దేశం గర్వించిన డాక్టర్.. బీసీ రాయ్ 

దేశం గర్వించిన డాక్టర్.. బీసీ రాయ్ 

‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. పునర్జన్మ  ఇచ్చేది వైద్యులు. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు దేవుడితో సమానం. కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుడినే. ఇంతటి మహోన్నత స్థానం కలిగిన వైద్యుల సేవలను, అంకితభావాన్ని స్మరించుకోవడానికి ఏటా ఒక రోజంటూ ఉంది. అదే జూలై 1.  ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌ (ఐఎంఏ) ఏటా ఆ రోజున జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తోంది.  ఈ దినోత్సవాన్ని ప్రకటించడం వెనుక ఒక గొప్ప వైద్యుడు ఉన్నారు.దేశమంతా గర్వించే వైద్యుడిగా ఎదిగిన ఆ వ్యక్తి పేరు భారత రత్న, డాక్టర్ బిధాన్ చంద్రరాయ్. 1991వ సంవత్సరం నుంచి ఏటా ఆయన జయంతిని ‘నేషనల్ డాక్టర్స్ డే’గా జరుపుకుంటున్నాం. వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ఆ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి ఆయనే. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్థాన్) విడిపోయిన కీలక సమయంలో (1948) బెంగాల్ సీఎం పదవిని ఆయన చేపట్టారు. సీఎం పదవికి ఆయన పేరును ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. 1948 జనవరి 23 నుంచి 1962 జూలై 1 వరకు బెంగాల్ సీఎం పదవిలో బిధాన్ చంద్రరాయ్ కొనసాగారు. 1961 ఫిబ్రవరి 4న ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించారు. సీఎంగా ఉన్న సమయంలో బెంగాల్ కాంగ్రెస్   పార్టీకి  చంద్రరాయ్  కాయకల్ప చికిత్స చేశారు. వర్గపోరు నివారించి, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చారు. 

సీఎంగా ఉంటూనే వైద్యసేవలకు అంకితమై.. 
ఒక వైపు సీఎంగా ఉంటూనే.. మరోవైపు కోల్ కతాలోని తన ఆస్పత్రిలోనూ వైద్యసేవలకు ఆయన అంకితమయ్యేవారు. రోజువారీగానే 1962 జూలై 1న (ఆయన పుట్టిన తేదీ కూడా ఇదే)  తన ఆస్పత్రిలో వైద్య విధులను ముగించుకొని ఇంటికి వెళ్లిన చంద్రరాయ్ ‘బ్రహ్మో గీత్’ చదివారు. 11 గంటల తర్వాత  తుదిశ్వాస విడిచారు. చంద్రరాయ్ వీలునామాను అనుసరించి ఆయన ఇంటిని నర్సింగ్ హోం గా మార్చి, దానికి వాళ్ల అమ్మ అఘోర్ కామినీ దేవి పేరు పెట్టారు.  బిహార్ లోని పట్నాలో ఉన్న  తన ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక ట్రస్టును కూడా ఏర్పాటుచేశారు. దానికి తొలి ట్రస్టీగా ప్రముఖ జాతీయవాది గంగాశరణ్ సింగ్ ను నియమించారు. బీసీ రాయ్ నేషనల్ అవార్డును కూడా1962లో  ఏర్పాటుచేశారు. వైద్యం, రాజకీయం, సైన్స్, ఫిలాసఫీ, సాహిత్యం, కళల రంగాల్లో సేవలందించే వారికి 1976 నుంచి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ను స్థాపించడంలోనూ ఆయన ప్రధాన భూమిక నిర్వర్తించారు. 

‘ఆర్కిటెక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’
డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ పేరొందిన ఫిజీషియనే కాదు, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. ఆయన కోల్ కతా మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. తరువాత సెయింట్ బార్థాలమ్యూ హాస్పిటల్ లో పీజీ మెడిసిన్  కోర్సు చేశారు. అనంతరం రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో సభ్యత్వం సాధించారు.  తాను చదువుకున్న కోల్ కతా మెడికల్ కాలేజ్ లోనే అధ్యాపకుడిగానూ  పని చేశారు. పశ్చిమ బెంగాల్ లో జాధవ్ పూర్ టీబీ ఆస్పత్రి, చిత్త రంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్,   చిత్తరంజన్ సేవా సదన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్, విక్టోరియా ఇన్‌స్టిట్యూషన్ వంటి అనేక ప్రతిష్ఠాత్మక వైద్యసేవా సంస్థలను స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు.  మహిళలకు సామాజిక సేవ, నర్సింగ్‌లో శిక్షణ ఇప్పించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్, బిధాన్ నగర్,అశోక్ నగర్, కల్యాణి, హబ్రా అనే ఐదు నగరాలను అభివృద్ధి చేశారు. దీంతో ఆయనకు ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ అనే పేరు కూడా వచ్చింది. బ్రహ్మ సమాజంలో సభ్యుడిగానూ చంద్రరాయ్  వ్యవహరించేవారు. 1931-, 1933 మధ్యకాలంలో కలకత్తా నగర మేయర్‌ గా ఉన్నప్పుడు స్థానిక పరిపాలనలో బిధాన్ చంద్రరాయ్ సంస్కరణలు  తీసుకొచ్చారు.  1942, 1944 మధ్యకాలంలో  కోల్ కతా యూనివర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్ గా, 1939లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా, ఆ తర్వాత కొంతకాలం ఉత్తరప్రదేశ్ గవర్నర్ గానూ సేవలు అందించారు.

ప్రపంచంలో తొలిసారిగా అమెరికాలో.. 
ప్రపంచంలో తొలిసారిగా డాక్టర్స్ డే నిర్వహించుకునే ట్రెండ్.. అమెరికాలోని జార్జియా రాష్ట్రం విండర్ ప్రాంతంలో 1933 మార్చి 30న ప్రారంభమైంది. నాటి ప్రముఖ వైద్యుడు డాక్టర్ చార్లెస్ బి. ఆల్మండ్ భార్య యూడోరా బ్రౌన్ ఆల్మండ్ కు వైద్యుల దినోత్సవం నిర్వహించాలనే ఆలోచన తొలిసారిగా వచ్చింది.  మొదటి సారిగా డాక్టర్స్ డే రోజున గ్రీటింగ్ కార్డులతో వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య వృత్తిని కొనసాగిస్తూ మరణించిన వైద్యుల సమాధులపై పువ్వులు ఉంచి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. 1990  అక్టోబర్ 30 న నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్   మార్చి 30వ తేదీని "నేషనల్ డాక్టర్స్ డే"గా ప్రకటించారు.