హైదరాబాద్, పద్మారావునగర్, వెలుగు: కరోనా కొత్త కొత్త రోగాలను తెచ్చి పెడుతోంది. ఇప్పటికే కరోనా పేషెంట్లను బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) భయపెడుతుండగా, కొంత మందిలో వైట్ ఫంగస్ (ఆస్పర్ జిల్లోసిస్) కూడా కనబడుతోంది. బీహార్, తదితర రాష్ట్రాల్లో బయటపడ్డ వైట్ ఫంగస్.. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ పలువురికి సోకిందని డాక్టర్లు చెప్తున్నారు. యశోద హాస్పిటల్‌లో బ్లాక్ ఫంగస్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఓ మహిళకు వైట్ ఫంగస్ కూడా సోకినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇలా ఒకే వ్యక్తికి రెండు రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకడం అరుదు అని ఈఎన్టీ స్పెషలిస్ట్, డాక్టర్ మనుశృత్ తెలిపారు. రెండు రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ మహిళకు ఆయనే ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అనుమానం వచ్చి బయాప్సీ చేయించడంతో వైట్ ఫంగస్ కూడా సోకిన విషయం తెలిసిందన్నారు. ఆమె ఎర్లీ స్టేజ్‌లోనే హాస్పిటల్‌కు వచ్చిందని, ప్రస్తుతం ఆమె హెల్త్ కండీషన్ బాగుందని తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఎర్లీగా వచ్చి ట్రీట్‌మెంట్ తీసుకుంటేనే కోలుకుంటారని, ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ బ్రెయిన్ వరకూ పోతుందని హెచ్చరించారు.
వైట్ ఫంగస్ కు మందులున్నయ్..
హైదరాబాద్‌లోని నాలుగైదు కార్పొరేట్ హాస్పిటల్స్ లో రెండు రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకిన పేషెంట్లు కొందరు ఉన్నారని తెలుస్తోంది. కరోనా, స్టిరాయిడ్స్ వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్లే ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎటాక్ చేస్తున్నాయని ఈఎన్టీ స్పెషలిస్ట్, డాక్టర్ సంపూర్ణ ఘోష్ తెలిపారు. అయితే ఆస్పర్‌జిల్లోసిస్ కంటే మ్యుకర్ మైకోసిస్ ఎక్కువ డేంజర్ అని ఆమె చెప్పారు. వైట్ ఫంగస్ కు మందులు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్ ఫంగస్ మందులకే కొరత ఉందన్నారు.
గాంధీ హాస్పిటల్‌లో భారీగా బ్లాక్ ఫంగస్ కేసులు
కొవిడ్ నోడల్ కేంద్రం గాంధీ హాస్పిటల్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. రెండు రోజు కింద 25గా ఉన్న ఈ కేసులు శనివారం నాటికి 96కు చేరాయి. బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రంగా కోఠి ఈఎన్టీ ఆసుపత్రిని ప్రకటించినా.. అక్కడ నాన్ కొవిడ్ పేషెంట్లను మాత్రమే అడ్మిట్చేసుకుంటున్నారు. దీంతో కరోనా పాజిటివ్‌తో ఉన్న బ్లాక్ ఫంగస్ పేషెంట్లను గాంధీ హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి తీవ్రత ఉన్నవాళ్లకు ఆపరేషన్లు చేయడానికి గాంధీ హాస్పిటల్‌లో ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లో ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం వరకు గాంధీ హాస్పిటల్‌లో మొత్తం 1,273 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని, 117 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జయ్యారని నోడల్ అధికారి డాక్టర్ టి.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.
