ఏపీ:జిల్లా అధికారికి చికిత్సలో నిర్లక్ష్యం..ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్

ఏపీ:జిల్లా అధికారికి చికిత్సలో నిర్లక్ష్యం..ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్
  • ఆసుపత్రి సూపరింటెండెంట్ తోపాటు.. ఇద్దరు హెడ్ నర్సులకు షోకాజ్ నోటీసులు
  • కోవిడ్ ఆసుపత్రుల ఇంచార్జులెవరూ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని ఆరోపణ

అనంతపురం: సూపర్  స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన జిల్లా స్థాయి అధికారి, ఏపీ ఎంఐపి పిడి సుబ్బారాయుడుకు చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వల్ల ఆయన చనిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సీరియస్ అయ్యారు. ఆయనకు చికిత్స చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడం వల్లే కోలుకోలేక తుదిశ్వాస విడిచినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రాథమిక విచారణ చేసి ప్రభుత్వానికి నివేదించారు.ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ సైతం సీరియస్ కావడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్లు శ్రీధర్, సుధాకర్లపై సస్పెన్షన్ వేటుకు సిఫారసు చేశారు. అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ భాస్కర్ తోపాటు ఇద్దరు హెడ్ నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా స్థాయి అధికారి కరోనా సోకి చేరితే ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకుని వైద్యం చేయకపోవడం చివరకు ఆయన కోలుకోలేక చనిపోయిన వ్యవహారం పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది.
కరోనా ఆసుపత్రుల ఇంచార్జ్ డాక్టర్లు, నోడల్ అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు
అనంతపురం జిల్లాలో కోవిడ్ ఆస్పత్రులుగా నిర్ధారించిన ఏ ఆసుపత్రిలో కూడా ఇన్ఛార్జ్ డాక్టర్ గాని , నోడల్ అధికారిగాని ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలకు ఈ ఘటన అద్దం పట్టింది. పని ఒత్తిడి ఉందనే సాకుతో వైద్యులు వారి పైన ఉండే సీనియర్ వైద్యులు లేదా వైద్యాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లు మినహా ఇతరుల ఫోన్లేవీ లిఫ్ట్ చేయకపోవడం వల్ల దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు అధికారులకు ఫిర్యాదులు చేశారు, మారుమూల గ్రామాల నుండి వందలమంది నిరుపేదలు కోవిడ్ బారినపడి ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ఆశగా చూస్తుంటే ఇక్కడ నిర్లక్ష్యం వల్లే ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యాల బారినపడే పరిస్థితులు ఉన్నాయన్న ఆరోపణలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనే ఓ జిల్లా స్థాయి అధికారి వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోవడం నిదర్శనంలా నిలిచిందని చెబుతున్నారు. జిల్లా అధికారికే దిక్కులేక చనిపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వైద్య ఆరోగ్యశాఖలో ప్రకంపనలు సృష్టించాయి. అనంతపురంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసుపత్రుల్లోకి మీడియా వెళ్లకుండా ఆంక్షలు పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆస్పత్రుల పరిస్థితిని ప్రభుత్వం సమీక్షించాలని, కేసులు, డెత్ రేట్ తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.