డ్యూటీలకు డాక్టర్లు డుమ్మా .. పీహెచ్‌‌సీలలో వైద్య సేవలు నిల్

డ్యూటీలకు డాక్టర్లు డుమ్మా ..  పీహెచ్‌‌సీలలో వైద్య సేవలు నిల్
  •     నిరుపయోగంగా మానిటరింగ్‌‌ సెల్
  •     కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 
  •     చాలా పీహెచ్ సీలలో సీసీ కెమెరాల కనెక్షన్లు కట్
  •     పట్టించుకోని పబ్లిక్ హెల్త్ అధికారులు
  •     రాష్ట్రవ్యాప్తంగా ‘వెలుగు’ ఫీల్డ్ విజిట్

హైదరాబాద్, నెట్‌‌వర్క్‌‌, వెలుగు: ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించాల్సిన పబ్లిక్  హెల్త్ సెంటర్ల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో డాక్టర్లు, స్టాఫ్  డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. ఫలితంగా ప్రైమరీ హెల్త్  సెంటర్లలో (పీహెచ్ సీ) వైద్య సేవలు అందడం లేదు. డాక్టర్లు, స్టాఫ్  పీహెచ్‌‌సీలకు వస్తున్నారో లేదో తెలుసుకునేందుకు రూ.కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ పనిచేయడం లేదు. ప్రైమరీ హెల్త్  సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఫుల్ టైమ్‌‌ పీహెచ్‌‌సీలో షిఫ్ట్‌‌ల వారీగా రాత్రి, పగలు పనిచేయాలి. కానీ, ఈ నిబంధనలు ఏవీ అమలుకు నోచుకోవడం లేదు. గత బీఆర్‌‌‌‌ఎస్  సర్కార్  హయాంలోనూ పరిస్థితి ఇలాగే ఉండేది. దీంతో అన్ని పీహెచ్‌‌సీలలో సీసీ కెమెరాలను పెట్టించారు. ఈ కెమెరాల ద్వారా పీహెచ్‌‌సీలలో డాక్టర్లు ఉన్నారో, లేరో తెలుసుకునేందుకు పబ్లిక్  హెల్త్  డైరెక్టర్  కార్యాలయంలో మానిటరింగ్  సెల్  ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా రాష్ట్రంలో ఏ పీహెచ్‌‌సీలో ఏం జరుగుతుందో లైవ్‌‌లో చూసేలా మానిటరింగ్‌‌  సెల్‌‌కు సీసీ కెమెరాలను అనుసంధానించారు. ఈ మొత్తం వ్యవహారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఆఫీసర్ల నిర్లక్ష్యం

హెడ్ క్వార్టర్స్  నుంచే పీహెచ్‌‌సీల పనితీరును మానిటర్  చేసేందుకు అవకాశం ఉన్నా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ వ్యవస్థ నిరుపయోగంగా మారింది. కొన్నిచోట్ల డాక్టర్లు, సిబ్బంది కుమ్మక్కై పీహెచ్‌‌సీలలోని కెమెరాలకు కనెక్షన్లు కట్  చేశారు. ఇంకొన్ని చోట్ల ఇంటర్నెట్  పనిచేయకుండా చేసి  నెట్‌‌వర్క్ ప్రాబ్లమ్  అని తప్పించుకుంటున్నారు. మొత్తం 887 పీహెచ్‌‌సీలు ఉంటే, అందులో సగానికిపైగా కేంద్రాల్లో కెమెరాలు రోజూ ఆఫ్‌‌లైన్‌‌లోనే ఉంటున్నాయి. ఇవేవీ  ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పీహెచ్‌‌సీలలో డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్‌‌పై వెలుగు రిపోర్టర్లు గురువారం ఫీల్డ్ విజిట్ చేశారు. చాలా చోట్ల డాక్టర్లు  అందుబాటులో లేరు. వెలుగు విజిట్‌‌లో గమనించిన అంశాలు ఇలా ఉన్నాయి.
    
