పోతోందని, మరోసారి నా విజయంతో అది రుజువు అవుతుందన్నారు. నేను అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థిని, నాకు చాలామంది సపోర్ట్ చేస్తారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.