నాలుగు నెలలుగా జీతాలు వస్తలేవు..బస్తీ దవాఖాన్ల డాక్టర్లు, సిబ్బంది నిరసన

నాలుగు  నెలలుగా జీతాలు వస్తలేవు..బస్తీ దవాఖాన్ల డాక్టర్లు, సిబ్బంది నిరసన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తమకు 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జులై 1న జీతాలు ఇవ్వకపోతే 2వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్ డబ్ల్యూ) ఆఫీస్ ఎదుట వారు నిరసన తెలిపారు.

అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహాను కలిసి వినతి పత్రం అందించారు. మూడు రోజుల్లో వేతనాలు విడుదల చేస్తామని మంత్రి తమకు హామీ ఇచ్చారని వారు తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించామని, ఇదే తరహాలో బస్తీ దవాఖానల వైద్యులు, సిబ్బంది సమస్యను పరిష్కరిస్తామని చెప్పారన్నారు.  అయితే, బస్తీ దవాఖాన్లు అన్నీ నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్‌‌‌‌తో నడుస్తాయని ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.400 కోట్ల ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం నిధులను కేంద్రం విడుదల చేయలేదని వివరించారు. ఈ నేపథ్యంలోనే వేతనాలు చెల్లించలేకపోయామని ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం అధికారులు చెబుతున్నారు.