మంచిర్యాల జిల్లా జైపూర్ పీహెచ్‌‌సీలో సీసీ కెమెరా లు ఆఫ్  చేసి ఉన్నాయి. బయోమెట్రిక్  పనిచేయడం లేదు. దండేపల్లి పీహెచ్‌‌సీలో మెడికల్  ఆఫీసర్  ఉదయం 10 గంటలకు వచ్చి, పల్స్ పోలియో సిబ్బందితో మీటింగ్  నిర్వహించి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిపోయారు. చెన్నూరు మండలం అంగ్రాజ్‌‌పల్లి పీహెచ్‌‌సీ మెడికల్ ఆఫీసర్ లీవ్‌‌లో ఉండగా నర్స్, ఫార్మసిస్ట్ 91 మంది పేషెంట్లను చూసి మందులిచ్చినట్టు రిజిస్టర్‌‌‌‌లో రికార్డు చేశారు. 4 గంటలకు హాస్పిటల్లో అటెండర్  తప్ప ఎవరూ కనిపించలేదు. లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట పీహెచ్‌‌సీ  డాక్టర్ మధ్యాహ్నం 3 గంటలకు పల్స్ పోలియో మీటింగ్ ఉందని వెళ్లిపోయారు.
    
వరంగల్  జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గురువారం డాక్టర్లు రాలేదు. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉండగా డాక్టర్  ఉదయ్  రాజు డిప్యుటేషన్‌‌పై సంగెం మండలంలో పనిచేస్తున్నారు. మరో డాక్టర్  ప్రశాంతి ఆరోగ్యం సరిగా లేక గురువారం సెలవు పెట్టారని అక్కడి స్టాఫ్  చెప్పారు. ఇద్దరు స్టాఫ్ నర్స్ లలో ఒకరు హాస్పిటల్ లో ఉండగా, సూపర్ వైజర్   పల్స్ పోలియో ప్రోగ్రాం కోసం బయటికి వెళ్లినట్లు సిబ్బంది చెప్పారు. ఆసుపత్రిలో మిగతా సిబ్బంది ఎవరూ లేరు. ఓపీ రిజిస్టర్ ను పరిశీలించగా ఈనెల 27న చివరగా రోగులు వచ్చినట్లు ఉంది. రెండు రోజులుగా ఓపీ రిజిస్టర్ లో రోగుల వివరాలు ఏమీ  రాయలేదు. ఆసుపత్రిలో 3 సీసీ కెమెరాలు ఉండగా, హాల్ లో రెండు కెమెరాలకు కనెక్షన్  తొలగించి ఉంది. ఆసుపత్రి సిబ్బంది రోజూ సమయపాలన పాటించకుండా వచ్చి వెళ్తున్నారని రోగులు చెప్పారు.
    
ఇక జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి డాక్టర్లు రెగ్యులర్​గా డాక్టర్లు రావడంలేదని పేషెంట్లు తెలిపారు. ఎమర్జెన్సీ ఉంటే గద్వాలకు పోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఈ హాస్పిటల్‌‌ను విజిట్  చేయగా ఇక్కడ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్  రమేశ్ డ్యూటీకి రాలేదు. కింది స్థాయి సిబ్బంది ముగ్గురే ఉన్నారు. సీసీ కెమెరాలు పనిచేయట్లేదు.
    
ఆదిలాబాద్  జిల్లాలోని నేరడిగొండ మండల కేంద్రంలోని పీహెచ్ సీలో డాక్టర్లు సమయానికి రావడం లేదు. ఉదయం 9 గంటలకు రావాల్సిన మెడికల్ ఆఫీసర్  సద్దాం 10 గంటల తర్వాతనే వస్తున్నాడని పేషెంట్లు చెబుతున్నారు. గురువారం కూడా ఉదయం 10 గంటలకు వచ్చి, మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం తర్వాత ప్రైవేట్  క్లినిక్ లో ప్రాక్టీస్  చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మధ్యాహ్నం వచ్చే రోగులను అక్కడి సిబ్బంది బోథ్  పీహెచ్‌‌సీకి, ఆదిలాబాద్ రిమ్స్ కు పంపిస్తున్నారు. పెనుబల్లి మండలం అడవిమల్లేల గ్రామంలోని పీహెచ్‌‌సీలో నెల రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉండగా, ఉదయం పది గంటల వరకు కనీసం ఒక్కరు కూడా రాలేదు. పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు డాక్టర్  కోసం ఎదరుచూస్తూ కనిపించారు.
    
హుజూర్‌‌‌‌నగర్  మండలంలోని లింగగిరి గ్రామం లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్​గా డాక్టర్  పుష్పలత పని చేస్తున్నారు. బుధ, గురువారాల్లో ఆమె డ్యూటీకి రాలేదు. లీవ్  పెట్టలేదని, పర్మిషన్  కూడా తీసుకోలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే విషయంపై డాక్టర్‌‌‌‌ను ఫోన్‌‌లో సంప్రదించగా.. తన సొంత గ్రామం ఖమ్మం జిల్లా మధిరకు బదిలీ చేయించుకోవడానికి సూర్యాపేట డీఎంహెచ్ఓ ఆఫీసుకు వెళ్లినట్లు చెప్పారు. 
    
మెదక్​ జిల్లా మండల కేంద్రమైన పాపన్నపేటలోని పీహెచ్​సీలో డాక్టర్లు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం మెడికల్  ఆఫీసర్  డాక్టర్​ హరిప్రసాద్, సీహెచ్ఓ చందర్  కనిపించలేదు. ఉదయం నుంచి రెండు గంటల వరకు రోగులు ఎదురు చూసినా దవఖానాకు డాక్టర్  రాలేదు. గ్రామాల నుంచి వీక్లీ  చెకప్  కోసం గర్భిణీ స్త్రీలు రాగా, డాక్టర్  లేకపోవడంతో ఏఎన్ఎమ్స్ చెకప్​ చేసి పంపించారు. రోజూ మెడికల్​ ఆఫీసర్​ 11 గంటల తర్వాతనే పీహెచ్‌‌సీకి వస్తున్నట్లు రోగులు తెలిపారు. ఇక్కడ ఒక్క స్టాఫ్ నర్స్‌‌ కూడా అందుబాటులో లేరు. మనోహరాబాద్  మండల కేంద్రంలో గల పీహెచ్‌‌సీ 24 గంటలు పనిచేయాల్సి ఉండగా, తగినంత మంది డాక్టర్లు, స్టాఫ్  లేక రోగులకు పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. డాక్టర్ ఉదయం 9 గంటలకు రావల్సి ఉండగా, సమయ పాలన పాటించడం లేదు. సాయంత్రం 5 గంటల వరకు డాక్టర్లు సిబ్బంది ఉండాల్సి ఉండగా 3 గంటలకే వెళ్లిపోతున్నారు. రాత్రి పూట ఏఎన్ఏంలకు డ్యూటీ వేస్తున్నారు. పీహెచ్​సీలో అన్ని సౌకర్యాలు కల్పించినా ఇప్పటి వరకు ఒక్క డెలివరీ కూడా కాకపోవడం గమనార్హం.

జనగామ జిల్లాలో..  బచ్చన్నపేట పీహెచ్‌‌సీలో డాక్టర్లు గురువారం డుమ్మా కొట్టారు. ఈ పీహెచ్ సీకి మధ్యాహ్నం 3 గంటలకు ‘వెలుగు టీమ్‌‌’ వెళ్లగా ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. ఆ డాక్టర్  కూడా రూమ్​లో నిద్రపోతూ కనిపించాడు. డ్యూటీ సమయంలో పడుకోకూడదు కదా అని ప్రశ్నించగా.. జనగామ ఆస్పత్రిలో చూడుపొండి ఎలా పడుకుంటారో అని సమాధానం ఇచ్చాడు. ఉదయం వచ్చిన కొంత మంది డాక్టర్లు ఒంటి గంట వరకు ఓపీ చూసి ఇండ్లకు వెళ్లిపోయారు. జనగామ నుంచి డిప్యూటేషన్​పై వచ్చిన రాము అనే డాక్టర్  మాత్రమే ఉన్నాడు. పేషెంట్లు లేరని రూంలో ఆయన నిద్రపోతూ కనిపించాడు. బచ్చన్నపేటలోని  పీహెచ్‌‌సీలో నలుగురు డాక్టర్లు, సీహెచ్‌‌సీలో ఆరుగురు, మొత్తం 10 మంది డాక్టర్లు ఉండాలి. కానీ మధ్యాహ్నం ఖాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి.